Indian Movies: 'యుఎ' లో వయసు పరిమితులు పట్టించుకోని నిర్మాతలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:57 PM

ప్రస్తుతం యుఎ సర్టిఫికెట్ ను కూడా మూడు కేటగిరిల్లో సి.బి.ఎఫ్.సి. ఇష్యూ చేస్తోంది. అయితే దీనిపై అవగాహన కల్పించే విషయంలో నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.

Central board of film certification

థియేటర్లలో సినిమాలు చూసే వారికి సెన్సార్ సర్టిఫికెట్ ఇష్యూపై పలు సందేహాలు వస్తుంటాయి. హింసాత్మక సన్నివేశాలు ఉన్న కొన్ని సినిమాలను చూసినప్పుడు ఈ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? అని సోషల్ మీడియాలో వాపోతుంటారు. అలానే పిల్లలతో కలిసి కొన్ని సినిమాలకు వచ్చేసి... ఇంత విచ్చలవిడిగా ఉన్న సినిమాలకు అసలు ఎలా సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తారు? అని మధనపడతారు. అలానే కొన్ని సినిమాలకు అసలు సెన్సార్ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదనీ విమర్శిస్తుంటారు. వాళ్ళకు తెలియనిది ఏమిటంటే... సినిమా బాగోగులకు సి.బి.ఎఫ్.సి. బృందానికీ సంబంధం ఉండనేది. మరీ అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించి, ఏ వయసు వారు ఆ సినిమా చూడొచ్చో, ఆ సర్టిఫికెట్ ఇవ్వడమే వాళ్ళ పని!


గతంలో సెన్సార్ సర్టిఫికెట్ లో రెండే కేటగిరీస్ ఉండేవి. 'యు' అందరూ చూడదగ్గ చిత్రాలు, 'ఎ' పెద్దలు మాత్రమే చూడదగ్గ చిత్రాలు. అయితే 1983లో 'యు/ఎ' సర్టిఫికెట్ అనే ఓ కేటగిరిని పెట్టారు. అలానే 'ఎస్' అనే మరో కేటగిరీని ఏర్పాటు చేశారు. పర్టిక్యులర్ గా ఓ వృత్తికి సంబంధించిన వారు చూడాల్సిన సినిమా అయితే 'ఎస్' సర్టిఫికెట్ ఇస్తారు. అలానే 'యు/ఎ' సర్టిఫికెట్ పొందిన సినిమాను 12 సంవత్సరాల లోపు పిల్లలను తల్లిదండ్రులు తమతో కలిసి తీసుకెళ్ళే సౌలభ్యం కల్గించారు.

ఇవాళ 'యు' సర్టిఫికెట్ సినిమాలు చాలా అరుదైపోయాయి. చాలా సినిమాలకు యు/ఎ లేదా ఎ సర్టిఫికెట్ లభిస్తోంది. దాంతో రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం 'యు/ఎ' సర్టిఫికెట్ లో మూడు సబ్ కేటగిరిలను పెట్టాలనే సూచన చేసింది. ఇది గత యేడాది చివరిలో అమలు లోకి వచ్చింది. అప్పటి నుండి 'యు/ఎ' సర్టిఫికెట్ ను కూడా 7+, 13+, 16+ అంటూ ఇష్యూ చేస్తున్నారు. అంటే 'యు/ఎ' సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు పిల్లలను తీసుకెళ్ళే వారు ఆ సర్టిఫికెట్ ను దృష్టిలో పెట్టుకుని ఆ వయసు వారిని తీసుకెళ్ళవచ్చని సూచించడం అన్నమాట.


పట్టించుకోని నిర్మాతలు!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బృందం పలు కసరత్తులు చేసి 'యు/ఎ' సినిమాల సబ్జెక్ట్ ను, వాటిని తీసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ వయసు వారు వీటిని తల్లిదండ్రులతో కలిసి చూడొచ్చో సజెస్ట్ చేస్తుంది. కానీ దీనిని నిర్మాతలు పట్టించుకోవడం లేదు. తమ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికెట్ వచ్చినట్టు స్పెషల్ పోస్టర్స్ వేస్తున్నారు కానీ అది ఏ వయసు వారు చూడదగ్గ చిత్రమో ప్రత్యేకంగా పేర్కొనడం లేదు. దాంతో కాస్తంత ఎక్కువ యాక్షన్ ఉన్న ఈ సినిమాలకు తమతో పిల్లలను తీసుకొచ్చి... 'యు/ఎ' సర్టిఫికెట్ ఉంది కదాని పిల్లలను తీసుకొచ్చాం... ఇందులో యాక్షన్ మరీ ఎక్కువ ఉంది అంటూ విమర్శిస్తుంటారు. గత వారం వచ్చిన 'హరిహర వీరమల్లు', ఈ వారం రాబోతున్న 'కింగ్ డమ్' రెండు సినిమాలు 'యు/ఎ 16+' కేటగిరికి చెందినవే. కానీ వాటి ప్రచారంలో ఎక్కడా ఈ విషయం మనకు కనిపించదు.

చిత్రం ఏమంటే చాలామంది నిర్మాతలు అసలు తమ సినిమాలకు ఏ సర్టిఫికెట్ వచ్చిందో కూడా పోస్టర్స్ లో పేర్కొనడం లేదు. అది 'ఎ' సర్టిఫికెట్ వచ్చిన సినిమా అని తెలియక చిన్న పిల్లలను థియేటర్లకు పేరెంట్స్ తీసుకెళ్ళితే అక్కడ సిబ్బంది పిల్లల ప్రవేశానికి అడ్డు చెబితే వారితో వాదనకు దిగే వారూ ఉన్నారు. ఓటీటీలో ప్రసారం అవుతున్న వెబ్ సీరిస్, సినిమాలను గురించి ప్రస్తావిస్తూ తగువులాడే వారూ మనకు కనిపిస్తుంటారు. కానీ పబ్లిక్ స్క్రీనింగ్ విషయంలో ఖచ్చితంగా సెన్సార్ నిబంధనలు పాటించాలంటే వారికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే... ఇప్పుడు 'యు/ఎ' సర్టిఫికెట్ లో వయసు లిమిటేషన్ అనేది కేవలం అవగాహన కోసం తప్పితే... ఖచ్చితంగా పాటించాలనేమీ కాదు. నిర్మాతలు సర్టిఫికెట్ తో పాటు ఈ విషయంలో ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేస్తే... ఎవరి ఇష్టం బట్టి వారు పిల్లలను తీసుకుని సినిమాలకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది.

sar.jpg

Also Read: Thankyou Dear: బర్నింగ్ ఇష్యూ తో 'థ్యాంక్యూ డియర్'

Also Read: SS Rajamouli: వార్నర్ కి ‘బాహుబలి’ కిరీటం

Updated Date - Jul 31 , 2025 | 01:27 PM