Rajinikanth: బాలచందర్ చెక్కిన శిల్పం...

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:02 PM

'అవళ్ ఒరు తోడర్ కథై' చిత్రాన్ని తెలుగులో 'అంతులేని కథ' గా రూపొందించారు కె.బాలచందర్. అందులో హీరోయిన్ జయప్రద అన్న పాత్రలో రజనీకాంత్ ను నటింప చేసి తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమాతో నటునిగా మంచి మార్కులు సంపాదించారు రజనీకాంత్.

మద్రాస్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో నటశిక్షణ తీసుకొనే విద్యార్థినీ విద్యార్థులకు కొందరు ప్రముఖ దర్శకులు పాఠాలు చెప్పేవారు. పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్స్ గానూ వ్యవహరించేవారు. ప్రముఖ తమిళ దర్శకుడు కె.బాలచందర్ (K.Balachander)తన సినిమాల ద్వారా కొత్త ముఖాలను పరిచయం చేయాలనే తపన ఉండేది. అందువల్ల ఆయనే స్వచ్ఛందంగా వెళ్ళి పాఠాలు చెప్పడం, ఇన్విజిలేటర్ గా వ్యవహరించడం చేసేవారు. ఓ బ్యాచ్ లో శివాజీ రావ్ గైక్వాడ్ అనే స్టూడెంట్ బాలచందర్ దృష్టిని ఆకర్షించారు. అతని చలాకీతనం, ముఖ్యంగా అతని కళ్ళలోని మెరుపు బాలచందర్ ను ఆకట్టుకున్నాయి. తన 'అపూర్వ రాగంగళ్' (Apoorva Ragangal) మూవీతో ఆ శివాజీ రావ్ కు అవకాశం కల్పించారు. ఆ చిత్రంతోనే శివాజీని కాస్తా రజనీకాంత్ గా పరిచయం చేశారు బాలచందర్. అందులో శ్రీవిద్య భర్తగా, జయసుధ తండ్రిగా మధ్యవయస్కుని పాత్రలో నటించారు రజనీకాంత్. తొలి సినిమాలోనే ఇలాంటి వేషం వేసిన రజనీకాంత్ గురువు బాలచందర్ తో శభాష్‌ అనిపించుకున్నారు.


తన 'అవళ్ ఒరు తోడర్ కథై' చిత్రాన్ని తెలుగులో 'అంతులేని కథ' (Anthuleni Katha)గా రూపొందించారు కె.బాలచందర్. అందులో హీరోయిన్ జయప్రద అన్న పాత్రలో రజనీకాంత్ ను నటింప చేసి తెలుగు తెరకు పరిచయం చేశారు బాలచందర్. ఆ సినిమాతో నటునిగా మంచి మార్కులు సంపాదించారు రజనీకాంత్. ఆ పై మరికొన్ని బాలచందర్ చిత్రాల్లోనూ రజనీకాంత్ తనకు కేటాయించిన పాత్రల్లో అభినయించి అలరించారు. 1975లో 'అంతులేని కథ'ను సెట్స్ పైకి తీసుకువెళ్ళారు. అందులో ఓ కీలక సన్నివేశాన్ని రజనీకాంత్, జయప్రదకు వివరిస్తూన్నారు బాలచందర్. గురువు చెప్పిన సూచనల మేరకు పాత్రలోకి ఒదిగిపోయారు రజనీకాంత్. ఇక్కడ కనిపించే ఫొటోను క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ రజనీకాంత్ ఎంతలా ఆ పాత్రను ఆకళింపు చేసుకున్నారో అర్థమవుతుంది. ఈ సినిమా 1976 ఫిబ్రవరి 27న విడుదలై తెలుగునాట ఘనవిజయం సాధించింది. ఇందులో రజనీకాంత్ పై చిత్రీకరించిన ఏసుదాస్ (KJ Yesudas) పాడిన 'దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటీ...' సాంగ్ ఈ నాటికీ పండితపామర భేదం లేకుండా అందరినీ అలరిస్తోంది.

Also Read: Janhvi Kapoor: ఆగస్ట్ లో వస్తామంటున్న పరమ్ సుందరి...

Updated Date - Jul 12 , 2025 | 10:04 PM