PVR Inox: విజయాలు లేక నష్టాల ఊబిలో...

ABN, Publish Date - May 13 , 2025 | 11:53 AM

సినిమాల విడుదల శాతంలో తగ్గుదల, తగిన స్థాయిలో సినిమాలు ప్రజాదరణ పొందకపోవడంతో గడిచిన మూడు మాసాల్లో పీవీఆర్ ఐనాక్స్ ఏకంగా రూ. 125 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లే కాదు... మల్టిప్లెక్స్ థియేటర్లకూ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox) సంస్థ గడిచిన మూడు నెలల కాలంలో ఏకంగా రూ. 125 కోట్ల నష్టం వచ్చినట్టు ప్రకటించింది. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సంస్థ తన వ్యాపారాన్ని విస్తరిస్తూ పోతోంది. ఇటీవల కాలంలో 11 స్థలాలలో 77 కొత్త స్క్రీన్స్ ను పీవీఆర్ ఐనాక్స్ ప్రారంభించింది. మొత్తం మీద 352 సినిమా సెంటర్స్ తో 1743 థియేటర్లను ఇది 111 సిటీస్ లో నిర్వహిస్తోంది.


విస్తరణ వేగవంతంగా సాగుతున్నా... నష్టాల ఊబి నుండి సంస్థ పూర్తి స్థాయిలో బయటపడటం లేదు. మంచి సినిమా (Cinema), ప్రజాదరణ పొందిన సినిమాలు (Movies) వచ్చినప్పుడు లాభాలు వస్తున్నాయి కానీ ఇతర సమయాల్లో థియేటర్లకు జనాలను తీసుకు రావడంతో ఫెయిల్ అవుతోంది. ఆ రకంగా గడిచిన త్రైమాసికంలో రూ. 125 కోట్ల లాస్ వచ్చిందని ప్రకటించింది. పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, విడుదలైన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడమే దీనికి కారణం. మూడో త్రైమాసికంగా నిజానికి సంస్థకు రూ. 35.5 కోట్ల లాభం వచ్చింది. అయితే ఇప్పుడు ఆదాయం పాతిక శాతం పడిపోయి నష్టాలను అందుకుంది. సినిమాల విడుదల గడిచిన మూడు మాసాల్లో 14 శాతం తగ్గిందని సంస్థ పేర్కొంది. గత త్రైమాసికంలో రూ. 1,759.1 కోట్ల రెవిన్యూ రాగా, ఈ త్రైమాసికంలో కేవలం రూ. 1,311.2 కోట్లు మాత్రమే వచ్చింది. అయితే... ఈ గడ్డుకాలాన్ని ఎదుర్కొనడానికి పీవీఆర్ ఐనాక్స్ తన ఖర్చులను చాలా వరకూ తగ్గించుకుంది. గడిచిన మూడు నెలలో రూ. 1,712.8 కోట్లు ఖర్చు కాగా తాజా మూడు నెలల్లో 13.67 శాతాన్ని తగ్గించుకుని కేవలం రూ. 1,478.7 కోట్లనే ఖర్చు పెట్టింది. ఆ రకంగా లాభనష్టాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సంస్థ తెలిపింది.

Also Read: Maha Kali: ఫిమేల్ సూపర్ హీరో మూవీ మొదలైంది...

Also Read: Bollywood: అక్తర్ సాబ్ దీనికేమంటారు!?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 13 , 2025 | 01:14 PM