Pulagam Chinnarayana: 'ప్రపంచ సినిమా పరిమళం' ఆస్వాదించమంటున్న మల్లాది
ABN, Publish Date - Dec 29 , 2025 | 02:13 PM
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ వెలువరించిన 'ప్రపంచ సినిమా పరిమళం' పుస్తకానికి సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పాఠకుల నుండి ఈ పుస్తకానికి మంచి స్పందన లభిస్తోందని చిన్నారాయణ తెలిపారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, గీత రచయిత, నంది అవార్డు గ్రహీత పులగం చిన్నారాయణ (Pulagam Chinnarayana) తాజాగా 'ప్రపంచ సినిమా పరిమళం' (Prapancha Cinema Parimalam) పేరుతో ఓ పుస్తకాన్ని వెలువరించారు. వైవిధ్య భరితమైన 26 సినిమాలకు సంబంధించిన వ్యాసాలను 26 మంది ప్రముఖులతో రాయించి పులగం చిన్నారాయణ దీన్ని అక్షౌహిణీ మీడియా పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకానికి ప్రముఖ నటుడు, దర్శక రచయిత తనికెళ్ళ భరణి (Thanikella Bharani) ముందుమాట రాశారు. ప్రముఖ రచయితలు 'వసుంధర', మల్లాది, కె. భాగ్యరాజా, 'స్రవంతి' రవికిశోర్, వేమూరి సత్యనారాయణ, పీఎస్ గోపాలకృష్ణ, ఎం.బి.యస్ ప్రసాద్, జి. ఆర్. మహర్షి, మహమ్మద్ ఖదీర్ బాబు, కిరణ్ ప్రభ (Kiran Prabha), పూడూరి రాజిరెడ్డి, డా. మామిడి హరికృష్ణ, వంగల హర్షవర్ధన్, ప్రభాకర్ జైనీ, పద్మజ సూరపరాజు, ఎన్. శివనాగేశ్వరరావు, గోపీమోహన్, బివిఎస్ రవి, నాగభైరు సుబ్బారావు, అన్వర్, ఆకెళ్ళ శివప్రసాద్, భగవంతం, వి. మధుసూదనరావు, రాండర్ గై, అన్వర్ మహమ్మద్, పులగం చిన్నారాయణ రాసిన సినిమా సమీక్షా వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
'ప్రపంచ సినిమా పరిమళం' గురించి చిన్నారాయణ మాట్లాడుతూ, 'రెండేళ్ళ క్రితం 'పడమటి సినిమా పరిమళం' పేరుతో ఓ సినీ వ్యాస సంపుటిని తీసుకొచ్చాను. దానికి మంచి గుర్తింపు లభించింది. విదేశీ చిత్రాల విశేషాలను, వివరాలను తెలుసుకోవడానికి ఈతరం పాఠకులు ఉత్సుకత చూపుతున్నారనే విషయం బోధపడింది. అందుకే ఈ యేడాది మా సొంత పుస్తక ప్రచురణ సంస్థ అక్షౌహిణి మీడియా ద్వారా రెండో పుస్తకంగా 'ప్రపంచ సినిమా పరిమళం'ను తీసుకొచ్చాను. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకానికి పాఠకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. సినీ రంగానికి చెందిన పెద్దలు వంశీ గారు (Vamsy) ఈ పుస్తకాన్ని చదివి అభినందించారు. ఇందులో ఓ వ్యాసాన్ని రాసిన ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి (Malladi Venkata Krishna Murthy) గారు ప్రత్యేకంగా ఈ పుస్తక విశేషాలను తెలియచేస్తూ వాయిస్ మెసేజ్ ఇచ్చారు. వీరందరి ప్రేరణ, ప్రోత్సాహంతో త్వరలో వివిధ దేశాలకు చెందిన సినిమాల విశేషాలతో కూడిన మరిన్ని పుస్తకాలను తీసుకుని రావాలనుకుంటున్నాను' అని అన్నారు.
ఈ పుస్తకం గురించి మల్లాది మాట్లాడుతూ, 'ఓటీటీ ల్లో, యూట్యూబ్ లో వేలాది సినిమాలు అందుబాటులో ఉండడంతో ఏం చూడాలనే మీమాంస నాతో పాటు అందరికీ ఉంటుందనే అనుకుంటున్నాను. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టలైన వారు తమకు నచ్చిన సినిమాల గురించి రాసిన వ్యాసాలతో ఈ 'ప్రపంచ సినిమా పరిమళం' పుస్తకం రూపొందింది. మొత్తం 26 వ్యాసాలు. మీరు సినిమా ప్రేమికులైతే ఇది ఖచ్చితంగా చూడదగ్గ పుస్తకం. ధర చాలా స్వల్పం. ఒక్కో సినిమా గురించి 6 రూపాయల ఖర్చుతోనే చదవొచ్చు' అని అన్నారు.
Also Read: Allu Sirish Wedding: అల్లు అర్జున్ బాటలోనే తమ్ముడు.. పెళ్లి డేట్ ప్రకటించిన శిరీష్!
Also Read: Aadi Saikumar: ఆది.. క్రేజీ ప్రాజెక్ట్! హాస్య మూవీస్‌లో.. కొత్త చిత్రం