Tollywood: రాజేంద్ర ప్రసాద్ బాటలో శివాజీ... సారీ చెప్పిన మనోజ్...
ABN, Publish Date - Dec 23 , 2025 | 03:02 PM
నటుడు శివాజీ సోమవారం రాత్రి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం లేపుతున్నాయి. ఆయన వైఖరిని తోటి నటీనటులు సైతం తప్పు పడుతున్నారు.
నిన్నటి వరకూ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఏదైనా ఫంక్షన్లో కనిపిస్తే... ఏ వివాదానికి తెర తీస్తాడో అని అంతా కంగారు పడుతుండేవారు. అయితే... తాను చేసిన వ్యాఖ్యలను ప్రతి సందర్భంలోనూ రాజేంద్ర ప్రసాద్ సమర్థించుకుంటూనే ఉన్నాడు. తోటి నటీనటుల మీద విమర్శనాస్త్రాలు సంధించిన రాజేంద్ర ప్రసాద్ సదరు వ్యక్తులే ఆయన వ్యాఖ్యలలో దురుద్దేశ్యం ఏమీ లేదు అనేలా చేశాడు కూడా. తాజాగా శివాజీ 'దండోరా' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరోయిన్ల బట్టల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే సినిమా రంగానికి చెందిన ఆడవారే కాదు... మగవారు సైతం శివాజీ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. మంచు మనోజ్ సైతం శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. 'ఇలాంటి ప్రకటన చాలా నిరాశకు గురిచేసింది. మహిళల డ్రస్ గురించి పోలీసింగ్ చేయడం, నైతిక బాధ్యత తీసుకోవడం ఇవాళ్టి రోజుల్లో ఆమోదయోగ్యం కాదు. ఇతరులను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తులు అనుచితంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే... భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్స్ 14, 15, 21ని ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి వాటి విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. మహిళలు ధరించే దుస్తుల విషయంలో పబ్లిక్ జడ్జిమెంట్ కు తావులేదు' అని మనోజ్ అన్నారు.
మహిళలను కించపరుస్తూ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన తరఫున తాను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు మనోజ్ తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలను మగవాళ్ళందరికీ ఆపాదించవద్దని ఆయన కోరారు. మహిళలను కించపర్చినప్పుడు మౌనం పాటించడం కరెక్ట్ కాదని, ప్రతి ఒక్కరూ స్పందించాలని మనోజ్ చెప్పారు.
అయితే... శివాజీ వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, దానిపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇవన్నీ కూడా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని అనుమానిస్తున్నవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే శివాజీ మాట్లాడిన తర్వాత కొందరు ఆయన కోప్పడతారనే తాను మంచి డ్రస్ వేసుకొచ్చానని ఓ గాయని అనడం చూస్తే... ఇవన్నీ ప్రీ స్క్రిప్టెడ్ అని కొందరు అంటున్నారు.
Also Read: Dhandoraa: శివాజీ వ్యాఖ్యలు.. రచ్చ మొదలు! రంగంలోకి చిన్మయి, అనసూయ