R Narayana Murthy: మాకు అవమానం జరగలేదు...
ABN, Publish Date - Sep 27 , 2025 | 06:24 PM
గత ప్రభుత్వంలో చిరంజీవిని, సినిమా రంగానికి చెందిన ప్రముఖులను అవమానించలేదని ఆర్. నారాయణమూర్తి తెలిపారు. సినిమా రంగానికి సంబంధించిన కష్టాలను జగన్ కు తెలియచేయడానికి చిరంజీవి నేతృత్వంలో తామంతా జగన్ ను కలిశామని అన్నారు. ప్రస్తుతం సినిమా టిక్కెట్ రేట్లును భారీగా పెంచడాన్ని ఆర్. నారాయణమూర్తి తప్పుపట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ సీపీ (YSRCP) అధికారంలో ఉన్న సమయంలో సీఎం జగన్ (Jagan) ను చిరంజీవి (Chiranjeevi) తో పాటు కలిసిన బృందంలో ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి కూడా ఉన్నారు. రెండు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో శాసనసభ్యులు చేసిన వ్యాఖ్యలపై నారాయణమూర్తి స్పందించారు. చిరంజీవిని కానీ సినిమా ప్రముఖులను గానీ జగన్ మోహన్ రెడ్డి అవమానించలేదని ఆయన అన్నారు. చిరంజీవి ఇచ్చిన వివరణ సత్యమని ఆయన చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు ఆయన్ని కలిసే ముందు చిరంజీవి ఇంటిలో తాము సమావేశమయ్యామని చెప్పారు. ఢిల్లీలో ఉన్న తనకు చిరంజీవి ఫోన్ చేసి హైదరాబాద్ కు పిలిపించారని, సినిమా రంగానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడటానికి జగన్ మోహన్ రెడ్డిని కలుస్తున్నామని, చిన్న చిత్రాల నిర్మాతల ఇబ్బందులను చెప్పమని కోరారని నారాయణమూర్తి తెలిపారు. సినిమా రంగంలోని వారితోనూ మాట్లాడి వారందరినీ తీసుకుని జగన్ దగ్గరకు ప్రత్యేక విమానంలో చిరంజీవి తమను తీసుకెళ్ళారని అన్నారు. ఆ సమయంలో తమకు ఎలాంటి అవమానం జరగలేదని నారాయణమూర్తి వివరణ ఇచ్చారు. చిరంజీవి చొరవ కారణంగానే ఆ రోజు సమస్య పరిష్కారం అయ్యిందని అన్నారు. అయితే ఇండస్ట్రీలో ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని ప్రస్తుత ప్రభుత్వాలు తీర్చాల్సి ఉందని ఆయన అన్నారు.
టిక్కెట్ రేట్లు పెంచడం సబబు కాదు
సినిమా టిక్కెట్ రేట్లను ఇబ్బడి ముబ్బడిగా పెంచడాన్ని ఆర్. నారాయణమూర్తి తప్పు పట్టారు. రేవంత్ రెడ్డి కొద్ది కాలం క్రితం అసెంబ్లీలో తన ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంచదని, మిడ్ నైట్ షోస్ కు అనుమతి ఇవ్వదని చెప్పారని, అప్పుడు తామంతా హర్షం వెలిబుచ్చామని ఆర్. నారాయణమూర్తి అన్నారు. అయితే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి కొందరు నిర్మాతలు, పంపిణీదారుల ఒత్తిడి మేరకు సినిమా టిక్కెట్ రేట్లను పెంచేశారని విమర్శించారు. అలానే ఏపీలోనూ టిక్కెట్ రేట్లను పెంచుతున్నారని, ఇది సమంజసం కాదని ఆయన అన్నారు. ఏళ్ళ తరబడి సినిమాలు తీసిన నిర్మాతలు గతంలో ఎప్పుడు నిర్మాణ వ్యయం పెరిగిందనే కారణంగా సినిమా టిక్కెట్ రేట్లు పెంచమని కోరలేదని నారాయణమూర్తి అన్నారు. టిక్కెట్ రేట్లు పెంచి సగటు సినిమా ప్రేక్షకుడి నడ్డిని ప్రభుత్వాలు విరిచేస్తున్నాయని, దయచేసి రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించి టిక్కెట్ రేట్లను పెంచకుండా చూడాలని కోరారు. టిక్కెట్ రేట్లను పెంచడంతో చాలామంది ఓటీటీలో సినిమాలు చూడొచ్చనే భావనకు వస్తున్నారని, తద్వారా థియేటర్లకు నష్టం చేకూరుతోందని, అలానే చిన్న సినిమాలను చూడాలనుకునే వారికి కూడా ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడుతోందని టిక్కెట్ రేట్ల పెంపుతో సినిమా రంగం కూనరిల్లుతోందని ఆర్. నారాయణమూర్తి వాపోయారు.
Also Read: Meenakshi Chaudhary: మీనూ పాప కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందిరోయ్..
Also Read: PuriSethupathi: బెగ్గర్ పోయింది.. స్లమ్ డాగ్ వచ్చింది