Tollywood: సాయికిరణ్ అడివికి కోపమొచ్చింది...

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:18 PM

క్రియేటివ్ ఫీల్డ్ లో మతప్రమేయాన్ని తప్పు పడుతున్నాడు దర్శకుడు సాయికిరణ్ అడవి. బౌండ్ స్క్రిప్ట్ అనే పదానికి పర్యాయపదంగా 'బైబిల్'ను వాడటాన్ని నిరసిస్తున్నాడు.

ప్రముఖ దర్శకుడు సాయికిరణ్ అడివి (Saikiran Adivi) కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్నాడు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) శిష్యుడైన సాయికిరణ్‌ 2008లో 'వినాయకుడు' (Vinayakudu) సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అందులో కృష్ణుడు (Krishnudu) టైటిల్ రోల్ ను ప్లే చేశాడు. ఆ తర్వాత సంవత్సరమే దానికి సీక్వెల్ గా 'విలేజ్ లో వినాయకుడు' (Villagelo Vinayakudu) మూవీ చేశాడు. ఇక తన బంధువైన అడివి శేష్‌ మూవీ 'కిస్' (Kiss) కు సాయికిరణ్ అడివి కథను అందించాడు. 2015లో సాయికిరణ్ తెరకెక్కించిన 'కేరింత' (Kerintha) కూడా ఫర్వాలేదనిపించింది. ఇక చివరగా 2019లో ఆది సాయికుమార్ (Adi Saikumar) హీరోగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌' మూవీని తెరకెక్కించాడు అడివి సాయికిరణ్‌.


అయితే తాజాగా సాయికిరణ్‌ అడివి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ పెద్ద ఓటీటీ సంస్థ కబురు చేసి తనతో సినిమా తీయడానికి ఆసక్తి చూపించిందని సాయికిరణ్‌ తెలిపాడు. అయితే వాళ్ళు 'బైబిల్' (Bible) (బౌండ్ స్క్రిప్ట్) ఇవ్వమని తనను అడిగారని, వెంటనే తాను 'బైబిల్' కాదు 'భగవద్ఘీత' ఇస్తానని చెప్పానని సాయికిరణ్‌ పేర్కొన్నాడు. క్రియేటివ్ ఫీల్డ్ లోకి మతాన్ని ఎందుకు లాగుతారో తనకు అర్థం కాలేదని వాపోయాడు. ఓ గర్వపడే హిందువుగా ఇలాంటి మానిప్యులేటివ్ మెథడ్స్ ను తాను సినిమా మేకింగ్ లో అంగీకరించని తెలిపాడు. ఆ సంస్థ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించానని పేర్కొంటూ... జై శ్రీరామ్ అంటూ తన పోస్ట్ ను పూర్తి చేశాడు.

saikiran.jpg

తన వ్యాఖ్యకు మరింత వివరణ ఇస్తూ... తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని, కానీ బౌండ్ స్క్రిప్ట్ అనే చెబితే సరిపోయేదానికి మతపరమైన గ్రంధం పేరును వాడాల్సిన అవసరం లేదన్నదే తన అభిప్రాయమని తెలిపాడు. ఓటీటీ సంస్థ నుండి సాయికిరణ్‌ కు ఆఫర్ రావడం, దానిని అతను తిరస్కరించడంలో నిజానిజాలు ఏమిటనేది పక్కన పెడితే... ఓ తెలుగు దర్శకుడు తన మనసులోని భావాన్ని ఇలా నిక్కచ్చిగా చెప్పడం అనేది చాలా అరుదైన విషయమే!

adivi saikiran.jpg

Also Read: Ott Movies: జూలై రెండో వారం.. ఓటీటీ చిత్రాలివే! ఆ నాలుగు వెరీ స్పెష‌ల్‌

Also Read: PVR INOX; ఇక చిన్న పట్టణాల్లోనూ.. పీవీఆర్ ఇనాక్స్

Updated Date - Jul 07 , 2025 | 02:21 PM