Nandamuri Balakrishna: నందమూరి వారసుడు వెనకడుగు.. కూతురు ముందడుగు!
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:15 PM
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆమె నటించింది సినిమాలో కాదు... వాణిజ్య ప్రకటనలో. అందులో ఆమె గ్రేస్ చేసి నందమూరి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులంతా ఆనందపడే క్షణాలు వచ్చేశాయి. మహానటుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు (Ntr) నట వారసుడిగా బాలకృష్ణ సినిమా రంగంలోకి అడుగుపెట్టి యాభై సంవత్సరాలైపోయింది. ఇప్పుడు అందరూ బాలకృష్ణ నట వారుసులుగా ఎవరు తెరంగేట్రమ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ (Mokshagna) త్వరలో హీరోగా తెరంగేట్రమ్ చేస్తారని చెప్పారు. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమా చేస్తున్నామనీ ప్రకటించారు. కానీ కారణాలు ఏవైనా ఆ సినిమా పట్టాలెక్కలేదు. దాంతో నందమూరి బాలకృష్ణ అభిమానులంతా డీలా పడిపోయారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే వారెవ్వరూ ఊహించని స్వీట్ సర్ ప్రైజ్ నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నుండి వచ్చింది.
నందమూరి బాలకృష్ణ బాటలో చిత్రసీమలోకి అడుగుపెట్టిన తేజస్విని (Tejaswini) కొంతకాలంగా ప్రొడక్షన్ వ్యవహారాలను చూస్తోంది. 'ఆహా' (AHA) లో ప్రసారం అవుతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో పాటుగా ఆయన నటించే సినిమాల నిర్మాణాన్ని దగ్గర ఉండి చూసుకుంటోంది. అయితే మరో విశేషం ఏమంటే... ఇప్పటి వరకూ తెర వెనుక ఉన్న తేజస్విని ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ చాలా కాలం వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మనసు మార్చుకుని వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. తద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ ను హాస్పిటల్ అభివృద్ధి కోసం ఖర్చుపెట్టడం మొదలు పెట్టారు. ఆ నోబుల్ కాజ్ ఇప్పుడు తేజస్విని సైతం కెమెరా ముందుకు వచ్చేలా చేసి ఉండొచ్చు. ఆమె ప్రముఖ ఆభరణాల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అరంగేట్రమ్ చేసింది. ఆమె భర్త, మతుకుమల్లి భరత్ ప్రస్తుతం విశాఖ పట్నం పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఆయన విద్యావేత్త కూడా.

సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ తో తేజస్వినికి ఉన్న అనుబంధం, నందమూరి కుటుంబానికి, తెలుగు సినిమా అభిమానులకు సంతోషకర ఘట్టంగా నిలిచింది. ఆ సంస్థకు బ్యాండ్ అంబాసిడర్ గా చేస్తూ తేజస్విని కళాత్మక ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ వాణిజ్య ప్రకటనలో తేజస్విని కనిపించిన తీరు, ఆమె ఆత్మవిశ్వాసం, గ్రేస్ నందమూరి అభిమానులను కట్టిపడేస్తోంది. ఇంతటి ఛార్మ్ ఉన్న అమ్మాయి సినిమాల్లో నటించి ఉంటే ఎంత బాగుంటుంది! అనుకుంటున్నారు నందమూరి అభిమానులు. తాత, తండ్రి నుండి నటనా వారసత్వాన్ని తేజస్విని సంపూర్ణంగా అందిపుచ్చుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. కథానాయికగా కాకపోయినా తేజస్విని తనకు నచ్చిన, తనకు తగ్గ పాత్రలను సిల్వర్ స్క్రీన్ మీద చేస్తే వారంతా చూడాలని అనుకుంటున్నారు. మరి ఆమె నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
ఇక ఈ బ్రాండ్ ప్రమోషనల్ వీడియో విషయానికి వస్తే డి. యమున కిశోర్ దీనిని తెరకెక్కించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ సమకూర్చగా, ఎస్. ఎస్. థమన్ సంగీతాన్ని అందించారు. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ ప్రతి షాట్ ని విజువల్ ఫీస్ట్ గా మలిచింది. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ కాగా నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నెరవేర్చారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ తన లెన్స్ తో తేజస్విని ని చక్కగా కాప్చర్ చేశారు. 'శ్రీమతి నందమూరి తేజస్విని తమ బ్రాండ్ కు అంబాసిడర్ గా పనిచేయడం ఆనందంగా ఉంద'ని సంస్థ తరఫున మాట్లాడుతూ వేమూరి కృష్ణప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మతుకుమిల్లి, శ్రీదుర్గ కాట్రగడ్డ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Trinadha Rao Nakkina: 'నేను రెడీ'కి.. మిక్కీ స్వరాలు
Also Read: Women’s Cricket Team: మహిళా క్రికెట్ జట్టుకు సెలబ్రిటీల అభినందనలు