ANR: గాయకుడు రామకృష్ణ గానయాత్ర...
ABN, Publish Date - Sep 30 , 2025 | 05:44 PM
దుక్కిపాటి మధుసూదనరావు పరిచయం చేసిన గాయకుల్లో పి. రామకృష్ణ ఒకరు. అక్కినేని విచిత్ర బంధంచిత్రంలోని చిక్కావు చేతిలో చిలకమ్మ పాటతో రామకృష్ణ చిత్రసీమలోకి అడుగుపెట్టారు.
మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) , ఆయన గురుసమానులు దుక్కిపాటి మధుసూదనరావు తమ 'అన్నపూర్ణ పిక్చర్స్' నిర్మించిన చిత్రాల ద్వారా పలువురిని చిత్రసీమకు పరిచయం చేశారు. వారిలో కె. విశ్వనాథ్ (K Vishwanadh) వంటి దర్శకులు, దాశరథి, గొల్లపూడి (Gollapudi) వంటి రచయితలు ఉన్నారు. గాయకుల్లో వి. రామకృష్ణ (V Ramakrishna) ప్రత్యేక స్థానం ఆక్రమించారు. ఘంటసాల ఉండగానే ఆయన గాత్రాన్ని అనుకరిస్తూ పలు వేదికలపై రామకృష్ణ తన గాన ప్రతిభను చాటుకున్నారు. మధురగాయని పి. సుశీల (P. Suseela) అక్క కుమారుడే రామకృష్ణ. అందువల్ల ఆమె ప్రోత్సాహంతో అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన 'విచిత్రబంధం' సినిమాలో రామకృష్ణకు తొలిసారి గాయకునిగా అవకాశం లభించింది. ఇందులో ఏయన్నార్ కు 'చిక్కావు చేతిలో చిలకమ్మా...' అంటూ సాగే టీజింగ్ సాంగ్ ను గానం చేశారు రామకృష్ణ. ఏయన్నార్ అభినయానికి తగ్గట్టుగా రామకృష్ణ గళం ఉందని ఎందరో ప్రశంసించారు. ఆ సందర్భంలోనే ఏయన్నార్ తో గాయకుడు రామకృష్ణ తీయించుకున్న ఛాయాచిత్రమిది.
ఘంటసాల తరువాత ఎవరు అన్న ప్రశ్న ఉదయించినప్పుడు చాలామంది తెలుగు సినిమాజనం రామకృష్ణనే సమాధానంగా ఎంచుకున్నారు. అలా యన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా రామకృష్ణ గానంతో సాగారు. కృష్ణ మాత్రం ఎక్కువగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటతోనే పయనించారు. పద్యాలు పాడడంలో రామకృష్ణలో ఘంటసాల బాణీని చూశారు యన్టీఆర్ (NTR). అందువల్లే తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'దానవీరశూర కర్ణ'లో కృష్ణుని రాయబారం పద్యాలను రామకృష్ణ చేతనే ఆలపింప చేశారు. రామకృష్ణ చలాకీ పాటలు, స్పీడున్న సాంగ్స్ పాడలేరనే పేరు వచ్చింది. అలా మెల్లగా బాలు అందరు హీరోలకు తన గానచాతుర్యంతో అలరిస్తూ సాగారు. రామకృష్ణ మెల్లగా మసకబారిపోయారు. ఏదో ప్రత్యేక గీతాల్లోనే రామకృష్ణ గానం వినిపించేది. అందరూ బాలు గానంతోనే సాగుతున్న సమయంలో యన్టీఆర్, తన 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర'లో బ్రహ్మంగారి తత్వాలను రామకృష్ణతోనే పాడించారు. ఆ సినిమా ఆడియో పెద్ద హిట్టయింది. దాంతో తరువాతి రోజుల్లో భక్తిగీతాలు పాడాలంటే రామకృష్ణనే అనే పేరు సంపాదించారు. ఆ పై వందలాది కచేరీలలో రాయబారం పద్యాలు, బ్రహ్మంగారి తత్వాలు, కొన్ని ప్రత్యేక భక్తి శ్లోకాలు పాడుతూ అలరించారు రామకృష్ణ.
ఏది ఏమైనా రామకృష్ణ పేరు వినగానే ఏయన్నార్ ఫ్యాన్స్ కు ఆయన పాడిన తొలి పాట 'చిక్కావు చేతిలో చిలకమ్మా...' ముందుగా గుర్తుకు వస్తుంది. ఈ ఫొటో చూస్తే అక్కినేని ఫ్యాన్స్ తప్పకుండా 'విచిత్రబంధం' చిత్రాన్ని, ఆ సినిమాకు ఆధారమైన 'విజేత' నవలను, ఆ సినిమాకు స్వరకల్పన చేసిన కేవీ మహదేవన్ ను, ఆ చిత్రం సాధించిన ఘనవిజయాన్ని మననం చేసుకోకుండా ఉండలేరు.
Also Read: Pre Wedding Show : తిరువీర్ మూవీ నుండి క్యాచీ లవ్ సాంగ్
Also Read: Allu Arjun: దీపిక పాత్ర తగ్గిపోయిందా...