NTR: 70 ఏళ్ళ.. 'జయసింహ'! ఈ విషయాలు.. మీకు తెలుసా
ABN , Publish Date - Oct 21 , 2025 | 02:59 PM
ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం 'జయసింహ'. ఈ సినిమాతోనే తన బ్యానర్ లో తొలి విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా విడుదలై 70 యేళ్ళు పూర్తయ్యింది.
తెలుగు చిత్రసీమలో పలు జనరంజకమైన చిత్రాలు రూపొందించిన అనేక సంస్థలు ఉన్నాయి. వాటిలో నటరత్న యన్.టి.రామారావు, ఆయన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావుకు చెందిన 'నేషనల్ ఆర్ట్ థియేటర్స్' (యన్.ఏ.టి) ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ సంస్థ నిర్మించిన పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలు జనాన్ని విశేషంగా అలరించాయి. యన్టీఆర్ సొంత బ్యానర్ లో తొలి సూపర్ హిట్ మూవీగా 'జయసింహ' నిలచింది. ఈ జానపద చిత్రం అక్టోబర్ 21న ' 70 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
1955 అక్టోబర్ 21వ తేదీన దసరా సీజన్ లో రిలీజయిన 'జయసింహ' అనూహ్య విజయం సాధించింది. అంతకు ముందు 'యన్.ఏ.టి.' పతాకంపై యన్టీఆర్ సోదరులు నిర్మించిన 'పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు' చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయే తప్ప ఆర్థిక లాభాలు చూడలేదు. అందువల్ల కమర్షియల్ హంగులతో జానపద చిత్రం 'జయసింహ'ను మూడో సినిమాగా నిర్మించారు యన్టీఆర్ బ్రదర్స్. అంజలీదేవి నాయికగా నటించిన ఈ సినిమాలో వహిదా రెహమాన్ యన్టీఆర్ జోడీగా కనిపించారు. వహిదా రెహమాన్ హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం 'జయసింహ' కావడం విశేషం! యన్టీఆర్ కు రూమ్మేట్ అయిన డి.యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. సముద్రాల జూనియర్ మాటలు, పాటలు రాశారు.
'జయసింహ' చిత్రంలో హీరో పినతండ్రి పాత్రలో యస్వీ రంగారావు నటించారు. పినతండ్రి కొడుకుగా కాంతారావు అభినయించారు. రాజ్యం కోసం అన్నకొడుకునే మట్టుపెట్టాలని చూస్తాడు రుద్రసింహ. పినతండ్రికే రాజ్యం వదలివేసి వేరే చోటకు వెళతాడు జయసింహ. అయినా అతడిని చంపే ప్రయత్నం చేస్తాడు రుద్రసింహ- పినతండ్రిపై కత్తిదూయని జయసింహను తమ్ముడు విజయసింహ కాపాడుకుంటాడు. దుర్మార్గుడైన కన్నతండ్రినే కడతేరుస్తాడు విజయసింహ. ఆ రోజుల్లో ఈ కథలోని వైవిధ్యం జనాన్ని కట్టిపడేసింది. ఇందులోని పాటలు సైతం విశేషాదరణ పొందాయి. గుమ్మడి, రేలంగి, రాజనాల, కేవీయస్ శర్మ ఇతర ముఖ్యపాత్రధారులు.
'జయసింహ' చిత్రం 1955 సంవత్సరం సూపర్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలచింది. 'జయసింహ' సినిమా ఆరు కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. గుంటూరు, విజయవాడ కేంద్రాలలో నేరుగా 169 రోజులు ప్రదర్శితమై షిఫ్ట్ పై సిల్వర్ జూబ్లీ చూసింది. బెంగళూరులో మాత్రం డైరెక్ట్ గా రజతోత్సవం జరుపుకోవడం విశేషం. రిపీట్ రన్స్ లోనూ 'జయసింహ' విశేషాదరణ చూరగొంది. ఈ సినిమా ఘనవిజయంతో యన్.ఏ.టి. సంస్థ నిలదొక్కుకుంది. తరువాత ఈ సంస్థ నుండి అనేక జనరంజకమైన చిత్రాలు రూపొందాయి. యన్.ఏ.టి. సంస్థలోనే యన్టీఆర్ డైరెక్టర్ గా పలు కళాఖండాలు వెలుగు చూశాయి. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో యన్టీఆర్ నటదర్శకునిగా అలరించారు. అందుకు 'జయసింహ' విజయం స్ఫూర్తినిచ్చిందని చెప్పాలి.
యన్టీఆర్ - అక్టోబర్ 21వ తేది...
యన్టీఆర్ సొంత బ్యానర్ లో తొలి విజయం సాధించిన 'జయసింహ' 1955 అక్టోబర్ 21న విడుదలయింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో యన్టీఆర్ తన 200వ చిత్రంగా రూపొందిన 'కోడలు దిద్దిన కాపురం' సినిమాను 1970 అక్టోబర్ 21నే విడుదల చేసి ఘనవిజయం సాధించారు. యన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరుకే చెందిన సినిమాటోగ్రాఫర్ యస్. వెంకటరత్నం యన్టీఆర్ తో నిర్మించిన 'యమగోల' చిత్రాన్ని 1977 అక్టోబర్ 21న విడుదల చేశారు. ఆ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇలా అక్టోబర్ 21వ తేదీన విడుదలైన యన్టీఆర్ 'జయసింహ, కోడలుదిద్దినకాపురం, యమగోల' - రజతోత్సవం చూశాయి. యన్టీఆర్ నటజీవితంలో చివరి సినిమాగా విడుదలైన 'శ్రీనాథ కవిసార్వభౌముడు' 1993 అక్టోబర్ 21నే విడుదల కావడం విశేషం!
Also Read: Allu Sneha Reddy : పెళ్లి కూడా కాలేదు.. అప్పుడే తోడికోడలిని సైడ్ చేసిన అల్లు అర్జున్ భార్య
Also Read: Akkineni Nagarjuna: లాటరీ కింగ్ లో చిరంజీవి.. థియేటర్లు దద్దరిల్లడమే