Bollywood: అక్తర్ సాబ్ దీనికేమంటారు!?

ABN , Publish Date - May 13 , 2025 | 09:24 AM

ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ బాలీవుడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడి స్టార్స్ ప్రభుత్వ విధానాలపై మౌనం వహించడానికి దర్యాప్తు సంస్థలపై భయమే అని అన్నారు.

ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ (Javed Akhtar) బాలీవుడ్ (Bollywood) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ (Kapil Sibal) నిర్వహించిన ఓ టీవీ షో లో ఆయన మాట్లాడారు. చాలామంది బాలీవుడ్ తారలు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే భయపడుతున్నారని, ఇన్ కమ్ టాక్స్, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల నుండి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటున్నారని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ నటులు మాత్రం అమెరికా ప్రభుత్వ విధానాలను గురించి నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తారని, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని వాపోయారు. బాలీవుడ్ ప్రముఖుల మౌనం వెనక దర్యాప్తు సంస్థలే ఉన్నాయని అన్నారు. ఇవాళ బాలీవుడ్ ను వెనకుండి నడిపిస్తోంది బడా పారిశ్రామికవేత్తలే అని చెబుతూ, వారితో పోరాడేంత పెద్దవారు సినిమా తారలు కాదని జావేద్ అక్తర్ చెప్పారు. ఫిల్మ్ స్టార్స్ కు గొప్ప పేరు ప్రఖ్యాతులు, విలాసవంతమైన జీవితం ఉన్నా... వారు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయంలో సామాన్యుల తరహాలోనే వ్యవహరిస్తారని వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉంటే... బాలీవుడ్ ను నడుపుతోంది బడా పారిశ్రామికవేత్తలే అని జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్స్ తప్పు పడుతున్నారు. మరి కొన్నేళ్ళ క్రితం బాలీవుడ్ మొత్తం అండర్ వరల్డ్ చేతిలో ఉన్నప్పుడు జావేద్ అక్తర్ వంటి మేధావులు అప్పుడు పెదవి ఎందుకు విప్పలేదని, దీనికంటే భయంకరమైన స్థితిని అప్పట్లో బాలీవుడ్ ఎదుర్కొందన్నది నిజం కాదా!? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఎంతోమంది స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు కదా! అని అంటున్నారు.

Also Read: Ram Charan: మేడమ్‌ టుస్సాడ్స్‌ చరణ్‌ విగ్రహం.. ఫొటోలు వైరల్‌..

Also Read: Pawan Kalyan -OG: ‘ఓజీ’ మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 13 , 2025 | 09:24 AM