Pawan Kalyan: జనసేన ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరి...
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:05 PM
ప్రముఖ తెలుగు నిర్మాత రామ్ తాళ్ళూరిని జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రముఖ హీరోలతో రామ్ తాళ్ళూరి ఏడెనిమిది సినిమాలు నిర్మించారు. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లోనూ ఓ సినిమాను ప్రకటించారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరిని నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన నిర్వర్తిస్తారు. పార్టీ కోసం పనిచేస్తానని 2014లోనే ఆయన చెప్పారు. అప్పటి నుండి ఎటువంటి ఆపేక్ష లేకుండా పార్టీ పట్ల ఎంతో అంకిత భావాన్ని రామ్ తాళ్ళూరి కనబరిచారని పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తూ వచ్చారని అన్నారు. ప్రస్తుతం పార్టీ తెలంగాణ విభాగంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న రామ్ తాళ్ళూరి సాఫ్ట్ వేర్ రంగ నిపుణుడు, ఆయనకు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. రామ్ తాళ్ళూరికి ఉన్న సంస్థాగత నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ తాళ్ళూరి, తన భార్య రజనితో కలిసి 'చుట్టాలబ్బాయ్, నేల టిక్కెట్, డిస్కోరాజా, కిన్నెరసాని, మట్కా, మెకానిక్ రాకీ' చిత్రాలను నిర్మించారు. 'దండుపాళ్యం -3, వసంత కోకిల' సినిమాలను తెలుగులో డబ్ చేశారు. 'వికటకవి' పేరుతో వెబ్ సీరిస్ నిర్మించారు. అయితే... కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా నిర్మించబోతున్నట్టు రామ్ తాళ్ళూరి ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సైతం జరిగాయి. అయితే ఆ తర్వాత మూవీ అప్ డేట్స్ మాత్రం రాలేదు.
Also Read: Ravi Teja: బాహుబలి: ది ఎపిక్ విడుదల రోజునే మాస్ జాతర...
Also Read: Kanthara: Chapter 1 Review: కాంతార చాప్టర్ 1 రివ్యూ