Allu Aravind: నాకంటూ ఓ స్దాయి ఉంది.. నేను మాట్లడను! బండ్లన్నకు.. అల్లు అరవింద్ అదిరిపోయే కౌంటర్
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:38 PM
‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఈవెంట్‌లో బండ్ల గణేశ్‌కు.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.
రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో, రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో రూపొందిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend ) నవంబర్ 7న విడుదల కానుంది. అల్లు అరవింద్ (Allu Aravind) గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ నుంచి మంచి హైప్ క్రియేట్ చేయడంతో సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో తాజాగా బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా.. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నేను చాలా సినిమాలు తీశాను, డబ్బులు సంపాదించాను. కానీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మాత్రం తృప్తికోసం తీశాను” అంటూ ఆయన అన్నారు. 2021లో ఈ కథ విన్నప్పటి నుంచి సినిమా తీయాలని ఎదురుచూశాను. సమాజానికి బోల్డ్‌గా కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. అందుకే ఈ సినిమా చేశాము. ఇది చాలా సున్నితమైన సబ్జెక్ట్. ప్రతి యువకుడు, యువతి తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.” అని అన్నారు.
ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని ఫైటింగ్‌లు ఉన్నాయి, ఏం పంచ్‌లు ఉన్నాయనేది ఈ సినిమాకు వర్తించదని, “మన ఇంట్లో ఆడవాళ్ల మనస్సుల్లో ఏమి కోరికలు, భావోద్వేగాలు ఉంటాయో ఈ సినిమా చూపిస్తుంది. కథ అతి సున్నితంగా మొదలై, అతి ఘాటుగా ముగుస్తుంది. చూసిన వారు ఈ సినిమాను మర్చిపోలేరు… ఈ కథ వెంటాడుతుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కి తక్కువ రేటింగ్ ఇవ్వలేరు అంత సంతృప్తికరంగా ఉంటుంది సినిమా అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కూడా ముందుకు వచ్చి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సినిమాపై మరింత బజ్ తీసుకొచ్చేలా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఓ విలేఖరి ఇటీవల బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడాలి అని అడగగా.. నేను ఆయన గురించి మాట్లాడను నాకంటూ ఓ స్దాయి ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు.