Cinema: అతి నిడివి చిత్రాలపై అమితాసక్తి...

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:12 PM

ఆ మధ్య పెద్ద సినిమా చూడాలంటే ప్రేక్షకులకు బోర్ ఫీలయ్యే వాళ్ళు. కానీ ఇవాళ సినిమా కూర్చోబెట్టగలిగితే... మూడు గంటల నిడివి ఉన్న చిత్రాలనూ ఆదరిస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ 'దురంధర్' మూవీనే.

Long Run time movies

ఈ తరం కుర్రాళ్ళకు ఓపిక లేదు - అందుకే షార్ట్స్ తో సాగుతున్నారు. లఘు చిత్రాలకు క్రేజ్ ఉన్న ఈ రోజుల్లోనూ మూడు గంటల రన్ టైమ్ మూవీస్ వస్తున్నాయి. అలరిస్తున్నాయి. మళ్ళీ త్రీ అవర్స్ సినిమాలకు క్రేజ్ వచ్చేసిందా అని చర్చ సాగుతోంది.

ఈ యేడాది రిలీజైన ఫీచర్ ఫిలిమ్స్ లో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా రూపొందిన 'దురంధర్' (Dhurandhar) అతి నిడివిగల చిత్రం. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 34 నిమిషాలు. అయినా జనం భలేగా ఆదరిస్తున్నారు. అలాగే రెండు 'బాహుబలి' (Bahubali) చిత్రాలను కలిపి 'బాహుబలి- ది ఎపిక్'గా రూపొందించారు. ఈ మూవీ రన్ టైట్ 3 గంటల 45 నిమిషాలు. గత సంవత్సరం బంపర్ హిట్ గా నిలచిన 'పుష్ప-2' (Pushpa 2) కూడా 3 గంటల 20 నిమిషాలతో అలరించింది. అంతకు ముందు 2023లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'యానిమల్' (Animal) కూడా 3 గంటల 24 నిమిషాలు ఉంది. ఇలా ఈ చిత్రాల నిడివి ఎంతగా ఉన్నా, ఆకట్టుకొనే అంశాలు ఉన్న కారణంగా బంపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో మళ్ళీ మూడు గంటల సినిమాలకు క్రేజ్ వచ్చిందంటూ సినీజనం అంటున్నారు. రాబోయే హాలీవుడ్ మూవీ 'అవతార్ -3' కూడా 3 గంటల 17 నిమిషాల ప్రదర్శనా కాలం ఉన్నట్టు తెలుస్తోంది. జేమ్స్ కేమరాన్ తెరకెక్కించిన 'అవతార్- ఫైర్ అండ్ యాష్' (Avatar Fire and Ash) కూడా అలరిస్తే మేకర్స్ మూడు గంటల పై చిలుకు టైమ్ ఉన్న సినిమాలవైపు పరుగుతీసేలా ఉన్నారని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.


ఆల్ టైమ్ రన్ టైమ్స్...

ఒకప్పుడు కొన్ని చిత్రాలను ప్రత్యేకించి అతినిడివిగా రూపొందించేవారు. అలా 2012లో వచ్చిన స్వీడిష్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ 'లాగిస్టిక్స్' 857 గంటల రన్ టైమ్ తో రూపొందింది. అంటే ఈ సినిమా ప్రదర్శనా కాలం 35 రోజుల 17 గంటలన్న మాట. ఇంత నిడివిగల చిత్రాన్ని చూడాలంటే ఎంతటి మూవీ లవర్స్ అయినా కనీసం 50 రోజుల టైమ్ కేటాయించాల్సందే అంటున్నారు సినీజనం. అలాగే 'మోడరన్ టైమ్స్ ఫరెవర్' అనే మూవీ 10 రోజుల రన్ టైమ్ తోనూ, 'ద క్యూర్ ఫర్ ఇన్సోమ్నియా' 3 రోజుల 15 గంటల ప్రదర్శనా కాలంతో రూపొందాయి. మన ఇండియాలో అయితే 'జెక్ మేట్- ఇన్ సర్చ్ ఆఫ్ జిరి మెంజెల్' అనే మూవీ 7 గంటల 28 నిమిషాల ప్రదర్శనా సమయంతో రూపొందింది. ఈ చిత్రాన్ని ఇండియా, జెక్ రిపబ్లిక్, స్లోవేకియా సంయుక్తంగా నిర్మించాయి. 2018లో రిలీజైన 'జెక్ మేట్'ను శివేంద్ర సింగ్ దుంగార్పూర్ రూపొందించారు.అంతకు ముందు 1988లో గోవింద నిహలానీ దర్శకత్వం వహించిన 'తమస్' 4 గంటల 58 నిమిషాల రన్ టైమ్ తో అతి పెద్ద నిడివిగల చిత్రంగా ఉండేది. ఇక స్టార్స్ నటించిన సినిమాల్లో 1970 నాటి రాజ్ కపూర్ దర్శకత్వం వహించి నటించిన 'మేరా నామ్ జోకర్' 4 గంటల 8 నిమిషాల రన్ టైమ్ తో సాగింది. ఆ పై మన యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో త్రిపాత్రాభినయం చేస్తూ రూపొందించిన 1977 నాటి 'దానవీరశూర కర్ణ' కూడా 4 గంటలకు పైగా ప్రదర్శనా సమయంతో తెరకెక్కింది. దానికి ముందు తెలుగునాట తొలి రంగుల చిత్రం 'లవకుశ' 3 గంటల 28 నిమిషాల రన్ టైమ్ తో అఖండ విజయం సాధించింది. అతి నిడివిగల చిత్రాలు పలుమార్లు ఘన విజయాలను సాధించాయి. మరికొన్నిసార్లు ఘోర పరాజయాలనూ చూశాయి. తెలుగులో మాత్రం అతినిడివి గల చిత్రాలు ఘనవిజయాన్నే మూటకట్టుకోవడం విశేషం!

ఈ యేడాది 'దురంధర్' తరువాత అతి నిడివిగల చిత్రంగా హాలీవుడ్ మూవీ 'అవతార్ - ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న వెలుగు చూస్తోంది. రాబోయే ప్రభాస్ 'ద రాజాసాబ్' కూడా 3 గంటల 10 నిమిషాలు రన్ టైమ్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే 'ద రాజాసాబ్' రిలీజయ్యే జనవరి 9నే వస్తోన్న తమిళ డబ్బింగ్ మూవీ 'జన నాయకుడు' కూడా 3 గంటల 5 నిమిషాల ప్రదర్శనా కాలంతో తెరకెక్కిందట. ఒకే రోజున వస్తోన్న ఈ లాంగెస్ట్ రన్ టైమ్ మూవీస్ విజయం సాధిస్తే, రాబోయే కాలంలో 3 గంటల రన్ టైమ్ సినిమాలకు మరింత క్రేజ్ పెరుగవచ్చని పరిశీలకుల అంచనా! ఏమవుతుందో చూడాలి.

Also Read: New Multiplex: హైద‌రాబాద్‌లో.. మ‌రో ల‌గ్జ‌రీ మ‌ల్టీఫ్లెక్స్‌ ఓపెన్‌! నాంప‌ల్లిలో.. లైవ్ కిచెన్‌తో

Also Read: Sukumar: ఆయన 'అవతార్'... మేమంతా మానవ మాత్రులమే...

Updated Date - Dec 18 , 2025 | 05:27 PM