Kankhajura web series : కంఖాజుర వెబ్ సీరిస్ రివ్యూ

ABN , Publish Date - May 31 , 2025 | 04:21 PM

అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియచేసే సినిమాలు అనేకం వచ్చాయి. అయితే అలాంటి కథలతో వచ్చిన వెబ్ సీరిస్ తక్కువ. కానీ కేవలం అన్నదమ్ముల అనుబంధమే కాకుండా వారి మిస్టీరియస్ యాక్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన వెబ్ సీరిస్ 'కంఖాజుర'.

సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒరిజినల్ కంటెంట్ ను విశేషంగా ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంటర్నేషనల్ గా ఇప్పటికే వీక్షకుల ఆదరణ పొందిన వెబ్ సీరిస్ లనూ ఇందులో భాగంగా రీమేక్ చేస్తోంది. అలా ఆరేళ్ళ క్రితం వచ్చిన 'మాగ్ పై' (Magpie) అనే ఇజ్రాయిలీ వెబ్ సీరిస్ ను 'కంఖాజుర' (KanKhajura) పేరుతో రీమేక్ చేసింది. మే 30 నుండి సోనీ లివ్ లో ఇది ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్ వన్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫిల్మ్ ఎడిటర్ నుండి డైరెక్టర్ గా మారిన చందన్ అరోరా (Chandan Arora) దర్శకత్వంలో ఈ వెబ్ సీరిస్ ను అజయ్ రాయ్ (Ajay Rai) నిర్మించాడు.


కథేంటంటే...

ఇది గోవా నేపథ్యంలో సాగుతుంది. మాక్స్ (మోహిత్ రైనా, Mohith Raina), ఆషు (రోషన్ మాథ్యూ, Roshan Mathew) అన్నదమ్ములు. చిన్నప్పటి నుండి నత్తివాడైన తమ్ముడు ఆషు అంటే మాక్స్ కు చిన్న చూపే. అతనే కాదు... అతని స్నేహితులు పెడ్రో (నినద్ కామత్, Ninad Kamat), శార్దూల్ (మహేశ్ కృష్ణ శెట్టి) కూడా ఆషు ను హేళన చేస్తూ ఉంటారు. అన్నయ్య అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆషు... అతని పరువు కాపాడటం కోసం ఓ లేడీ టూరిస్ట్ ను హత్య చేసి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలు నుండి అతను విడుదలై బయటకు రావడంతో ఈ వెబ్ సీరిస్ మొదలవుతుంది.

ఆషు జైలు నుంచి వచ్చే సమయానికి మాక్స్ ఓ గ్రాండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తాడు. కాలువ ఒడ్డున్ ఉండే శాస్త్రి కాలనీ వాసుల నుండి భూమిని తీసుకుని అక్కడ విల్లాస్ నిర్మించాలన్నది అతని కల. భార్య నిషా (సారా జేన్ డియాజ్, Sarah Jane Dias), మిత్రులు షార్దుల్, పెడ్రూ అతనికి తోడుంటారు. అయితే జైలు నుండి వచ్చిన తమ్ముడు ఆషుని మాత్రం మాక్స్ దూరం పెడతాడు. బట్ అన్నయ్య మీద ఉన్న పిచ్చి ప్రేమతో అతను ఈ ప్రాజెక్ట్ కు ఎదురైనా ప్రతి అవరోధాన్ని తప్పిస్తుంటాడు. చిత్రం ఏమంటే... ఆషు ఎత్తుగడలను తట్టుకోలేని మాక్స్ చివరకు జైలు పాలు అవుతాడు. శార్దల్ ఆచూకీ దొరక్కుండా పారిపోతాడు. పెడ్రో కాలిన గాయాలతో హాస్పిటల్ పాలవుతాడు. చివరకు మాక్స్ భార్య నిషా సైతం భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ను తన హస్తగతం చేసుకుంటుంది. అసలు ఆషు మనసులో ఏముంది? అన్న కోసం జైలుకు వెళ్ళిన అతను చివరకు అన్ననే ఎందుకు జైలు పాలు చేశాడు? అనేదే అసలు మిస్టరీ. 'కంఖాజుర' అంటే కాళ్ళ జెర్రి అని అర్థం. ఇందులో ఆషు నడక, నడత దానినే గుర్తు చేస్తుంది. ఆ రకంగా ఈ టైటిల్ ఈ వెబ్ సీరిస్ కు యాప్ట్. అయితే ఈ ఫస్ట్ సీజన్ లో ఆషు అంతర్గతం ఏమిటనేది మాత్రం రివీల్ చేయలేదు. దాని కోసం సెకండ్ సీజన్ కోసం వేచి ఉండాల్సిందే.

రియల్ ఎస్టేట్ వ్యాపారం నేపథ్యంలో 'కంఖాజుర' తెరకెక్కినా... అన్నదమ్ముల మధ్య ఉండే ఇగో క్లాషెస్ కే ప్రాధాన్యమిచ్చారు. వెబ్ సీరిస్ లకు నిడివి అనేది సమస్య కాదు కాబట్టి డైరెక్టర్ చందన్ అరోరా తాను చెప్పాలనుకున్న అంశాలను బలంగా చెప్పడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఆషు అనుమానాస్పద వైఖరిని ఆసక్తికరంగా మలిచాడు.


kan.jpg

నటీనటుల విషయానికి వస్తే...

రోషన్ మాథ్యు... ఆషు పాత్రను చక్కగా పోషించాడు. జైలు జీవితాన్ని గడిపి వచ్చిన తర్వాత అతను పోలీస్ ఇన్ ఫార్మర్ గానూ పనిచేస్తుండటం, అందులో భాగంగా పలు మార్లు జైలుకు వెళ్ళే సన్నివేశాలు వ్యూవర్స్ ను కాస్తంత కన్ ఫ్యూజన్ కు గురిచేస్తాయి. మోహిత్ రైనా ఇందులో మాక్స్ గా కీలక పాత్రను సమర్థవంతంగా చేశాడు. అతని భార్య నిషా గా గతంలో పవన్ కళ్యాణ్‌ 'పంజా'లో నటించిన సారా జేన్ డియాజ్ యాక్ట్ చేసింది. శాస్త్రి కాలనీని తన గుప్పెట్లో పెట్టుకునే లేడీ డాన్ పాత్రను పాపులర్ యాక్ట్రస్ ఉషా నాదకర్ణి (Usha Nadkarni) బాగా చేసింది. నిజ జీవితంలోనూ ట్రాన్స్ జెండర్ అయిన త్రినేత్ర హాల్దార్ గుమ్మరాజు అదే తరహా పాత్రను ఇందులో పోషించింది. ఇతర ప్రధాన పాత్రలను నినద్ కామత్, మహేశ్ కృష్ణ శెట్టి, హీబా షా, అనంత్ జోగ్, కస్తూరి బెనర్జీ, సచిన్ అశోక్ షిండే తదితరులు చేశారు. నటీనటులంతా పాత్రోచితంగా నటించారు.

ఎలా ఉందంటే...

మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. అయితే... కొట్లాడుకున్న రెండు వర్గాలకు చెందిన వారిని ఒకే సెల్ లో బంధించడం, సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తుల నిర్ణయాలను ఒక్క సిట్టింగ్ లోనే ఆషు మార్చేయడం అనేవి కన్వెన్సింగ్ గా అనిపించవు. అలాంటి లూప్ హోల్స్ కొన్ని లేకపోలేదు. అక్కడక్కడా ఉన్న ఎరోటిక్ సీన్స్ ను, ఫౌల్ లాంగ్వేజ్ ను తొలగించి ఉంటే... ఇది అందరూ కలిసి చూసే వెబ్ సీరిస్ గా నిలిచి ఉండేది. ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ 'కంఖాజుర'కు ఓ మెట్టు పైన నిలబెట్టాయి.

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: మిస్టీరియస్ జర్నీ!

Also Read: Rashmika Mandanna: ఎవర్నో సంతోషపెట్టాలనే భారాన్ని మోయకండి

Also Read: Sreeleela engagement: శ్రీలీల నిశ్చితార్థం.. కమింగ్‌ సూన్‌...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 31 , 2025 | 04:27 PM