Sumalatha Devi: సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం...
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:22 PM
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడింది. జానీ మాస్టర్ భార్య సుమలతా దేవి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది.
ఇటీవల తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ (Johny మాస్టర్ భార్య వి. వి. సుమలతా దేవి (Sumalatha Devi) ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె గురువారం ప్రమాణ స్వీకారోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ (Naveen Yadav) ముఖ్య అతిథులు గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ, 'ఈ యూనియన్‌కు మొట్టమొదటి సారిగా మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉంది. సుమలత గారి విజయం యూనియన్‌కు కొత్త రూపుని తీసుకు వస్తుందని నమ్ముతున్నాను. జానీ మాస్టర్ గారు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు ఎంతో నమ్మకంతో వారిని ఎన్నుకున్నారు. ఈ యూనియన్‌కు నేను ఎప్పుడూ అండగా ఉంటాను' అని హామీ ఇచ్చారు. చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ, 'యూనియన్‌లో చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని మనలో మనమే పరిష్కరించుకుందాం. బయటకు వెళ్లి కేసులు పెట్టుకోవడం వల్ల మనమే చులకన అవుతాం. మనమంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం' అంటూ సలహా ఇచ్చారు. సి. కళ్యాణ్ మాట్లాడుతూ, 'డాన్సర్స్ అసోషియేషన్ కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా శ్రీశైలం యాదవ్ మొదటగా డబ్బులిచ్చి సాయం చేసేవారు. ఆయన భార్య సైతం మహిళా ఆర్టిస్టులకు, డాన్సర్స్ కు ఆర్థిక సాయం అందించేవారు. ఇక జానీ మాస్టర్ ను కిందకు లాగాలని కొందరు ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. సుమలత విజయం ఈ యూనియన్ కు మంచి రోజులు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ, 'మా మీద నమ్మకంతో సుమలతా దేవిని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన బాడీ సహకారంతో యూనియన్ సంక్షేమానికి పాటుపడతాం. యూనియన్ లోని ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్యూరెన్స్ చేయించాలి. ఇందుకు గానూ రామ్ చరణ్ (Ram Charan) ఆర్థిక సాయం అందించారు. అలానే యూనియన్ సభ్యులందరికీ స్థలం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చిన శ్రీశైలం యాదవ్ గారికి, నవీన్ యాదవ్ కు ధన్యవాదాలు. యూనియన్ నుండి రిటైర్డ్ అయ్యే ప్రతి సభ్యుడికీ కనీసం పది నుండి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలన్నది మా ఆలోచన' అని చెప్పారు. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ సుమలతా దేవి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి. చిరంజీవి కుమార్, ఉపాధ్యక్షులుగా కె. సురేష్, యమ్. రాజు, సహ కార్యదర్శులుగా కె. కిరణ్ కుమార్, ఏ. రాము, కార్య నిర్వహక కార్యదర్శిగా యు. శివ కృష్ణ , కమిటీ సభ్యులుగా కె. సతీష్ గౌడ్, కె. శ్రీదేవి, పి. సురేష్, ఎస్. వేదాంత, మనోహర్, ఎల్. కృష్ణ, బి. సుమన్, ఆర్. బోస్, ఎస్. శ్రుతి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి కె. ఎల్. దామోదర్ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కమీషనర్ ఆఫ్ లేబర్ శ్యామ్ సుందర్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కోశాధికారి జి. భీముడు (శ్రీకాంత్) తదితరులు పాల్గొన్నారు.
Also Read: Rajendra Prasad: మరోసారి వాయిదా పడ్డ 'సఃకుటుంబానాం'
Also Read: Sara Arjun: సారా అర్జున్.. చేసిన రెండు సినిమాలకు 'ఏ' సర్టిఫికెట్