Sara Arjun: సారా అర్జున్.. చేసిన రెండు సినిమాలకు 'ఏ' స‌ర్టిఫికెట్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:36 PM

బాలనటి సారా అర్జున్ ఇప్పుడు రణవీర్ సింగ్ సరసన 'దురంధర్'లో నాయికగా నటించింది. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో ఛాన్స్ చాలా లక్కీగా వచ్చిందని సారా చెబుతోంది.

Sara Arjun

బాలనటిగా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి సారా అర్జున్‌ (Sara Arjun). ఇప్పుడు ‘దురంధర్‌’ (Dhurandhar) సినిమాతో ఓవర్‌నైట్‌ సెన్సేషన్‌గా మారారు. రణ్‌వీర్‌సింగ్‌ (Ranveer Singh) సరసన ఆమె పోషించిన పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 'దురంధర్' విజయంపై సారా పంచుకున్న విశేషాలివి.

'మనం ఒకటి తలిస్తే దైవం మరోలా తలుస్తుంది. నా విషయంలోనూ అదే జరిగింది. బోర్డింగ్‌ స్కూల్‌లో చదువు పూర్తిచేసి నటనలో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న సమయంలో విధి నా కోసం అద్భుతమైన కథను సిద్ధం చేసింది. రణ్‌వీర్‌సింగ్‌ లాంటి స్టార్‌ హీరో సరసన 'దురంధర్‌' సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసే అవకాశాన్ని అందించింది. ఈ ప్రయాణం నా కోసం విశ్వం రచించిన అద్భుత స్క్రిప్ట్' అంటూ సారా గుర్తు చేసుకున్నారు.

Sara Arjun


నా కోసం ఎదురుచూసిన కథ

'ఆడిషన్‌ నుంచి బయటకు వచ్చిన ఆ క్షణమే నాకు అర్థమైంది. ఈ సినిమా నాకు కేవలం ఒక ప్రాజెక్టు కాదు. ‘ఆగు, తొందరపడకు.. నీ కోసం ఇక్కడో కథ ఎదురుచూస్తోంది’ అని ఈ విశ్వం నాతో మెల్లగా చెప్పినట్టు అనిపించింది. నాకు విజయం దక్కుతుందని గట్టి నమ్మకం ఉండేది. కానీ, అది ఎలా వస్తుందో అర్థమయ్యేది కాదు. ఈ సినిమా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది’ అని సారా అర్జున్‌ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇప్పుడు తనలో ఎలాంటి ప్రశ్నలు లేవని, మరిన్ని మంచి పాత్రలు చేయాలన్న తపన మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 'దురంధర్‌' సినిమా విజయం నాకు స్పష్టమైన దారిని చూపడమే కాకుండా, నా కలల ప్రయాణానికి బలమైన పునాది వేసింది' అని చెప్పుకొచ్చారు సారా అర్జున్‌.

Sara Arjun

ఊహించని పిలుపు

యాక్టింగ్‌ కోర్స్‌ కోసం అమెరికాలోని లీ స్ట్రాస్‌బర్గ్‌ ఇనిస్టిట్యూట్‌కు పంపాలని ఆమె తండ్రి, నటుడు రాజ్‌ అర్జున్‌ ఏర్పాట్లు చేస్తున్న రోజులవి. సరిగ్గా అప్పుడే క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ ఛబ్రా కార్యాలయం నుంచి ఆడిషన్‌కు రమ్మంటూ సారాకు ఊహించని పిలుపు వచ్చింది. ఏ సినిమా కోసమో తెలియకుండానే ఆమె ఆడిషన్‌కు హాజరయ్యారు. ఒకదాని తర్వాత మరోటి ఇలా కొన్ని నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. 'నిజం చెప్పాలంటే నేను ఏ సినిమా కోసం ఆడిషన్‌ ఇస్తున్నానో చివరి నిమిషం వరకు నాకు తెలియదు. ప్రతి రౌండ్‌లోనూ భిన్నమైన భావోద్వేగాలు పలికించాను. చివరి ఆడిషన్‌ మాత్రం ముకేశ్‌ ఛబ్రా స్వయంగా నిర్వహించారు. ఆ రోజు సన్నివేశంలో నేను పూర్తిగా లీనమైపోయాను. ఆ గదిలోంచి బయటకు వచ్చే సరికి కళ్లలో నీళ్లు ఉన్నాయి' అని సారా గుర్తుచేసుకున్నారు.


బాలనటిగా సారా మొదటిసారి తమిళ డబ్బింగ్ సినిమా 'నాన్న' (Nanna) తో తెలుగువారి ముందుకు వచ్చింది. ఆ సినిమాలో సారా అర్జున్ విక్రమ్ (Vikram) కుమార్తెగా నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రం 'శైవం' (Saivam)లో ఆమె నటించింది. ఆ సినిమాను తెలుగులో 'దాగుడు మూతల దండాకోర్' (Dagudumoothala Dandakor) పేరుతో ఉషాకిరణ్‌ మూవీస్ తో కలిసి దర్శకుడు క్రిష్‌ (Krish) నిర్మించారు. తమిళంలో పోషించిన పాత్రనే తెలుగులోనూ సారా అర్జున్ చేసింది. ఆ రకంగా ఆమెకు బాలనటిగా తెలుగులో తొలి చిత్రం అదే. అలానే సారా కీలక పాత్ర పోషించిన తమిళ చిత్రం 'పొన్నియన్ సెల్వన్' (Ponniyin Selvan) రెండు భాగాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.

Sara Arjun

ఇప్పుడు గుణశేఖర్ (Gunasekhar) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'యుఫోరియా' (Euphoria) మూవీలో సారా అర్జున్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. చిత్రం ఏమంటే... ఆమె నటించిన హిందీ చిత్రం 'దురంధర్', తెలుగు సినిమా 'యుఫోరియా' రెండు 'ఎ' సర్టిఫికెట్ ను పొందిన సినిమాలే! అంతేగాక‌ ఇప్ప‌టికే త‌మిళంలో చేసిన కొటేష‌న్ గ్యాంగ్ సైతం 18+ సినిమాగా స‌ర్టిఫికెట్ తెచ్చుకోగా ఏడాదిన్న‌ర‌గా ఆ సినిమా విడుద‌ల‌కు కూడా నోచుకోకపోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read: Pavani Rao Boddapati: అవతార్ విజువల్ వెనకున్నది మనమ్మాయే

Also Read: Nidhhi Agerwal: ప్రభాస్ ఫ్యాన్స్‌.. నిధీని నలిపేశారుగా

Updated Date - Dec 18 , 2025 | 04:19 PM