Pawan Kalyan: విజయ్ కు పవన్ సలహా... నిజమేనా...
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:48 AM
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా పోటీ చేయకుండా అన్నా డీఎంకే, బీజేపీ కూటమితో కలిసి పోటీ చేస్తే బాగుంటుందని పవన్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన విజయ్ కు చెప్పాడని అంటున్నారు.
ఇళయ దళపతి, టీవీకె అధ్యక్షుడు విజయ్ కు గత నెల 27న కరూర్ లో జరిగిన తొక్కిసలాట కొత్త పాఠాలు నేర్పింది. నలభై మందికి పైగా అతని అభిమానులు, పార్టీ కార్యకర్తలు, చిన్నారులు, మహిళలు అక్కడ చనిపోయారు. అధికార డీఎంకే తగిన ప్రొటక్షన్ ఇవ్వలేదని కొందరు, విజయ్ మనుషులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని మరి కొందరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అయితే వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ఇంతవరకూ చెప్పిన విజయ్... కరూర్ సంఘటనతో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ ను ఒంటరి వాడిని చేయాలనుకున్న డీఎంకే పథకానికి ఎన్.డి.ఏ. తూట్లూ పొడుస్తోందా? అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ అతనికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కొన్ని సలహాలూ, సూచనలు ఇస్తున్నాడని తెలుస్తోంది. కానీ విజయ్ వాటిని ఎంతవరకూ మనసులోకి తీసుకున్నాడో తెలియదు. విజయ్ ఇంతవరకూ ఒంటెద్దు పోకడ పోతూ, తన పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశాడు. కరూర్ సంఘటన తర్వాత బీజేపీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ అధికార డీఎంకే నిర్లక్ష్యం ఈ వ్యవహారంలో ఉందని అభిప్రాయపడింది. రాష్ట్ర డీజీపీ తప్పు అంతా విజయ్ మీదకే నెట్టి వేయడాన్ని కూడా ఈ నిజనిర్థారణ కమిటీ తప్పుపట్టింది. ఈ క్రమంలో విజయ్ కు ఈ కమిటీ ఇచ్చిన నివేదక గొప్ప ఊరటను కలిగించిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్... విజయ్ తో ఫోన్ లో మాట్లాడారని, ఒంటరిగా ఎన్నికల బరిలో దిగకుండా, అన్నాడీఎంకే - బీజేపీ కూటమితో చేతులు కలిపితే, ఉమ్మడి శత్రువు డీఎంకేను తేలికగా ఎదుర్కొవచ్చునని సలహా ఇచ్చారని కొందరు చెబుతున్నారు. మిత్ర పక్షాలతో విజయ్ చేతులు కలిపి, డీఎంకేను ఓడిస్తే... ఉప ముఖ్యమంత్రి పదవి పొందే ఛాన్స్ ఉంటుందని పవన్ చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ తో అన్నా డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కూడా ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. విజయ్ కు తమ మద్దత్తు ఉంటుందని, ఎన్డీయే కూటమిలో చేరే ఆలోచన చేయమని పళని స్వామి సలహా ఇచ్చారట. దీనికి తోడు ఇటీవల జరిగిన అన్నా డీఎంకే సభలో విజయ్ కు చెందిన టీవీకే జెండాలు కనిపించడంతో వీరిద్దరి మధ్య సయోధ్య ఏర్పడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్ అన్నా డీఎంకే - బీజేపీ కూటమితో కలిసి వెళ్ళాలా? వద్దా? ఎన్.డి.ఎ.లో చేరాలా? వద్దా? అనే విషయాలపై పొంగల్ తర్వాత నిర్ణయం తీసుకుంటాడని సన్నిహితులు చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్, పళని స్వామి సలహాలు, సూచనలను విజయ్ ఏ మేరకు ఆచరణలో పెడతాడో వేచి చూడాలి.
Also Read: Arasan: వెట్రిమారన్ సినిమా.. శింబు సరసన ఆ ముగ్గురు
Also Read: Priyanka Mohan: ప్రియాంక డీప్‌ఫేక్ ఫొటోలు.. మాజీ మేనేజర్ పనేనా?