Tollywood: నిర్మాత సునీల్ తండ్రి కన్నుమూత
ABN , Publish Date - Nov 05 , 2025 | 02:14 PM
శివాజీ హీరోగా 'మిస్టర్ ఎర్రబాబు' సినిమాను నిర్మించిన చలమలశెట్టి సునీల్ తండ్రి డా. సురేంద్రనాథ్ కన్నుమూశారు. చలమలశెట్టి సునీల్ వ్యాపారవేత్తగా రాణించినా, రాజకీయ, సినీ రంగాల్లో ఆయనకు చేదు అనుభవాలే మిగిలాయి.
హీరో శివాజీ (Shivaji), రోమా (Roma) జంటగా 2005లో 'మిస్టర్ ఎర్రబాబు' (Mr. Errababu) సినిమాను నిర్మించారు చలమలశెట్టి సునీల్ (Chalamalashetty Sunil). ఆయన తండ్రి డాక్టర్ చలమలశెట్టి సురేంద్రనాథ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం స్వగ్రామం మచిలీపట్నంలోని చిలకలపూడికి బుధవారం తీసుకెళ్ళారు. అక్కడే వారి అంత్యక్రియలు జరుగనున్నాయి.
చలమలశెట్టి సురేంద్రనాథ్ కుమారుడు సునీల్ మాత్రం తండ్రి బాటలో ప్రయాణించకుండా వ్యాపారవేత్తగా మారారు. పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించి, గ్రీన్ కో కంపెనీని స్థాపించారు. అనంతరం సినిమా రంగంలోకీ వచ్చిన శివాజీ హీరోగా కిశోర్ దర్శకత్వంలో 'మిస్టర్ ఎర్రబాబు' సినిమా నిర్మించారు. ఇందులో సునీల్, సత్యనారాయణ, రఘుబాబు, నాగబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆశాసైనీ ఐటమ్ సాంగ్ చేసింది. దీనికి కోటి (Koti) సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించకపోవడంతో ఆయన సినిమా రంగాన్ని విడిచారు.

విఫల రాజకీయ నాయకుడు
చలమలశెట్టి సునీల్ వ్యాపారవేత్తగా స్థిరపడిన తర్వాత రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి హవాతో ఆయన ఓటమి చవిచూశారు. దాంతో 2014లో వైసీపీలో చేరి మరోసారి కాకినాడ సెగ్మెంట్ నుండే పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన ఓడిపోయారు. దాంతో 2019లో టీడీపీలో చేరి కాకినాడ పార్లమెంట్ నుండే మరోసారి పోటీ చేశారు. చిత్రం ఏమంటే అప్పుడూ ఆయన ఓటమి పాలయ్యారు. ఇక నాలుగోసారి గత ఎన్నికల్లో తిరిగి వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంట్ నుండి పోటీ చేశారు. ఈ సారి చలమలశెట్టి సునీల్ జనసేన పార్టీ అభ్యర్థి తంగిరాల ఉదయ శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ఆ రకంగా వ్యాపార రంగంలో రాణించినా... నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా మాత్రం సునీల్ కు చేదు అనుభవాలే మిగిలాయి.
Also Read: Accident: రోడ్డు ప్రమాదం.. ప్రముఖ డాన్సర్ మృతి! కొత్త కారు.. సోదరుడికి చూపించి వస్తుండగా ఘటన