RTC X Roads: పొంగల్‌కు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 15 స్క్రీన్స్! 20 ఏండ్ల తర్వాత.. ఓడియన్ రీ ఓపెన్
ABN , Publish Date - Dec 02 , 2025 | 03:14 PM
హైదరాబాద్ ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ లో సంక్రాంతి నుండి మరో 15 స్క్రీన్స్ అదనంగా రాబోతున్నాయి. ఎ.ఎం.బీ. మల్టీప్లెక్స్ లో ఏడు స్క్రీన్స్, ఓడియన్ మల్టీప్లెక్స్ లో 8 స్క్రీన్ ఉంటాయని అంటున్నారు.
ఇప్పుడు సింగిల్ థియేటర్ల హంగామా తగ్గిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ (RTC X Roads) అంటే సింగిల్ థియేటర్లదే హడావుడి అంతా. అక్కడ అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సంధ్య 70 ఎం.ఎం., 35 ఎం.ఎం.; సుదర్శన్ 70 ఎం.ఎం., 35 ఎం.ఎం.; దేవి 70 ఎం.ఎం., సప్తగిరి 70 ఎం.ఎం., ఓడియన్ 70 ఎం.ఎం., ఓడియన్ 35 ఎం.ఎం., ఓడియన్ మినీ, శ్రీమయూరి వంటి థియేటర్లలో వేలాది మంది సినీ అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాలు చూసి ఆనంద పడేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. క్రాస్ రోడ్స్ లోని ఐకానిక్ థియేటర్లు సుదర్శన్ 70 ఎం.ఎం., ఓడియన్ మూతపడ్డాయి.
అలానే శ్రీ మయూరిలోనూ సినిమాలు ఆడటం లేదు. కానీ రోజుల్నీ ఒకేలా ఉండవు కదా! అందుకే సుదర్శన్ 70 ఎం.ఎం. (Sudarshan 70 m.m.) స్థానంలో కొత్తగా రూపుదిద్దుకున్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఇప్పుడు ఎ.ఎం.బి. క్లాసిక్ రాబోతోంది. సంక్రాంతికి ప్రారంభమయ్యే ఈ మల్టీప్లెక్స్ లో ఏడు స్క్రీనింగ్స్ ఉండబోతున్నాయి. ఏషియన్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్స్ కు చెందిన సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు (Maheshbabu) గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన 'ఎ.ఎం.బి.' బాగా క్లిక్ కావడంతో వీరిద్దరూ కలిసి ఇప్పుడీ సెకండ్ వెంచర్ ను ప్రారంభించారు. సంక్రాంతి కానుకగా 'ది రాజా సాబ్' (The Raja Saab) మూవీతో ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ లోని ఏఎంబీ క్లాసిక్ మొదలు కాబోతోందని సమాచారం.
అలానే ఓడియన్ (Odeon) థియేటర్లు ఉన్న స్థలంలోనూ ఇప్పుడో పెద్ద ఓడియన్ షాపింగ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. అందులోనూ మల్టీప్లెక్స్ థియేటర్లను కట్టారు. ఇందులో ఏకంగా ఎనిమిది స్క్రీనింగ్స్ ఉన్నాయి. నిజానికి ఓడియన్ మల్టీప్లెక్స్ థియేటర్ల ను అక్టోబర్ 24వ తేదీనే ప్రారంభిస్తారని అన్నారు. కానీ అనుకున్న ప్రకారం అది ప్రారంభం కాలేదు. అయితే ఇప్పుడు దీనికీ సంక్రాంతి ముహూర్తమే పెట్టారని తెలుస్తోంది. ఆ రకంగా వచ్చే సంక్రాంతికి ఎ.ఎం.బీ.లో ఏడు స్క్రీన్స్, ఓడియన్ లో 8 స్క్రిన్స్ కలిపి ఏకంగా 15 స్క్రీనింగ్స్ ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ లో అదనంగా రాబోతున్నాయి. సో... వచ్చే సంక్రాంతి నుండి సింగిల్ థియేటర్లతో పాటు ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ మల్టీప్లెక్స్ లకూ అడ్డా కాబోతోంది.
Also Read: Raviteja - Shiva Nirvana: రవితేజతో.. ఆరుగురు హీరోయిన్లు! మ్యాటరేంటంటే
Also Read: Janhvi kapoor: చావులపై కూడా అత్యుత్సాహం అంటూ జాన్వీ ఫైర్