New Multiplex: హైదరాబాద్‌లో.. మరో లగ్జరీ మల్టీప్లెక్స్ ఓపెన్! నాంపల్లిలో.. లైవ్ కిచెన్‌తో
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:57 PM
హైదరాబాద్ నగరంలో మరో మల్టీ లగ్జరీ మల్టీప్లెక్స్ శుక్రవారం నుంచి అందుబాటులోకి రాబోతుంది.
హైదరాబాద్ నగరంలో మరో మల్టీ లగ్జరీ మల్టీప్లెక్స్అం దుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరమంతా అడుగుపెడితే చాలు ఇంద్ర భవనాల లాంటి హంగులతో మల్టీప్లెక్స్ థియేర్టలు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్, రిఫ్రెష్‌మెంట్ అందిస్తుండగా ఆ బాటలోనే మరిన్ని సంస్థలు దూసుకు వస్తున్నాయి. సినిమా అభిమానులకు టైంపాస్ ఎలా అనే ఆలోచన రాకుండా ఎప్పటికప్పుడు అధునాతన, అద్భుత టెక్నాలజీలను తీసుకువస్తూ అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి పోటీ పడుతున్నాయి.
హైదరాబాద్‌లో.. రెండు దశాబ్దాల క్రితం పీవీఆర్ (PVR Cinemas)తో ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్ సంస్కృతి ఈ ఆరేండ్ల నుంచి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. మహేశ్ బాబు ఏఏంబీ (AMB Cinemas) ప్రారంభించింది మొదలు ఆ తర్వాత అల్లు అర్జున్, రవితేజ ఈ దారిలోకి వచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించగా ఇప్పుడు ముంబైలో పేరేన్నికగన్న బడా కంపెనీలు క్రమంగా హైదరాబాద్‌పై దృష్టి పెట్టాయి.
తాజాగా.. సూరత్, ఘజియాబాద్, ముజఫర్ నగర్ వంటి నగరాల్లో సక్సెస్‌ఫల్‌గా రన్ అవుతున్న రుంగ్తా సినిమాస్ (Roongta Cinemas) అనే మల్టీప్లెక్స్ చైన్ లింక్ థియేటర్ల సంస్థ 'అవతార్ 3' సినిమాతో గ్రాండ్‌గా హైదరాబాద్ లో తన థియేటర్లను ఓపెన్ చేస్తోంది. అదీ కూడా ఇప్పటివరకు మల్టీప్లెక్స్ థియేటర్ మాటే ఎరుగని నాంపల్లిలో! హైదరాబాద్ మహానగరం నడిబోడ్డున గాంధీభవన్‌కు, నాంపల్లి రైల్వే స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఈ మల్టీప్లెక్స్ ఉండటం విశేషం.

రెండంటే రెండే స్క్రీన్లు ఉన్న ఈ మల్టీప్లెక్స్ బార్కో 2కే ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీ, ప్రీమియం రిక్లైనింగ్ సీట్లు, లైవ్ కిచెన్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండనుంది. ప్రారంభ సినిమాలుగా అవతార్ (Avatar: Fire and Ash) ఇంగ్లీష్, హిందీ త్రీడీ వెర్షన్స్, దురంధర్ (Dhurandhar) చిత్రాలను ప్రదర్శించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే సిటీలో ప్రసాద్ మల్టీప్లెక్స్, పీవీఆర్, సినీ పొలీస్, మిరాజ్, ఏఏఏ సినిమాస్, ఏఆర్టీ సినిమాస్, ఏఏంబీ సినిమాస్ వంటి మల్టీప్లెక్స్ లు విజయవంతంగా రన్ అవుతుండగా అవి మరిన్ని ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో కాన్‌ఫ్లెక్స్ సినిమాస్ అనే ముంబై బేస్డ్ మల్టీప్లెక్స్ ఇటీవలే బంజారాహిల్స్ నాగార్జున సర్కిల్‌లో స్టార్ట్ అయింది. కోకా పేట్‌లో ఏఏఏ సినిమాస్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో ఓడియన్, ఏఏంబీ సినిమాస్, కర్మాన్ ఘాట్‌లో దేవగన్ సినిమాస్ వంటి మల్టీప్లెక్స్ లు జనవరిలో ప్రారంభం కానుండడం సినీ లవర్స్‌కు ఫుల్ జోష్ ఇస్తున్నాయి.