Maheshbabu: పదిహేనేళ్ళ 'ఖలేజా'...

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:50 PM

పదిహేనేళ్ళ క్రితం 'ఖలేజా'తో జనం ముందు నిలిచారు మహేశ్ బాబు. ఆ సినిమా అప్పట్లో అంతగా అలరించలేదు. కానీ, ఈ మధ్య రీ-రిలీజై రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచీ మహేశ్ - రాజమౌళి కాంబోలో సినిమా తీయాలని ఆశిస్తోన్న కె. యల్. నారాయణ ఇన్నాళ్ళకు తన కల నెరవేర్చుకుంటూ ఉండడం విశేషంగా మారింది.

Mahesh Babu Khaleja

పదిహేనేళ్ళ క్రితం అక్టోబర్ 7వ తేదీన మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో 'ఖలేజా' (Kakhaleja) సినిమా జనం ముందు నిలచింది. సింగనమల రమేశ్ బాబు, సి.కళ్యాణ్, సత్య రామ్మూర్తి నిర్మించిన 'ఖలేజా' పరాజయం పాలయింది. ఆ సినిమాను బుల్లితెరపై వీక్షించిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. వినోదభరితంగా సాగిన 'ఖలేజా' ఎందుకు ఫెయిలయ్యిందో ఎవరూ చెప్పలేకపోయారు. కానీ, టీవీలో వచ్చిన ప్రతీసారి 'ఖలేజా' ఆకట్టుకుంటూనే సాగింది. ఈ మధ్యే 'ఖలేజా' రీ-రిలీజై విశేషాదరణ చూరగొంది. టాలీవుడ్ రీ-రిలీజెస్ మూవీస్ లో నంబర్ వన్ గా నిలచింది 'ఖలేజా'.


'ఖలేజా' 2010లో జనం ముందు నిలచింది. అంతకు ముందు 2006లో జూనియర్ యన్టీఆర్ తో 'రాఖీ' (Rakhi) సినిమా తీసిన డాక్టర్ కె.యల్.నారాయణ (Dr K.L. Narayana) ఆ తరువాత మహేశ్ హీరోగా రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో ఓ సినిమా తీయాలని ప్రయత్నించారు. 'ఖలేజా'కు ముందు మహేశ్ 2007లో 'అతిథి' సినిమాతో జనాన్ని పలకరించారు. ఆ సినిమా ఆట్టే ఆకట్టుకోలేక పోయింది. కారణాలు ఏవైనా మహేశ్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ తో 'ఖలేజా'లో నటించారు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాక అలరించలేకపోయింది. అప్పటి నుంచీ మహేశ్, రాజమౌళి డేట్స్ కుదరక కె.యల్.నారాయణ కూడా తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. రాజమౌళి తాను ఎంత ఎత్తుకు ఎదిగినా, అప్పట్లో ఇచ్చిన మాటకు కట్టుబడి తాను మహేశ్ హీరోగా కె.యల్.నారాయణకు ఓ సినిమా చేయవలసి ఉందని అంటూ చెప్పేవారు. ఇన్నాళ్ళకు అది కార్యరూపం దాల్చడం విశేషం. ఈ యేడాది మహేశ్-రాజమౌళి సినిమా ఆరంభమైనా, ఆ సినిమా మరో రెండేళ్ళకు అంటే 2027లో జనం ముందుకు వస్తుందని వినిపిస్తోంది.


'ఖలేజా' సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్. అది అంతగా మురిపించలేదు. ఆ సినిమా తరువాత వచ్చిన 'దూకుడు' బంపర్ హిట్ గా నిలచింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కానుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మహేశ్ - రాజమౌళి సినిమాలో నటించకముందు కనిపించిన చివరి చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ దర్శకుడు. 'గుంటూరు కారం' బాక్సాఫీస్ వద్ద ఘాటు చూపించలేకపోయింది. అందువల్ల ఈ సినిమా తరువాత రాబోయే రాజమౌళి- మహేశ్ మూవీ బంపర్ హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈ తాజా చిత్రంపై వారానికో విశేషం వినిపిస్తూనే ఉంటోంది. ఈ చిత్రాన్ని 120కి పైగా దేశాల్లో ఆ యా భాషల్లో రిలీజ్ చేయడానికీ రాజమౌళి అండ్ కో పథకం రచించిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే, హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో మహేశ్ -రాజమౌళి సినిమా అలరిస్తుందనీ అంటున్నారు. ఇలా ఫ్యాన్స్ లో ఆశలు రేకెత్తుస్తున్న సినిమా జనం ముందు నిలచి ఏ తీరున ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Thursday Tv Movies: గురువారం, Oct 9.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Also Read: Kantara Chapter1: అప్పుడు పుష్ప‌.. ఇప్పుడు కాంతార అగ‌ర‌బ‌త్తీలు

Updated Date - Oct 08 , 2025 | 01:50 PM