Sambosa Chapati: బాలీవుడ్ సాంగ్ తో అరబిక్ మూవీ

ABN , Publish Date - Aug 25 , 2025 | 05:18 PM

హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటీవల ఓ అరబిక్ మూవీ షూటింగ్ జరిగింది. బాలీవుడ్ సాంగ్ ను తలపించేలా ఏకంగా 200లకు పైగా డాన్సర్స్ తో ఓ పాటను ఇక్కడ చిత్రీకరించారు.

Sambosa Chapathi Movie

హిందీ సినిమాలనే కాదు... అందులోని పాటలనూ అరబ్ దేశాల్లోని ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతుంటారు. అందుకే తాజాగా ఓ అరబిక్ మూవీలో బాలీవుడ్ పాటను తలపించే ఓ గీతాన్ని పెట్టారు. ఆగస్ట్ 14న గల్ఫ్ కంట్రీస్ లో విడుదలైన ఈ సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. విశేషం ఏమంటే ఈ యాక్షన్ కామెడీ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చాలావరకూ జరిగింది.


'సంబోస చపాతి' (Sambosa Chapathi) అనే ఈ సినిమాలో హిందీ గీతాన్ని పెట్టాలని మేకర్స్ భావించినప్పుడు వారికి ఫిల్మ్ సిటీ బెస్ట్ ఆప్షన్ గా అనిపించింది. దాంతో ఆ పాటను చిత్రీకరించే బాధ్యతను సౌగత్ భట్టాచార్య (Saugat Bhattacharya) కు అప్పగించారు. ఆయన దాదాపు రెండు వందల మంది డాన్సర్స్ తో ఈ పాటను భారీ స్థాయిలో ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈ పాట గురించి సౌగత్ చెబుతూ, 'కిదర్ కిదర్.. అంటూ సాగే ఈ పాటను పాపులర్ సింగర్ నకాష్ అజీజ్ (Nakash Aziz) పాడారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ముదస్సర్ ఖాన్ (Mudassar Khan) నృత్య రీతులు సమకూర్చారు. ఓ అరబిక్ మూవీలో ఈ స్థాయిలో బాలీవుడ్ తరహా పాట ఉండటం ఇదే మొదటిసారి. ఈ సినిమా అరబిక్ - ఇండియన్ కల్చర్ తో తెరకెక్కింది.


ఇందులో హీరోగా నటించిన అహ్మద్ షరీఫ్ (Ahmed Sharif) మాట్లాడుతూ, 'బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇన్ స్పిరేషన్ తో ఈ సినిమాలో నటించి, డాన్స్ చేశాను. మూవీకి మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది' అని అన్నారు. మొత్తానికీ అరబిక్ సినిమాల షూటింగ్ కు హైదరాబాద్ అడ్డాగా మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వరల్డ్ సినిమాలకు హైదరాబాద్ కేంద్రం కావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రోజు మరెంతో దూరంలో లేదనిపిస్తోంది.

Also Read: OG Movie: టైమ్ లేదు గంభీర.. ప్రమోషన్స్ మొదలెట్టు

Also Read: Divya Khosla: తెలుగు చిత్రసీమలోనే...

Updated Date - Aug 25 , 2025 | 05:27 PM