Dasara : బాలయ్య, పవన్ బాక్సాఫీస్ వార్

ABN , Publish Date - May 28 , 2025 | 01:19 PM

ఒకే రోజున ఇద్దరు సూపర్ స్టార్స్ మూవీస్ రిలీజ్ అయితే ఆడియెన్స్ కు భలే కిక్కు!. గతంలో అలా పలువురు స్టార్ హీరోస్ బాక్సాఫీస్ బరిలో ఢీ కొని జనానికి వినోదం పంచారు. ఇప్పుడు అదే తీరున సాగడానికి నటసింహ బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సిద్ధమవుతున్నారు. ఆ ముచ్చటేంటో చూద్దాం.

టాప్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ (Bala Krishna), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి నేడు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఇద్దరూ తమదైన బాణీ పలికిస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. వీరిద్దరి జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమా వస్తే చాలు జేజేలు పలుకుతూ ఉంటారు.. అలాంటి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇప్పటి దాకా బాక్సాఫీస్ బరిలో ఒకే రోజున ఢీ కొనలేదు. రాబోయే సెప్టెంబర్ 25న వారిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వార్ కు తెరతీస్తున్నాయని వినిపిస్తోంది. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను (Boyapathi Srinu) దర్శకత్వంలో రూపొందుతోన్న 'అఖండ-2' (Akhanda -2) రిలీజ్ డేట్ ను నిర్మాతలు ఏ నాడో సెప్టెంబర్ 25 అని ప్రకటించారు. కాగా, ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'ఓజీ' (OG) ని కూడా అదే సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. అలా ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ నడుమ రాబోయే దసరాకు పోటీ నెలకొననుందన్న మాట!. 'అఖండ-2' చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలసి బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని నిర్మిస్తున్నారు. ఇక 'ఓజీ' చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాత. డేట్ ను ముందుగా ప్రకటించింది మాత్రం 'అఖండ-2' మేకర్స్ అనే చెప్పాలి.

ఇప్పటి దాకా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది రెండే రెండు సార్లు. 2006 లో ఒకసారి, మరో పుష్కరకాలానికి 2018లో మరోసారి బాలయ్య, పవన్ బరిలో దూకారు. 2006 ఏప్రిల్ 29న బాలయ్య హీరోగా 'వీరభద్ర' చిత్రం వెలుగు చూసింది. ఈ సినిమా వచ్చిన నాలుగు రోజులకే పవన్ కళ్యాణ్ 'బంగారం' జనం ముందు నిలచింది. ఆ యేడాది ఏప్రిల్ 28న వచ్చిన 'పోకిరి' ముందు బాలయ్య 'వీరభద్ర', పవన్ 'బంగారం' చిత్రాలు చిత్తయి పోయాయి. 2018 జనవరి 10న పవన్ కళ్యాణ్ 'అజ్ఙాతవాసి' రాగా రెండు రోజులకు జనవరి 12వ తేదీన బాలయ్య 'జై సింహా' విడుదలయింది. 'అజ్ఞాతవాసి' మొదటి రోజు సందడి వరకే పరిమితం కాగా, 'జై సింహా' శతదినోత్సవం జరుపుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళకు బాలయ్య, పవన్ ఢీ కొనబోవడం విశేషంగా మారింది. అంతేకాదు వారిద్దరూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారం పంచుకుంటున్న పార్టీలకు చెందినవారు కావడంతో 'అఖండ-2', 'ఓజీ' మధ్య పోటీ ఉంటుందా లేదా అన్న అనుమానాలూ పొడసూపుతున్నాయి.


తెలుగునాట పోటీ అంటే ఒకప్పుడు యన్టీఆర్ - ఏయన్నార్ నడుమ బలే రంజుగా ఉండేది. ఆ తరువాత అలాంటి పోటీ అన్నది చిరంజీవి - బాలకృష్ణ మధ్యనే సాగింది. వారిద్దరూ బాక్సాఫీస్ బరిలో అనేక సార్లు ఢీ అంటే ఢీ అంటూ సాగారు. ఒకే ఒక్క 2001 జనవరి 11వ తేదీన బాలకృష్ణ 'నరసింహనాయుడు', చిరంజీవి 'మృగరాజు' రిలీజ్ అయ్యాయి. అప్పుడు 'నరసింహనాయుడు' ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. అంతే తప్ప చిరు-బాలయ్య ఒకే రోజున బాక్సాఫీస్ వార్ లో పాల్గొనలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 25న బాలయ్య 'అఖండ-2'తో పవన్ కళ్యాణ్ 'ఓజీ' పోటికి దిగితే, మళ్ళీ 2001 నాటి సీన్ రిపీట్ అవుతుందనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య 'అఖండ-2'కు ఇప్పటికే ఎంతో బజ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ 'ఓజీ'కి రాబోయే 'హరిహర వీరమల్లు' టాక్ ను బట్టి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇద్దరూ మాస్ హీరోలు కాబట్టి తప్పకుండా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ క్రేజ్ దానంతట అదే వస్తుందనీ ఆశిస్తున్నారు ఫ్యాన్స్. 'అఖండ-2', 'ఓజీ' రెండూ పాన్ ఇండియా మూవీస్ కాబట్టి, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావద్భారతంలో థియేటర్లు పట్టడంలో సమస్య ఎదురుకావచ్చుననీ అంటున్నారు. మరి రాజకీయాల్లో స్నేహబంధంతో సాగుతున్న బాలయ్య, పవన్ ఎలా సర్దుబాటు చేసుకుంటారో చూడాలి.

Also Read: OTT Movies: మే చివ‌రి వారం.. ఓటీటీలో సినిమాల జాత‌రే జాత‌ర‌

Also Read: Tollywood: మన స్టార్స్ అలా చేయరెందుకు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 28 , 2025 | 01:27 PM