Tollywood: 'భామా విజయం' పేరు వెనుక కథ...

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:36 AM

'లవకుశ' తరువాత కూడా సి. పుల్లయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా మూడు చిత్రాలు రూపొందాయి. ఆ మూడు కూడా ఒకప్పుడు అలరించిన కథలే కావడం గమనార్హం!

Bhama Vijayam Telugu Cinema

తెలుగు చిత్రసీమలో మరపురాని చిత్రాలను రూపొందించిన దర్శకుల్లో చిత్తజల్లు పుల్లయ్య స్థానం ప్రత్యేకమైనది. తాను తెరకెక్కించి ఒకప్పుడు విజయం సాధించిన చిత్రాలను తరువాతి రోజుల్లో మళ్ళీ పునర్నిర్మించి ఆకట్టుకున్నారు పుల్లయ్య. తెలుగువారి తొలి బ్లాక్ బస్టర్ గా చెప్పుకొనే 1934 నాటి 'లవకుశ' సి. పుల్లయ్య దర్శకత్వంలోనే రూపొందింది. 1963లో మళ్ళీ సి. పుల్లయ్య దర్శకత్వంలోనే 'లవకుశ'ను నిర్మించారు. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన 'లవకుశ'ను లలితాశివజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఎ. శంకర రెడ్డి నిర్మించారు. ఆ రోజుల్లో భారీగా రూపొందిన ఈ చిత్రం పలు ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు 1963 మార్చి 29న విడుదలయింది. అందువల్ల కొంత భాగాన్ని సి. పుల్లయ్య తనయుడు సి. యస్. రావు రూపొందించారు. తండ్రీకొడుకులిద్దరి పేర్లనూ దర్శకులుగా ప్రకటించారు. 'లవకుశ' తరువాత కూడా సి. పుల్లయ్య దర్శకత్వంలో మూడు చిత్రాలు రూపొందాయి. ఆ మూడు కూడా ఒకప్పుడు అలరించిన కథలే కావడం గమనార్హం! 1966లో 'పరమానందయ్య శిష్యుల కథ' తెరకెక్కించారు సి. పుల్లయ్య. ఆ చిత్రం ఆ యేడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. 1967లో 'భువనసుందరి కథ'ను రూపొందించారు. అదే యేడాది 'భామావిజయం' తీశారు. ఈ మూడు చిత్రాల్లోనూ యన్టీఆర్ కథానాయకుడు కావడం విశేషం! 'భువనసుందరి కథ', 'భామా విజయం' కూడా శతదినోత్సవాలు చూశాయి.


పైన మనం చూస్తోన్న ఛాయాచిత్రం 'భామావిజయం' చిత్రం షూటింగ్ సమయంలోనిది. ఈ చిత్రానికి 1947లో సి. పుల్లయ్య దర్శకత్వంలోనే తెరకెక్కిన 'గొల్లభామ' కథ ఆధారం. ఈ సినిమాకు కూడా మొదట 'గొల్లభామ' అనే టైటిల్ ను నిర్ణయించారు. అయితే ఓ సామాజిక వర్గం వారు ఏమైనా అభ్యంతరం చెబుతారేమో అన్న అనుమానం వ్యక్తం కాగా, సి. పుల్లయ్య ఆ చిత్రానికి 'భామావిజయం' అని టైటిల్ పెట్టారు. ఇందులో యన్టీఆర్ జంటగా దేవిక నటించారు. కథానుగుణంగా హీరో జయచంద్రుని అందం చూసి మోహితులైన ఇద్దరు దేవకన్యలు - మోహిని, వాహిని ఆయనను తమ లోకానికి తీసుకుపోతారు. తరువాత జయచంద్రుని కోరికపై ఆయన భార్య సుందరిని కూడా దేవలోకం రప్పిస్తారు. ఆ తరువాత కథ పలు మలుపులు తిరిగి చివరకు సుఖాంతమవుతుంది. ఇందులో జయచంద్రునిగా యన్టీఆర్, సుందరిగా దేవిక నటించారు. మోహిని పాత్రలో ఎల్.విజయలక్ష్మి, వాహినిగా విజయనిర్మల కనిపించారు. దేవలోకం సన్నివేశాల చిత్రీకరణలోనే యన్టీఆర్, ఎల్.విజయలక్ష్మి, విజయనిర్మలతో సి.పుల్లయ్య ఇలా కనిపిస్తున్నారు.

Also Read: The Girlfriend: సింగర్ ను డిన్నర్ కు పిలుస్తానంటున్న రశ్మిక...

Also Read: Ustaad Bhagat Singh: షెడ్యూల్ పూర్తి...

Updated Date - Aug 05 , 2025 | 11:48 AM