Sankarabharanam: కళాతపస్విని మెచ్చిన నటరత్న

ABN , Publish Date - Jul 30 , 2025 | 06:42 PM

జె.వి. సోమయాజులు నటించిన 'శంకరాభరణం' చిత్రం తెలుగు సినిమా రంగంలో ఓ మైలు రాయిగా నిలిచింది. ఆ సినిమా దర్శక నిర్మాతలకు నటరత్న ఎన్టీఆర్ తో ప్రత్యేక అనుబంధం ఉంది.

Sankarabharanam Movie

తెలుగువారి హృదయాల్లో చెరిగిపోని ముద్రవేసిన చిత్రాల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ (K. Viswanath) తెరకెక్కించిన 'శంకరాభరణం' (Sankarabharanam) ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన 'శంకరాభరణం' చిత్రాన్ని పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. అప్పట్లో కొందరు సినీప్రముఖులకు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించి, వారి అభిప్రాయాలను ఈ సినిమా ప్రచారంలో వినియోగించుకున్నారు. మద్రాసులో 'శంకరాభరణం' చిత్రాన్ని మహానటుడు యన్టీఆర్ (NTR) కు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ సినిమా చూశాక రామారావు 'శంకరాభరణం' తీసిన కె. విశ్వనాథ్ ను, నిర్మించిన ఏడిద నాగేశ్వరరావును, శంకరశాస్త్రి పాత్ర పోషించిన జేవీ సోమయాజులు (JV Somayajulu) ను ఎంతగానో అభినందించారు. ఆ సందర్భంగా తీసిన ఛాయాచిత్రమే ఇక్కడ మనం చూస్తున్నది.


'శంకరాభరణం' చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఏడిద నాగేశ్వరరావుతో యన్టీఆర్ కు ఎంతో అనుబంధం ఉంది. యన్టీఆర్ హీరోగా రూపొందిన కొన్ని చిత్రాలలో ఏడిద నాగేశ్వరరావు బిట్ రోల్స్ లో కనిపించారు. యన్టీఆర్ 'ఆత్మబంధువు'లో యస్వీరంగారావు (SV Rangarao) కొడుకుల్లో ఒకరిగా నటించారు ఏడిద. అప్పటి నుంచీ రామారావుతో అనుబంధమున్న ఏడిదను 'శంకరాభరణం' చూశాక ప్రత్యేకంగా అభినందించారు. ఇక కె. విశ్వనాథ్ సౌండ్ అసిస్టెంట్ గా, తరువాత సౌండ్ ఇంజనీర్ గా విజయాసంస్థలో పనిచేస్తున్నప్పటి నుంచీ యన్టీఆర్ కు పరిచయం ఉంది. ఆ అనుబంధంతోనే యన్టీఆర్, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 'కలిసొచ్చిన అదృష్టం, నిండు హృదయాలు, చిన్ననాటి స్నేహితులు, నిండు దంపతులు' చిత్రాల్లో నటించారు. తరువాతి రోజుల్లో యన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఓ వేదికపై భానుమతి రామకృష్ణ, కె. విశ్వనాథ్ కూడా పాలు పంచుకున్నారు. ఆ సందర్భంలో భానుమతిని చూసి మళ్ళీ 'మల్లీశ్వరి' వంటి సినిమాలో నటించాలని ఉందని అన్నారు యన్టీఆర్. అంతేకాదు ఆ చిత్రానికి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందనీ ఆయన కోరారు. దీనిని బట్టే కళాతపస్విపై యన్టీఆర్ కు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది.

Also Read: Kingdom: ప్రీ రిలీజ్ టిక్కెట్స్ సేల్ సూపర్

Also Read: Indian Movies: 'యుఎ' లో వయసు పరిమితులు పట్టించుకోని నిర్మాతలు

Updated Date - Jul 30 , 2025 | 06:42 PM