Anasuya counter: అనసూయకు కోపమొచ్చింది...
ABN , Publish Date - Jul 30 , 2025 | 07:51 PM
యాంకర్, నటి అనసూయ ఏ విషయం గురించి అయిన ఫిల్డర్స్ లేకుండా మాట్లాడేస్తుంది. ఇటీవల తనను సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారిపై అనసూయ ఎదురుదాడికి దిగింది.
నటి, ప్రముఖ యాంకర్ అనసూయ (Anasuya), వివాదం కవల పిల్లలు! వివాదాలు ఆమెను అనుసరిస్తాయో, ఆమె వివాదాల వెనుక వెళుతుందో తెలియదు కానీ గట్టిగా ఓ వారం పదిరోజుల పాటు సోషల్ మీడియాలో అనసూయ పేరు కనిపించకుండా ఉండదు. తాజాగా అనసూయ కొన్ని అంశాలపై తన మనసులో ఆక్రోశాన్ని వెళ్ళ గక్కినప్పుడు చాలామంది విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గురించేమో అనుకున్నారు. మరికొందరు ఇటీవల కన్నుమూసిన కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao), అనసూయ మధ్య జరిగిన వివాదానికి వివరణ ఇచ్చిందని అనుకున్నారు. కానీ ఈ రెండు అంశాలు కాకుండా అనసూయ కొత్త విషయాన్ని గురించి ప్రస్తావించింది.
ఇటీవల కొంతమంది మహిళలు... అస్సలు తనకు పరిచయం లేనివారు, తన గురించి తెలియని వారు తన వస్త్రధారణ గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అనసూయ తెలిపింది. తనకు నచ్చినట్టుగా తానుంటానని, తన దుస్తుల గురించి భర్తకు, పిల్లలకు లేని అభ్యంతరం బయటి వారికి ఎందుకుండాలని ప్రశ్నించింది. పిల్లల తల్లి అయి ఉండి ఇలాంటి దుస్తులు ధరించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారని, తల్లి అయినంత మాత్రం తన అలవాట్లను, వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని అనసూయ తెలిపింది. తనను, తన భావాలను భర్త, పిల్లలు అర్థం చేసుకుంటారని, గౌరవిస్తారని అనసూయ స్పష్టం చేసింది. ఎవరి వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడనని, అలాంటప్పుడు తన గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం వారికి ఏమిటని ప్రశ్నించింది. బోల్డ్ గా ఉంటే ఇతరులంటే గౌరవం లేదని కాదని, నచ్చిన దుస్తులు ధరించడం అంటే విలువల్ని కోల్పోవడం కాదని అనసూయ తెలిపింది. తనను ఉదాహరణగా తీసుకోమని ఎవరికి తాను చెప్పనని, ఇలానే ఉండాలనే హితబోధ కూడా చేయనని, తనకు నచ్చినట్టుగా తాను జీవిస్తానని చెప్పింది. ఇతరుల మీద దాడి చేయకుండా ఎవరి పరిధిలో వారు జీవిస్తే ప్రశాంతంగా ఉండొచ్చని, తాను అదే ప్రయత్నం చేస్తుంటానని హితవు పలికింది.
మరి అనసూయ ఆక్రోశాన్ని అర్థం చేసుకుని, ఆమె మీద మాటల దాడి చేస్తున్న మహిళలు ఇప్పటికైనా నెమ్మదిస్తారేమో చూడాలి.
Also Read: Ustaad Bhagat Singh: క్లయిమాక్స్ పూర్తి... సాంగ్ షురూ
Also Read: Sankarabharanam: కళాతపస్విని మెచ్చిన నటరత్న