సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manushulu Mamathalu: జయలలిత తొలి తెలుగు సినిమాకు 'ఎ' సర్టిఫికెట్...

ABN, Publish Date - Aug 28 , 2025 | 10:48 AM

ఈ మధ్యే రజనీకాంత్ 'కూలీ' సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వడంపై మేకర్స్ కోర్టుకూ ఎక్కారు. సెన్సార్ రూల్స్ ను అనుసరించి సినిమాలకు సర్టిఫికెట్స్ ఇస్తారు. అలా తెలుగునాట సెన్సార్ వారు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన తొలి సినిమా రిలీజై నేటితో 60 ఏళ్ళవుతోంది. ఈ ఆరు పదుల కాలంలో 'ఏ' సర్టిఫికెట్ కథ ఎలా సాగిందో చూద్దాం.

Manushulu Mamathalu Movie

ఏయన్నార్ హీరోగా రూపొందిన 'మనుషులు-మమతలు' చిత్రం తెలుగునాట 'ఏ' సర్టిఫికెట్ పొందిన తొలి సినిమాగా నిలచింది. ఈ సినిమాతోనే జయలలిత తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో 'సిగ్గేస్తోందా...' పాటలో జయలలిత స్విమ్ షూట్ లో సెక్సీగా కనిపించడంతో 'మనుషులు-మమతలు' చిత్రానికి 'ఏ సర్టిఫికెట్' ఇచ్చారు. లేదా ఆ పాటను తొలగించమని సెన్సార్ సూచించింది. అయితే మేకర్స్ 'ఏ సర్టిఫికెట్'తోనే సాగారు. 1965 ఆగస్టు 27న విడుదలైన ఈ సినిమా పరాజయం పాలయింది. కథ, కథనం బాగున్నా, కేవలం 'ఏ సర్టిఫికెట్' కారణంగానే సినిమా ఫ్లాపయిందని చాలా రోజులుగా వినిపించింది. తరువాతి రోజుల్లో 'ఏ' సర్టిఫికెట్ పొందిన సినిమాలకు 'ఏ' అన్న ఇంగ్లిష్ అక్షరాన్ని అతిపెద్దగా చిత్రిస్తూ వాల్ పోస్టర్స్ వచ్చేవి. అంతే కాదు సెన్సార్ రూల్స్ లోనూ పెను మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ముద్దు సీన్స్ కు నో చెప్పిన సెన్సార్, లిప్ టు లిప్ కిస్సులు సహజమంటూ అనుమతించింది. కానీ, ఈ మధ్య మళ్ళీ నోట్లో నోరు పెట్టే సీన్స్ ను కత్తిరించడానికి సమాయత్తమవుతోంది.


'బొబ్బిలిపులి' ఘనవిజయం...

అరవై ఏళ్ళ క్రితం 'ముద్దుకు ముద్దు' అన్న పదాలనే తప్పుగా భావించారు సెన్సార్ వారు. అలాంటప్పుడు తడిసిన అందాలతో ద్వంద్వార్థపు పదాలతో పాట కనిపిస్తే 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వరా!?. తరువాతి రోజుల్లో కలర్ మూవీస్ ట్రెండ్ మొదలయ్యాక పాటల్లోని పదాల్లో డబుల్ మీనింగ్ ఉన్నా సెన్సార్ కత్తెరవేసేవారు. లేదా 'ఏ' ఇస్తామనే వారు. అలా యన్టీఆర్ 'యుగపురుషుడు', ఏయన్నార్ 'దొరబాబు' వంటి చిత్రాల్లోని కొన్ని పాటలు రికార్డ్స్ లో ఓ లాగా, సినిమాల్లో వేరే పదాలతో సాగాయి. కేవలం అసభ్యత, అశ్లీలం ఉంటేనే 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వరు. తీవ్రమైన హింస చోటు చేసుకున్నా 'యు' సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరిస్తుంది. యన్టీఆర్ 'అగ్గిరవ్వ' సినిమాలో హీరోను కొందరు కత్తులతో కోస్తారు. అది చూడటానికి బీభత్సంగా ఉంటుంది. అలా 'అగ్గిరవ్వ'కు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సినిమా కూడా పరాజయం పాలయింది. 1982లో 'బొబ్బిలిపులి' సినిమాకు కూడా 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అందులోనూ విలన్స్ ను చంపడంలో మితిమీరిన హింస ఉందన్నది సెన్సార్ వారి వాదన. అయినా ఆ సినిమా అనూహ్య విజయం సాధించి బ్లాక్ బస్టర్ గా నిలచింది. దాంతో తరువాతి రోజుల్లో 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చినా మేకర్స్ భయపడకుండా సాగారు.


'సెన్సార్ పక్షం'గా తీసేవారు ఎందరు?

'ఏ సర్టిఫికెట్' మూవీస్ ను 18 ఏళ్ళ లోపు వారు చూడరాదన్నది నిబంధన. కానీ, స్టార్స్ నటించిన అనేక చిత్రాలు 'ఏ' సర్టిఫికెట్ తోనూ ఘనవిజయం సాధించాయి. వాల్ పోస్టర్స్ పైనా, హోర్డింగ్స్ లోనూ సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ ను ముద్రించాలన్న నిబంధనా విధించారు. అదీ పోయింది. టాప్ స్టార్స్ మూవీస్ కే 'ఏ' సర్టిఫికెట్ ఇస్తుండడంతో 18లోపు పిల్లలకు అవి చూసే వీలు లేకుండా పోతోంది. అందువల్ల తమ సినిమాలకు కలెక్షన్స్ తగ్గుతున్నాయన్నది మూవీ మేకర్స్ వాదన. అలాంటప్పుడు సెన్సార్ రూల్స్ అతిక్రమించకుండా సినిమాలు తీయండి అన్నది ప్రభుత్వం వాదన. రజనీకాంత్ 'కూలీ'కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఆ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల 18 ఏళ్ళ లోపువారు రాలేదని, అందువల్ల వసూళ్ళు తగ్గాయని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏమవుతుందో కానీ, సినిమాలు తీసేవారు 'సెన్సార్ పక్షం'గా చిత్రాలు తీస్తే ఏ బాధా లేదన్నది ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుల మాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ప్రతి చిత్రమూ 'యూ' సర్టిఫికెట్ తోనే సాగింది. మరి భారీ చిత్రాలు తీస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ బీభత్సకాండ సృష్టించే మేకర్స్ ఈ విషయంలో ఏమంటారో చూడాలి.

Also Read: Rajamouli: 'బాహుబలి ది ఎపిక్'కు కొత్త నిర్వచనం...

Also Read: Tollywood: ఈవారం తెలుగు సినిమాలు

Updated Date - Aug 28 , 2025 | 10:53 AM