Sukumar: ఆయన 'అవతార్'... మేమంతా మానవ మాత్రులమే...
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:46 PM
'అవతార్' సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్ ను దర్శకుడు సుకుమార్ ఆకాశానికెత్తేశాడు. ఆయన అవతార్ అయితే తాము మానవ మాత్రులమని సుకుమార్ వ్యాఖ్యానించడం విశేషం.
ప్రపంచ సినిమా చరిత్రలో 'అవతార్' (Avatar) ఒక సంచలనం. పండోర (Pandora) అనే అద్భుత ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హాలీవుడ్ సెన్సేషన్ జేమ్స్ కామెరూన్ (James Cameron), ఇప్పుడు 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire and Ash) తో అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు వీక్షించిన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), మూవీపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
3 గంటల సినిమా.. క్షణాల్లా గడిచిపోయాయి!
'అవతార్ 3' చూసిన తర్వాత దర్శకుడు సుకుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'జేమ్స్ కామెరూన్ సినిమాల్లో ఒక 'అవతార్' అయితే, మిగతా దర్శకులమంతా కేవలం మానవమాత్రులమే. ఈ కథను ఇంత అద్భుతంగా చెప్పడం సామాన్యమైన విషయం కాదు. సుమారు 3 గంటల 17 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం చూస్తున్నప్పుడు టైమ్ తెలియలేదు. ఆ సమయం నాకు క్షణాల్లా అనిపించింది' అని పేర్కొన్నారు. సినిమా చూస్తున్నంత సేపు తాను మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపించిందని సుకుమార్ తెలిపారు. ఈ సినిమాలో విజువల్స్ ఎంత గొప్పగా ఉన్నాయో, ఎమోషన్స్ కూడా అంతే బలంగా ఉన్నాయన్నారు. మన తెలుగు సినిమాల్లో ఉండేటటువంటి గాఢమైన సెంటిమెంట్ ఇందులో ఉందన్నారు సుకుమార్. 'అవతార్ 3'లో కొన్ని సీన్స్ చూస్తున్ననప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని, పండోర ప్రపంచం, అందులోని పాత్రలు తన మనసులో నుంచి చెరిగిపోవడం లేదని చెప్పారు సుకుమార్. సినిమా అంటే ఇదీ అనిపించేలా కామెరూన్ తీర్చిదిద్దారని ఆయన ప్రశంసించారు. ఇలాంటి గొప్ప చిత్రాలను కేవలం థియేటర్లలోనే చూడాలని, ఇంతటి అద్భుతాన్ని అందించినందుకు జేమ్స్ కామెరూన్‌కు సుకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
'అవతార్' మొదటి భాగంలో అడవిని, రెండో భాగంలో నీటిని చూపించిన కామెరూన్, ఈ మూడో భాగంలో 'అగ్ని' (Fire) నేపథ్యంతో సరికొత్త తెగను పరిచయం చేయబోతున్నారు. దాదాపు 160 భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాయడం ఖాయమని సుకుమార్ మాటలను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి సుకుమార్ వంటి టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న డైరెక్టరే మెచ్చుకున్నారంటే, అవతార్-3 ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Sumalatha Devi: సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం...
Also Read: Sara Arjun: సారా అర్జున్.. చేసిన రెండు సినిమాలకు 'ఏ' సర్టిఫికెట్