Thug Life: కమల్ హాసన్ పై కన్నడిగుల కినుక

ABN , Publish Date - May 28 , 2025 | 03:13 PM

కన్నడ భాషను తక్కువ చేస్తూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి తెర తీశాయి. కమల్ హాసన్ సినిమాలను కర్ణాటకలో బ్యాన్ చేయాలనే వరకూ ఇది వెళ్ళిపోయింది.

కమల్ హాసన్ నాయకుడిగా మణిరత్నం తెరకెక్కించిన 'థగ్ లైఫ్' సినిమా ఇప్పుడు కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. ఇటీవల చెన్నయ్ లో జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకలో 'తమిళం నుండి కన్నడ భాష పుట్టింది' అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కన్నడిగులు తప్పుపడుతున్నారు. దక్షిణాది భాషలన్నీ ద్రవిడం నుండి వచ్చాయన్నది భాషాశాస్త్రవేత్తలు చెప్పే మాట. అంతమాత్రం చేత తమిళం నుండి కన్నడ భాష పుట్టిందని కమల్ అనడం సహించరాదనిదని వారు అంటున్నారు.

కమల్ హాసన్ కేవలం నటుడిగానే కాకుండా పొలిటికల్ పార్టీ అధినేత కూడా. అయితే అధికార డీఎంకే ప్రాపంకం కోసమే కమల్ హాసన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. కమల్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ రంగును పులుముకున్నాయి. కర్ణాటక బీజేపీ చీఫ్‌ బీవై విజయేంద్ర కమల్ హాసన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. అతని డిమాండ్ ను కన్నడ భాషా సంఘాలు సమర్థిస్తున్నాయి. చివరకు కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య సైతం కమల్ హాసన్ వ్యాఖ్యలను ఖండించారు.


ఇది సరిపోదన్నట్టుగా మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళసై సైతం కమల్ హాసన్ కన్నడ భాషను తక్కువ చేయడాన్ని విమర్శించారు. వ్యక్తులను కలపడం కోసం భాషలను ఉపయోగించాలే కానీ వారి మధ్య వివాదాలను సృష్టించడానికి కాదని, కమల్ హాసన్ ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిదని అన్నారు. పక్క రాష్ట్రం భాషను ముందుగా కమల్ హాసన్ గౌరవించి, ఆ తర్వాత హిందీపై పోరాడితే బాగుంటుందని మరి కొందరు వ్యాఖ్యానించారు. ప్రముఖ నటుడు, స్వర్గీయ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ ముందే కమల్ ఇలా కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడటం సమంజసంగా లేదని, ఆ సమయంలో శివరాజ్ కుమార్ సైతం మౌనంగా ఉండటం తమను బాధించిందని పలు కన్నడ భాషా సంఘాలు ఆవేదనను వ్యక్తం చేశాయి. కమల్ హాసన్ సినిమాలు కర్ణాటకలో ఆడనివ్వమంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు హల్చల్ చేస్తున్నారు. కమల్ నటించిన 'థగ్ లైఫ్‌' సినిమా జూన్ 5న జనం ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ భాషా వివాదం చెలరేగడం మేకర్స్ కు తలనొప్పిగా మారింది. సినిమా నిర్మాణంలో కమల్ హాసన్ సైతం భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కన్నడిగులకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెబుతారని సన్నిహితులు భావిస్తున్నారు.


ఇటీవల ఓ బ్యాంక్ మేనేజర్ తాను కన్నడలో మాట్లాడనని కరాఖండీగా కస్టమర్ తో చెప్పడం కూడా వివాదమైంది. స్థానికుల ఫిర్యాదుతో ఆమెను అక్కడ నుండి ట్రాన్స్ ఫర్ చేశారు. అలానే ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు సైతం వివాదానికి దారితీశాయి. దాంతో చివరకు కన్నడిగులకు అతను క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇలా వరుసగా కన్నడ భాషపై కొందరు పనిగట్టుకుని దాడి చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

మొత్తం మీద తన మాతృభాష తమిళాన్ని కీర్తించే క్రమంలో కమల్ హాసన్ కన్నడ భాషను తక్కువ చేయడం చాలామంది సహించలేకుండా ఉన్నారు. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Also Read: Sandeep Reddy Vanga: వివాదంపై దీపిక పరోక్ష వ్యాఖ్యలు

Also Read: Dasara : బాలయ్య, పవన్ బాక్సాఫీస్ వార్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 28 , 2025 | 03:15 PM