Vijaya Bhaskar: నాకు, త్రివిక్రమ్‌కు.. బాలయ్యతో సినిమా సెట్ అయి మిస్సయింది!
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:47 PM
నందమూరి బాలకృష్ణ 'లారీ డ్రైవర్' సినిమాకు లాస్ట్ అప్రంటీస్ గా వర్క్ చేసిన విజయ భాస్కర్... ఆయనను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎలా మిస్ చేసుకున్నారు? విజయ భాస్కర్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.
సినిమా రంగం విచిత్రసీమ. ఇక్కడ అవకాశాలు ఎలా వస్తాయో, ఎలా చేజారిపోతాయో ఊహకు కూడా అందదు. చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేశ్ (Venkatesh) తో పాటు యంగ్ హీరోలతో సక్సెస్ ఫుల్ మూవీస్ చేశారు ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్ (Vijaya Bhaskar). అయితే ఆయనకు బాలకృష్ణ (Balakrishna) తోనూ సినిమా చేసే ఛాన్స్ ఇలా వచ్చి, అలా మిస్ అయిపోయింది. ఆనాటి విషయాలను విజయ భాస్కర్ తెలియచేశారు.
'నేను తెలుగులో బి. గోపాల్ దగ్గర 'లారీ డ్రైవర్' సినిమాకు లాస్ట్ అసిస్టెంట్ గా వర్క్ చేశాను, అదీ ఒకే ఒక్క షెడ్యూల్ కు. ఆ సినిమాలో హీరో బాలకృష్ణ గారు, హీరోయిన్ విజయశాంతి. ఆ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గారు చాలా సరదాగా మాతో మాట్లాడేవాళ్ళు. 'లారీ డ్రైవర్' షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న టైమ్ లోనే 'నారీ నారీ నడుమ మురారి' సినిమా విడుదలైంది. దాన్ని చూసి మర్నాడు బాలకృష్ణగారికి నాకెంత బాగా ఆ సినిమా నచ్చిందో చెప్పాను. మాస్ హీరో ఇమేజ్ ఉన్న బాలకృష్ణ గారు ఆ సినిమాలో వినోదం పండించిన తీరు, అందులోని పాటను నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే 'లారీ డ్రైవర్'కు వర్క్ చేస్తున్న సమయంలోనే నాకు 'ప్రార్థన' సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. దాంతో బి. గోపాల్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ సినిమా చేయడానికి వెళ్ళిపోయాను. 'ప్రార్థన' సినిమాను సింగిల్ షెడ్యూల్ లో గుంటూరులో పూర్తి చేశాం. ఓ పాటను చెన్నయ్ లో తీశాం. ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక, 'లారీ డ్రైవర్' షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలకృష్ణ గారిని కలిసి ఆయన్ని చూడమని అడగాను. అప్పుడే సినిమా చేశానని ఆయన ఆశ్చర్య పోయారు. ఆయన మేరకు చెన్నయ్ లో చోళా షెరటాన్ దగ్గరలో ఉన్న హేమమాలిని ప్రివ్యూ థియేటర్ లో 'ప్రార్థన' సినిమాను వేశాం. ఫ్యామిలీతో పాటు ఆ సినిమా చూసిన బాలకృష్ణ 'సినిమా చాలా బాగుందని మెచ్చుకుంటూ, మరో పది లక్షలు ఖర్చు పెట్టి ఉంటే మరింత గ్రాండ్ గా ఉండేద'ని నా భుజం తట్టి అభినందించారు' అని తెలిపారు విజయ భాస్కర్.
ఇదిలా ఉంటే బాలకృష్ణ సినిమా మిస్ చేసుకున్న వైనాన్ని వివరిస్తూ, 'త్రివిక్రమ్ తో కలిసి 'మల్లీశ్వరి' సినిమా స్క్రిప్ట్ సిద్థం చేస్తున్న సమయంలోనే బాలకృష్ణ గారితో సినిమా ఛాన్స్ వచ్చింది. బాలకృష్ణ గారి తోడల్లుడు, నిర్మాత ఎం.ఆర్.వి. ప్రసాద్ గారు ఓ సినిమా చేద్దామని చెప్పారు. బాలకృష్ణ గారు స్వయంగా ఫోన్ చేశారు. దాంతో ఒక్కసారిగా ఎగిరి గంతేశాను. త్రివిక్రమ్ తో ఈ విషయం చెప్పినప్పుడు అతనూ ఎంతో సంతోషించాడు. అయితే ముందుగా ఒప్పుకున్న 'మల్లీశ్వరి' పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత మరో సినిమాకు కమిట్ అయ్యాం. అదీ చేయాలి. ఆ సమయానికి బాలకృష్ణ గారికి తగ్గ సబ్జెక్ట్ ఏదీ రెడీగా మా దగ్గర లేదు. కథ తయారు చేసుకోవాలి. పైగా బాలకృష్ణ గారితో సినిమా అంటే... అది ఖచ్చితంగా గొప్పగా ఉండాలన్నది మా కోరిక. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఓ మాస్సీ కామెడీ మూవీ చేయాలని అనుకున్నాను. కానీ ఆయన డేట్స్ వేస్ట్ అయిపోతాయనే ఉద్దేశ్యంతో ఆ టైమ్ లో జయంత్ సి. పరాన్జీతో 'అల్లరి పిడుగు' మూవీని తీశారు. అలా... బాలకృష్ణగారితో సినిమా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాను' అని విజయ భాస్కర్ తెలిపారు. బాలకృష్ణతో సినిమా చేయాలనే కల అలానే మిగిలిపోయింది అని అన్నారు.
Also Read: Mega158: చిరుతో రాజాసాబ్ బ్యూటీ రొమాన్స్.. మహా దారుణం ఇది
Also Read: Kajol: యాక్టర్‌లకు ఆ అవకాశం ఉండదు అన్నానే తప్ప తక్కువ చేయలేదు..