Srikanth Vissa: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాతో దర్శకుడిగా...
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:56 PM
ప్రముఖ రచయిత శ్రీకాంత్ విస్సా త్వరలో మెగాఫోన్ పట్టబోతున్నాడు. శ్రీకాంత్ విస్సాను దర్శకుడి చేసే బాధ్యతను హీరో, ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
తెలుగు చిత్రసీమలో రైటర్స్... డైరెక్టర్స్ గా మారిన దాఖలాలు చాలానే ఉన్నాయి. నాలుగైదు సినిమాలకు రచన చేసిన వారు సైతం ఠక్కున దర్శకులుగా మారిపోతున్నారు. అయితే అందులో సక్సెస్ అందుకుంటున్న వారిని చేతిమీద లెక్కపెట్టాల్సిందే. కాకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), అనిల్ రావిపూడి (Anil Ravipudi) వంటి వారు మాత్రం టాప్ దర్శకులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దాంతో మరికొంత మంది రచయితలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సాహసిస్తున్నారు. తాజాగా రచయిత శ్రీకాంత్ విస్సా (Srikanth Vissa) సైతం దర్శకుడిగా మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన 'పుష్ప' (Pushpa) ఫ్రాంచైజ్ కు శ్రీకాంత్ విస్సా మాటలు రాశాడు. దానికి ముందు కూడా శ్రీకాంత్ పలు చిత్రాలకు మాటల రచయితగా పనిచేశాడు. కొన్ని సినిమాలకు కథలనూ అందించాడు.
విశేషం ఏమంటే... నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ను నెలకొల్పిన దగ్గర నుండి ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఇండస్ట్రీలో తమకంటూ ఓ చక్కని గుర్తింపునూ పొందారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించిన 'బింబిసార' (Bimbisara) తోనే వశిష్ఠ దర్శకుడయ్యాడు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి (Chiraranjeevi) తో 'విశ్వంభర' (Vishwambhara) మూవీ చేసే స్థాయికి ఎదిగాడు. తన చిత్రం 'డెవిల్'కు కథను అందించి, 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'కి స్క్రీన్ ప్లే సమకూర్చిన శ్రీకాంత్ విస్సాను ఇప్పుడు కళ్యాణ్ రామ్ డైరెక్టర్ గా మార్చుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద తీసే సొంత సినిమాకు అతనే దర్శకుడట. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. మరి రచయితగా మంచి పేరు, ప్రఖ్యాతలు పొందిన శ్రీకాంత్ విస్సా... దర్శకుడిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.
Also Read: Kantara 1: 'ఛావా'ను దాటేసిన 'కాంతార: చాప్టర్ 1'
Also Read: RGV: బాలీవుడ్‌లో.. మళ్లీ పాదం మోపుతున్న వర్మ! లైన్‌లో.. రెండు భారీ చిత్రాలు