Akkineni: అన్నపూర్ణ పిక్చర్స్ మొదటి సినిమా 'దొంగరాముడు'
ABN, Publish Date - Oct 02 , 2025 | 02:30 PM
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు - నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు కాంబోలో తొలి చిత్రం 'దొంగరాముడు'. అక్టోబర్ 1న 'దొంగరాముడు' 70 ఏళ్ళు పూర్తిచేసుకుంది. కేవీ రెడ్డి డైరెక్షన్ లో 'దొంగరాముడు' ఏ తీరున మురిపించిందో గుర్తు చేసుకుందాం.
'దేవదాసు' (Devadasu) తో ఏయన్నార్ కు నటునిగా ఎనలేని కీర్తి లభించింది. ఆ తరువాత నుంచీ వైవిధ్యమైన పాత్రలతో సాగాలని అక్కినేని ఆశించారు. ఆయనకు గురుతుల్యులైన దుక్కిపాటి మధుసూదనరావు అందుకు ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంటే మంచిదని భావించారు. తన పినతల్లి పేరిట 'అన్నపూర్ణ పిక్చర్స్' నెలకొల్పారు దుక్కిపాటి (Dukkipati). ఈ సంస్థకు ఏయన్నార్ (ANR) ను ఛైర్మన్ గా చేసి, తాను మేనేజింగ్ డైరెక్టర్ గా సాగారు దుక్కిపాటి. తొలి ప్రయత్నంగా కేవీ రెడ్డి (KV Reddy) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో 'దొంగరాముడు' (Donga Ramudu) నిర్మించారు. 1955 అక్టోబర్ 1న విడుదలైన 'దొంగరాముడు' మంచి విజయం సాధించింది - అన్నపూర్ణ సంస్థను నిలిపింది. ఆ పై జనం మెచ్చేలా అనేక సినిమాలను అన్నపూర్ణ బ్యానర్ నిర్మించడం విశేషం. ఈ చిత్రంలో సావిత్రి (Savitri) నాయిక కాగా, ఏయన్నార్ చెల్లెలి పాత్రలో జమున (Jamuna) నటించారు. ఆమె భర్తగా జగ్గయ్య అభినయించారు. ఆర్. నాగేశ్వరరావు విలన్ గా కనిపించారు.
'దొంగరాముడు' తెలుగు- తమిళ రెండు భాషల్లోనూ ఏయన్నార్, సావిత్రి, జమున తమ పాత్రలు ధరించారు. రెండు చిత్రాలకు పెండ్యాల సంగీతం సమకూర్చారు. తెలుగులో డి. వి. నరసరాజు సంభాషణలు రాయగా, పాటలను సముద్రాల సీనియర్ పలికించారు. తమిళంలో కన్నదాసన్ పాటలు రాశారు. తొలి సినిమా అందించిన విజయంతో అక్కినేని, దుక్కిపాటి దాదాపు రెండు దశాబ్దాలు 'అన్నపూర్ణ పిక్చర్స్' పతాకంపై అభిరుచిగల చిత్రాలు అందించారు. వాటిలో అనేక సినిమాలు ఈ నాటికీ జనాన్ని మెప్పిస్తూనే ఉండడం విశేషం. అలా అన్నపూర్ణ సంస్థకు బీజం వేసిన సినిమాగా 'దొంగరాముడు' నిలచి పోయింది. ఈ చిత్రం ఆ రోజుల్లో పలు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
Also Read: Kanthara: Chapter 1 Review: కాంతార చాప్టర్ 1 రివ్యూ
Also Read: Idly Kottu: ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ