Mrs. Parankusam: మల్లాది రాశారు... రాజా అనుకున్నారు... పూరి తీశారు...
ABN , Publish Date - Aug 08 , 2025 | 10:25 AM
ఛార్మీ టైటిల్ రోల్ ప్లే చేసిన 'జ్యోతిలక్ష్మీ' సినిమా విడుదలై పదేళ్ళు పూర్తయ్యింది. అయితే ఆ సినిమాకు మూలం ఎప్పుడు నలభై యేళ్ళ క్రితమే పడింది. కొన్నికొన్ని గట్టిగా అనుకుంటే జరుగుతాయనడానికి ఇదో ఉదాహరణ!
గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని అంటారు. కానీ ఒకరు రాసిన నవల, సినిమా వస్తే బాగుంటుందని వేరొకరు భావించారు. నాలుగు దశాబ్దాల తర్వాత అది కార్యరూపం దాల్చింది. ఈ సంఘటనల సమాహారాన్ని గమనిస్తే సినిమా స్టోరీలా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. మల్లాది వెంకట కృష్ణమూర్తి (Malladi Venkata Krishna Murthy) 1971లో రాసిన 'మిసెస్ పరాంకుశం' (Mrs Parankusam) నవల 44 సంవత్సరాల తర్వాత 2015లో 'జ్యోతి లక్ష్మీ' (Jyothy Lakshmi) పేరుతో సినిమాగా వచ్చింది. ఈ మూవీ వచ్చి జూన్ 12కి పదేళ్ళు పూర్తయ్యింది. విశేషం ఏమంటే... ఆ సినిమాతో పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఛార్మి (Charmy) మధ్య ఏర్పడిన అనుబంధం బలపడి వారిద్దరూ కలిసి సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు. పదేళ్ళుగా వారు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అలానే ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ (Satyadev) ఇవాళ తెలుగులో ప్రామిసింగ్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. పరభాషా చిత్రాలలోనూ నటిస్తున్నాడు. 'జ్యోతి లక్ష్మీ' సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా... నిర్మాత సి. కళ్యాణ్ (C. Kalyan) ఎంతో ఇష్టంగా ఛార్మితో కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీ అది. అలానే ఈ సినిమా మేకింగ్ ఓ అందమైన పుస్తకం రూపంలోనూ ఆ తర్వాత వచ్చింది. అయితే... ఈ సినిమాకు బీజం 1971లో మల్లాది రాసిన 'మిసెస్ పరాంకుశం'తో పడింది.
ఆసక్తికరమైన అంశాలు ఎన్నెన్నో...
మల్లాది వెంకట కృష్ణమూర్తి రచయితగా గుర్తింపు తెచ్చుకుంటున్న కాలమది. 1971లో అప్పటికీ అవివాహితుడైన మల్లాది గాంధీనగర్ లో ఉండేవారు. ఆయన ఇంటి వెనుక ఉన్న ఓ వేశ్యావాటికను గమనిస్తూ, అక్కడికి వచ్చే విటులను, అక్కడి వారిని గమనిస్తూ ఉండేవారు. ఆ సంఘటనల నేపథ్యంలో దీనినో నవలగా ఎందుకు రాయకూడదని మల్లాదికి అనిపించింది. వెంటనే ఆయన సినాప్సిస్ రాసి ఆంధ్ర ప్రభ వీక్లీకి పంపితే, అది అప్రూవ్ అయ్యింది. ఆయన వెంటనే నవల రాసేశారు. అది తొమ్మిది వారాల పాటు ఆంధ్రప్రభ వీక్లీలో సీరియల్ గా వచ్చింది. ఆ తర్వాత మచిలీపట్నంకు చెందిన ఎమెస్కో అధినేత ఎం.ఎన్. రావు దానిని పుస్తకంగా ప్రచురించారు. 'మిసెస్ పరాంకుశం'కు మల్లాది మొదట అనుకున్న పేరు 'ముందంజ', 'ముందడుగు'. ఎందుకంటే ఓ వేశ్యను దగ్గరగా గమనించిన ఒక యువకుడు సమాజానికి ఎదురునిల్చి ఆమెకు ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించడమే ఈ నవల సారాంశం. అయితే ఆ రెండు పేర్లలో అంత ఫోర్స్ లేదని గమనించిన మల్లాది... 'సౌదామిని' అని పెడదామనుకున్నారు. కానీ అదీ నచ్చక... కథానాయకుడు పరాంకుశం పేరు కలిసి వచ్చేలా 'మిసెస్ పరాంకుశం' అని పెట్టేశారు. ఈ సీరియల్, ఆ తర్వాత పుస్తకంగా వచ్చిన నవల చాలామందికి బాగా నచ్చింది.
ప్రముఖ దర్శకులు పి. సాంబశివరావు అప్పట్లో ఆ నవల నచ్చి సినిమా తీద్దామనుకుని మల్లాది ని కలవాలనుకున్నారు. అలా వారిద్దరూ తొలిసారి ద్వారకా హోటల్ లో కలిశారు. నవల గురించి చర్చించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రముఖ దర్శకులు విక్టరీ మధుసూదనరావు కూడా దీన్ని సినిమా తీయాలనే ఆలోచనతో మల్లాదిని బ్లూమూన్ హోటల్ లో కలిసి చర్చలు జరిపారు. అదీ ఫైనలైజ్ కాలేదు. ఇదిలా జరుగుతుండగా... ప్రముఖ రచయిత, మ్యూజికాలజిస్ట్ రాజా (Raja) 1989లో విజయచిత్ర మాస పత్రికలో ఓ శీర్షికలో 'మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన 'మిసెస్ పరాంకుశం' అద్భుతమైన నవల. ఓ వేశ్య కథను ఆయన ఎంతో నేర్పుతో రాశారు. దీనిని గనుక ఓ కమిట్ మెంట్ తో తీయగలిగే మంచి సినిమా అవుతుంది' అని తన మనసులో మాట రాశారు. ఆయన అలా రాసిన సుమారు పాతికేళ్ళకు అది కార్యరూపం దాల్చింది. ఇదిలా ఉంటే... 2009లో ఓ ప్రముఖ దర్శకుడు ఈ నవల హక్కుల్ని సినిమాగా తీయడానికి తీసుకున్నారని మల్లాది ఓ సందర్భంలో రాశారు. అయితే ఆ దర్శకుడి పేరును ఆయన సమ్మతి లేకపోవడంతో మల్లాది ప్రస్తావించలేదు. ఎప్పుడైతే 2015లో ఇది 'జ్యోతిలక్ష్మీ'గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమాగా వచ్చిందో... దానికి ఆరేళ్ళ ముందు ఆ నవల హక్కుల్ని తీసుకున్న దర్శకుడు పూరి నే అనిపించింది. మొత్తానికి ఎవరైనా గట్టిగా ఏదైనా అనుకుంటే అది జరుగుతుందని అనుకోవడానికి ఇదో ఉదాహరణ.
మల్లాది నవలలు సినిమాలుగా చాలానే వచ్చాయి. అయితే కొన్ని వెంటనే వస్తే మరికొన్ని దశాబ్దాల తర్వాత వచ్చాయి. ఆయన ఎంపిక చేసుకునే కథా వస్తువు ఎప్పటికీ పాత పడిపోదు అనడానికి రెండు తాజా ఉదాహరణలున్నాయి. మల్లాది తన కెరీర్ ప్రారంభంలోనే రాసిన 'మేఘమాల' (Meghamala) అనే నవల కూడా దాదాపు నలభై సంవత్సరాల తర్వాత వంశీ (Vamsy) దర్శకత్వంలో 'వెన్నెల్లో హాయ్ హాయ్' పేరుతో సినిమాగా వచ్చింది. అయితే ఇది సెట్స్ మీద ఉన్నప్పుడు వంశీ ఇష్టపడి పెట్టుకున్న పేరు 'తను మొన్నే వెళ్ళిపోయింది'!. ఇక మల్లాది మూడు దశాబ్దాల క్రితం రాసిన 'అందమైన జీవితం' సినిమా కూడా ఆ మధ్య దర్శకుడు రాజ్ రాచకొండ హిందీలో '8 ఎ. ఎం. మెట్రో' (8 AM Metro) పేరుతో సినిమాగా తీశారు. కానీ ఈ సినిమాలేవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అందుకు కారణం ఆ దర్శకులు సమర్థవంతంగా నవలలను తెర మీద ప్రెజెంట్ చేయలేకపోవడమే తప్ప మరొకటి కాదు!
Also Read: The Paradise: ది ప్యారడైజ్.. నాని జడల్ లుక్
Also Read: Kantara Chapter1: కాంతార.. కనకవతి వచ్చేసింది! రుక్మిణి లుక్ అదిరింది