సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR: తెలుగునాట తొలి 70 ఎమ్.ఎమ్. రామకృష్ణ థియేటర్

ABN, Publish Date - Jul 12 , 2025 | 10:14 PM

యన్టీఆర్ కు 1963 ప్రాంతంలోనే మన రాజధానిలో ప్రతిష్ఠాత్మకమైన థియేటర్ల సముదాయాన్ని నిర్మించాలన్న కోరిక ఉండేది. అది అమలు కావడానికి చాలా రోజులు పట్టింది. మొత్తానికి 1968లో యన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి 70 ఎమ్.ఎమ్. థియేటర్ గా రామకృష్ణను నిర్మించారు.

చిత్రసీమలో సంపాదించింది మళ్ళీ సినిమారంగానికే వినియోగించాలన్నది నటదర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ (L V Prasad)అభిప్రాయం. ఆయన అలాగే సాగారు. ఎల్వీ ప్రసాద్ 'మనదేశం'తో తెరకు పరిచయమైన నటరత్న యన్టీఆర్ (NTR) కూడా తన గురువుగారి బాటలోనే పయనించేవారు. చిత్రసీమలో తాను, తన సోదరుడు నందమూరి త్రివిక్రమరావు సంపాదించిన మొత్తంతో తెలుగునేల గర్వించే థియేటర్లను కట్టాలని ఆయన భావించారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆబిడ్స్ లో చోటు కొనుగోలు చేశారు. అలా 1963 ప్రాంతంలోనే యన్టీఆర్ కు మన రాజధానిలో ప్రతిష్ఠాత్మకమైన థియేటర్ల సముదాయాన్ని నిర్మించాలన్న కోరిక ఉండేది. అది అమలు కావడానికి చాలా రోజులు పట్టింది. మొత్తానికి 1968లో యన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి 70 ఎమ్.ఎమ్. థియేటర్ గా రామకృష్ణను నిర్మించారు. దాని చెంతనే రామకృష్ణ 35 ఎమ్.ఎమ్. నూ కట్టించారు. అలాగే అదే ప్రాంగణంలో ఓ హోటల్ నూ ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ఆవరణను 'యన్టీఆర్ ఎస్టేట్స్' గా రూపొందించారు. ఈ సముదాయం ప్రారంభోత్సవంలో యన్టీఆర్ కన్నవారు నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకటరావమ్మ పాల్గొన్నారు. యన్టీఆర్, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు తమ భార్యాపిల్లలతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఆ నాటి ఫొటో ఈ మధ్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. 2023లో యన్టీఆర్ శతజయంతి పూర్తయింది. ఆ సమయంలో యన్టీఆర్ కు సంబంధించిన అనేక ఛాయాచిత్రాలు వెలుగు చూశాయి. అలా రామారావు సినిమాల్లోనివి, ఆయన వ్యక్తిగత జీవితంలోని పలు ఫోటోలు జనాన్ని అలరిస్తున్నాయి. అందులో 'యన్టీఆర్ ఎస్టేట్స్' ప్రారంభోత్సవం నాటి ఛాయాచిత్రం ఇక్కడ దర్శనమిస్తోంది.


ఈ థియేటర్స్ మొదలైన దగ్గర నుంచీ చాలా రోజులు హిందీ చిత్రాలే ఇందులో ప్రదర్శితమయ్యేవి. అడపా దడపా తెలుగు సినిమాలు విడుదలయ్యేవి. యన్టీఆర్ ఎస్టేట్స్ ఒకప్పుడు హైదరాబాద్ కు ఓ ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. ఆ రోజుల్లో హైదరాబాద్ కు వచ్చిన వారు చార్మినార్, గోల్కొండతో పాటు యన్టీఆర్ ఎస్టేట్స్ ను సందర్శించి అక్కడ ప్రదర్శితమయ్యే చిత్రాలను వీక్షించి ఆనందించేవారు. రామకృష్ణ 70 ఎమ్.ఎమ్. థియేటర్ లో పలు హిందీ చిత్రాలు విజయభేరీ మోగించాయి. అన్నిటి కన్నా మిన్నగా 1975 ఆగస్టు 15న వచ్చిన 'షోలే' రామకృష్ణ 70 ఎమ్.ఎమ్. డైరెక్ట్ గా 80 వారాలదాకా నడిచింది. ఈ నాటికీ హైదరాబాద్ లో డైరెక్ట్ గా అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా 'షోలే' నిలచే ఉంది. అందుకు రామకృష్ణ 70 ఎమ్.ఎమ్. వేదిక అయింది. యన్టీఆర్ వారసులు ఈ ఎస్టేట్స్ ను కాపాడుకోలేకపోయారని వినిపిస్తోంది. ఆయన వారసుల్లో ఎవరికి వారు తమ వాటాలుగా వచ్చిన థియేటర్లను అమ్మేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ నాటికీ ఆ నాటి జనానికి ఆబిడ్స్ అనగానే యన్టీఆర్ ఎస్టేట్ గుర్తుకు వస్తూ ఉంటుంది.

Also Read: Rajinikanth: బాలచందర్ చెక్కిన శిల్పం...

Updated Date - Jul 12 , 2025 | 10:14 PM