Kanthara: Chapter 1 Review: కాంతార చాప్టర్ 1 రివ్యూ
ABN , Publish Date - Oct 02 , 2025 | 10:41 AM
కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించి, హీరోగా నటించిన 'కాంతార' 2022లో విడుదలై 'కెజీఎఫ్' తర్వాత మరోసారి దేశమంతా కన్నడ చిత్రసీమవైపు చూపు మరల్చేలా చేసింది. దాని ప్రీక్వెల్ ప్రకటన రాగానే 'కాంతార : చాప్టర్ 1'పై (Kanthara Chapter 1) భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను రిషబ్ శెట్టి బృందం అందుకుందో లేదో తెలుసుకుందాం..
సినిమా రివ్యూ: 'కాంతార : చాప్టర్ 1
విడుదల తేదీ: 2-10-2025
కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించి, హీరోగా నటించిన 'కాంతార' 2022లో విడుదలై 'కెజీఎఫ్' తర్వాత మరోసారి దేశమంతా కన్నడ చిత్రసీమవైపు చూపు మరల్చేలా చేసింది. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి జాతీయ అవార్డు అందుకోవడంతో పాటు... బెస్ట్ పాపులర్ హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా 'కాంతార' నిలచింది. దాంతో సహజంగానే దాని ప్రీక్వెల్ ప్రకటన రాగానే 'కాంతార : చాప్టర్ 1'పై (Kanthara Chapter 1) భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను రిషబ్ శెట్టి బృందం అందుకుందో లేదో తెలుసుకుందాం. (Kanthara Chapter 1 Review)
కథ:
ఇది 'కాంతార'కు కాస్తంత ముందు జరిగిన కథ. శివ, అతని తండ్రి ఎక్కడైతే అడవిలో మాయమైపోతారో అక్కడే 'కాంతార' ప్రీక్వెల్ ను రిషబ్ శెట్టి మొదలు పెట్టాడు. ఎనిమిదవ శతాబ్దంలో కదంబుల కాలం నాటి కథగా దీన్ని చూపించారు. 'కాంతార' అనేది శివుడు తపస్సు చేసిన ప్రదేశం. భర్త కోసం పార్వతీ దేవి సైతం ఇలకు వచ్చి అక్కడో పూదోటను ఏర్పాటు చేస్తుంది. దైవీక శక్తి నీడలో ఉన్న ఆ ప్రాంతం మీద, అక్కడ ఉన్న దేవుని శిల మీద దుష్టశక్తుల దృష్టి పడుతుంది. 'కాంతార' లోని గిరిజనులకు ఓ రోజున పెద్ద పులి కావలి కాస్తున్న చిన్న పసిబిడ్డ దొరుకుతాడు. దేవుడి బిడ్డగా అతన్ని భావించి, బెర్మే (రిషబ్ శెట్టి) అనే పేరు పెట్టి గిరిజనులు అతన్ని పెంచుతారు. బెర్మే పెరిగి పెద్దవాడు అయ్యేపట్టికీ భాంగ్రా యువరాజు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య) కన్ను కాంతారలోని దేవుని శిలపై పడుతుంది. తన తాత చేయలేని పనిని తాను చేయాలనుకుని విఫలుడవుతాడు. అతనికి బుద్ధి చెప్పి వెనక్కి పంపిన బెర్మే, తన సహచరులతో కలిసి భాంగ్రా ను చూడటానికి వెళతాడు. అక్కడ యువరాణి కనకావతి (రుక్మిణీ వసంత్)తో అతనికి పరిచయం అవుతుంది. భాంగ్రాలో వెట్టి చాకిరి చేస్తున్న తన తోటి గిరిజనులకు విముక్తి కలిగించడం కోసం, భాంగ్రా ఓడరేవు ద్వారా సుగంధ ద్రవ్యాల వర్తకం చేయడం కోసం బెర్మే సిద్థమౌతాడు. ఆ సందర్భంలో అతనికి భాంగ్రా నుండి ఎలాంటి ఆపద ఎదురైంది? దైవీక శక్తితో దానిని అతను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
మూడేళ్ళ క్రితం వచ్చిన 'కాంతార' చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది. ఆ సినిమా క్లయిమాక్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. 'ఓ... ' అనే కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఆనాటి స్పందనను దృష్టిలో పెట్టుకుని, దాన్ని మించిన అనుభూతిని ప్రేక్షకులకు అందించాలని రిషబ్ శెట్టి తీవ్రంగానే ప్రయత్నించాడు. అయితే... 'కాంతార'లోని ఎమోషన్ ను క్యారీ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. 'కాంతార'ను మించి ఈ సినిమాను భారీగా తీయడానికి రిషబ్ ప్రయత్నించాడు. అందులో సఫలీకృతుడయ్యాడు. 'కాంతార' కంటే రిచ్ గా, గ్రాండ్ గా ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కించాడు. బట్... 'కాంతార'తో పోల్చిచూసుకున్నప్పుడు... ఎక్కడో ఏదో లోటు జరిగినట్టు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. 'కాంతార'ను చూడనివారు... మొదటి సారి దీన్నిచూస్తే... ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. కానీ పోలిక వచ్చినప్పుడు మాత్రమే సంతృప్తిని వ్యక్తం చేయలేరు. అంతమాత్రం చేత ఈ సినిమాను తక్కువ చేయాల్సిన పనిలేదు. రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను కాస్తంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా భాంగ్రా వీధుల్లో రథానికి సంబంధించిన ఎపిసోడ్ ను తగ్గించొచ్చు. అలానే పోరాట సన్నివేశాలను కొంత కుదించి ఉండొచ్చు. ప్రథమార్థంలో పోల్చితే ద్వితీయార్థం బాగుంది. ఇంట్రవెల్, ప్రీ క్లయిమాక్స్ సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి.
నటీనటుల విషయానికి వస్తే... రిషబ్ శెట్టి పాత్ర ప్రారంభం నార్మల్ గా ఉన్నా... ఆ తర్వాత దాని గ్రాఫ్ పెరుగుతూ వెళ్ళింది. ప్రీ క్లయిమాక్స్ లో రిషబ్ మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అతను తప్ప మరే నటుడినీ ఆ పాత్రలో ఊహించుకోలేం. అలానే జయరామ్ పాత్ర సాదాసీదాగా మొదలై, పతాక సన్నివేశంలో పీక్స్ కు చేరింది. ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే రుక్మిణీ వసంత్ దే! ఆమె తనకున్న ఇమేజ్ కు భిన్నమైన పాత్రను పోషించి, మెప్పించింది. గుల్షన్ దేవయ్య యువరాజు పాత్రలో తనదైన నటన ప్రదర్శించాడు. అయితే అతని డబ్బింగ్ అంతగా సూట్ కాలేదు. ఇతర ప్రధాన పాత్రలను ప్రమోద్ శెట్టి, దీపక్ రాయ్, ప్రకాశ్ తుమ్మిడి తదితరులు చేశారు. వీళ్ళంతా తెలుగు వారికి పరిచయం లేని వారే. సంగీత దర్శకుడు అజనీశ్ లోక్ నాథ్ మరోసారి ప్రాణం పెట్టి ఈ సినిమాకు పనిచేశాడు. అతని నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాలు ఎలివేట్ అయ్యాయి. అయితే... 'కాంతార'లోని సిగ్నేచర్ ట్యూన్ ఇందులో మిస్ అయ్యింది. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాగుంది. హోంబలే కు రాజీపడని నిర్మాణ సంస్థగా పేరుంది. 'కాంతార: చాప్టర్ 1'తో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా ఒకేసారి వివిధ భారతీయ భాషల్లో విడుదలైంది కాబట్టి కలెక్షన్ నంబర్స్ ఆశాజనకంగా ఉండొచ్చు! పైగా దసరా సీజన్ దీనికి కలిసి వచ్చే అంశం. అయితే 'కాంతార'తో పోలిక వచ్చినప్పుడే... ప్రేక్షకులు పెదవి విరిచే ఆస్కారం ఉంది.
ట్యాగ్ లైన్: ఆర్టిఫిషియల్ 'కాంతార'
రేటింగ్: 2.75/5