నాలుగున్నర దశాబ్దాల రామ్ రాబర్ట్ రహీమ్

ABN , Publish Date - May 31 , 2025 | 05:39 PM

సూపర్ స్టార్ కృష్ణ, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా 'రామ్ రాబర్ట్ రహీమ్'. హిందీ చిత్రానికి రీమేక్ అయిన ఈ మూవీకి చక్రవర్తి సంగీతం అందించారు.

నటశేఖర కృష్ణ (Krishna), రజనీకాంత్ (Rajnikanth), చంద్రమోహన్ (Chandra Mohan) కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం 'రామ్ రాబర్ట్ రహీమ్'. హిందీ రీమేక్స్ కు తెలుగులో ఆదరణ సాగుతున్న రోజుల్లో 1980 మే 31న 'రామ్ రాబర్ట్ రహీమ్' విడుదలయింది. ఈ చిత్రాన్ని కృష్ణ సతీమణి విజయనిర్మల (VijayaNirmala) దర్శకత్వంలో కృష్ణ సోదరి భర్త ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు నిర్మించారు. హిందీలో ఘనవిజయం సాధించిన 'అమర్ అక్బర్ ఆంథోని' (Amar Akbar Antony) సినిమా ఆధారంగా 'రామ్ రాబర్ట్ రహీమ్' రూపొందింది. హిందీలో అమితాబ్ బచ్చన్ ధరించిన పాత్రను కృష్ణ పోషించగా, వినోద్ ఖన్నా రోల్ లో రజనీకాంత్, రిషికపూర్ పాత్రలో చంద్రమోహన్ నటించారు. ఇక ఇందులో కృష్ణకు జోడీగా శ్రీదేవి, రజనీకాంత్ జంటగా ఫటాఫట్ జయలక్ష్మి, చంద్రమోహన్ సరసన సునీత కనిపించారు.


కృష్ణ బర్త్ డే కానుకలుగా విడుదలైన చిత్రాలలో ఫ్యాన్స్ ను అలరించిన చిత్రంగా 'రామ్ రాబర్ట్ రహీమ్' నిలచింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక కలిపి ఈ సినిమా మొదటి వారం వసూళ్ళు రూ.32 లక్షలకు పైగా ప్రకటించారు. అంతకు ముందు కృష్ణ, రజనీకాంత్ కలసి నటించిన 'అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే' చిత్రాలు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోమారు కృష్ణ, రజనీకాంత్ కలయికతో 'రామ్ రాబర్ట్ రహీమ్'కు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. పైగా ఆ సమయంలో చంద్రమోహన్ సైతం చిన్న చిత్రాల హీరోగా రాణిస్తున్నారు. ఇలా ఈ ముగ్గురు హీరోల కాంబోలో తెరకెక్కిన 'రామ్ రాబర్ట్ రహీమ్' మంచి ఆదరణ చూరగొంది. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఈ సినిమా విశేషాదరణ చూరగొనడానికి రజనీకాంత్ కాంబో కలసి వచ్చింది.

'రామ్ రాబర్ట్ రహీమ్' చిత్రానికి త్రిపురనేని మహారథి మాటలు రాశారు. చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆచార్య ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, వేటూరి, సాహితి పాటలు పలికించారు. ఇందులోని పాటలు కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి నిర్మాతకు లాభాలు తెచ్చిన చిత్రంగా 'రామ్ రాబర్ట్ రహీమ్' నిలచింది.

Also Read: Sekhar Kammula: ఆయనతో సినిమా తీయాలనే ఫీలింగ్‌ అంతే...

Also Read: Kankhajura web series : కంఖాజుర వెబ్ సీరిస్ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 31 , 2025 | 05:46 PM