Avatar 3: అవతార్ 3 సినిమా.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్! వారణాసి, ఒడిస్సీ, అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్లు
ABN, Publish Date - Dec 16 , 2025 | 03:42 PM
అవతార్-3' ఆగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో పాటు కొన్ని ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్స్ ట్రైలర్స్ పలకరిస్తాయనీ ఆశిస్తున్నారు.
విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ (james Cameron) రూపొందించిన 'అవతార్ - ఫైర్ అండ్ యాష్' (Avatar 3)మూవీ డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు రాజమౌళి రూపొందిస్తోన్న 'వారణాసి' (varanasi) కొత్త ట్రైలర్ వెలుగు చూస్తుందని మొదటి నుంచి టాక్ నడుస్తోంది. 'అవతార్-3'తో పాటు నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ' ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
అసలు జేమ్స్ కేమరాన్ 'అవతార్'కు స్ఫూర్తి రామాయణం అని విశ్లేషకులు మొదటి నుంచీ చెబుతున్నారు. అన్యాయానికి గురైన వారి పక్షాన నిలచి పోరాడిన యోధుడు శ్రీరామచంద్రుడు... అదే అంశంతో 'అవతార్' తెరకెక్కిన సంగతి తెలిసిందే. పైగా 'అవతార్'లోని ప్రధాన పాత్రలు శ్రీరామచంద్రునిలాగే నీలిరంగు శరీరంతో కనిపిస్తాయి. అలా రామాయణంతో 'అవతార్'ను మొదటి నుంచీ పోలుస్తున్నారు ఇండియన్ మూవీ గోయెర్స్. శ్రీరాముని రుణం తీర్చుకుంటూ జేమ్స్ కేమరాన్ తన 'అవతార్-3'తో పాటు రణబీర్ కపూర్, సాయి పల్లవి నటించిన 'రామాయణ' ట్రైలర్ ను ప్రదర్శించనున్నారని టాక్.
భారతదేశంలో అత్యంత భారీ చిత్రంగా 'రామాయణ' తెరకెక్కుతోంది... నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణ' చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో మొదటి భాగం 2026 దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక రెండవ భాగం 2027 దీపావళికి వస్తుందని తెలుస్తోంది.. ఈ రెండు భాగాలకు కలిపి నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఇంత భారీగా రూపొందుతోన్న 'రామాయణ' చిత్రం పబ్లిసిటీ కూడా అదే స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే డిసెంబర్ 19వ తేదీన విడుదలయ్యే 'అవతార్-3'తో పాటు 'రామాయణ' న్యూ ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.
మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ..
రాజమౌళి 'వారణాసి' న్యూ ట్రైలర్ కూడా 'అవతార్-3' పాటు థియేటర్స్ లో ప్రదర్శిస్తారని విశేషంగా వినిపించింది. ప్రస్తుతం 'వారణాసి' గ్లోబ్ ట్రాటర్ నే కొత్త సినిమాలతో పాటు థియేటర్స్ లో చూపిస్తున్నారు. 'అవతార్-3'తో పాటు ఆ గ్లోబ్ ట్రాటర్ ప్రదర్శిస్తారు. 'రామాయణ' మాత్రం కొత్త ట్రైలర్ తోనే అలరించనుంది. వీటితో పాటు "అవెంజర్స్ - డూమ్స్ డే" ట్రైలర్, క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కిస్తోన్న 'ఒడిస్సీ' ట్రైలర్ ను కూడా 'అవతార్-3' ప్రదర్శితమయ్యే థియేటర్స్ అన్నిటా చూపించనున్నారు. అలా 'అవతార్-3'తో పాటు సినీ ఫ్యాన్స్ రాబోయే హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ట్రైలర్స్ చూసే వీలు కలుగుతోంది. మరి ఈ ట్రైలర్స్ ప్రేక్షకులను ఎలా కట్టిపడేస్తాయో? ఎందుకంటే 'అవతార్-3' సినిమా ప్రదర్శనా కాలం మూడు గంటల పదిహేడు నిమిషాలు ఉందట. ఈ ట్రైలర్స్ ను సినిమాకు ముందే వేస్తారో లేక మధ్యలో ప్రదర్శిస్తారో - చూడాలి.