Michael Jackson Biopic: వచ్చే యేడాది మైఖేల్ జాక్సన్ బయోపిక్

ABN , Publish Date - Jul 24 , 2025 | 06:20 PM

ఫైనల్లీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పాప్ కింగ్ జీవిత చరిత్రను బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ రానే వచ్చేసింది. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ఏదనేది మేకర్స్ ప్రకటించేశారు.

గ్లోబల్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ 'మైఖేల్' (Michael). పాప్ మహారాజు మైఖేల్ జాక్సన్ (Michael Jackson) జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించనున్న ఈ భారీ చిత్రం 2026 ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంటోయిన్ ఫుక్వా (Antoine Fuqua) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనేక విశేషాల సమహారంగా రూపొందుతూ ఆసక్తిని రేపుతోంది.‌


మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ (Jaafar Jackson ) తన మామ పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుంది. నటులు కోల్మన్ డొమింగో (Colman Domingo), నియా లాంగ్ (Nia Long) మైఖేల్ తల్లిదండ్రులు జో, కాథరిన్ జాక్సన్‌ పాత్రల్లో కనిపించబోతున్నారు. మైల్స్ టెల్లర్.. జాన్ బ్రాంకా గా, లారెంజ్ టేట్ బెర్రీ... గోర్డీగా, లారా హారియర్... సుజాన్ డి పాస్‌గా, కాట్ గ్రాహం... డయానా రాస్‌గా, జెస్సికా సులా.. టోయా జాక్సన్‌గా కనిపించబోతుండడం ఈ సినిమాకు అడ్వాంటేజ్ గా మారుతోంది.

మైఖేల్ జాక్సన్ బాల్యం నుంచి ప్రపంచ స్థాయి పాప్ సింగర్ గా ఎదిగిన ప్రయాణాన్ని 'మైఖేల్' మూవీలో చూపించబోతున్నారు. అతని సంగీతం, సాధించిన విజయాలు, పాప్ ప్రపంచంపై చూపిన ప్రభావాన్ని తెర కెక్కిస్తున్నారు. ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక బృందంతో ఈ చిత్రం అభిమానులకు, సంగీత ప్రేమికులకు మరపురాని అనుభవాన్ని అందించబోతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా రీషూట్స్, ఎడిటింగ్ కారణంగా 2026 ఏప్రిల్‌కు వాయిదా పడింది. అమెరికాలో లయన్స్‌గేట్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా (జపాన్ మినహా) యూనివర్సల్ స్టూడియోస్, జపాన్‌లో కినో ఫిల్మ్స్ ఈ సినిమాను విడుదల చేయబోతున్నాయి. 2026లో మైఖేల్ జాక్సన్ కథను పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పాప్ ప్రపంచపు రారాజు గాథను ఏ రీతిన తెర మీద ప్రెజెంట్ చేస్తారో చూడాలి.

Read Also: Mirai మిరాయ్‌.. వైబ్ ఉందిలే బేబీ సాంగ్ ప్రోమో

Read Also: Alpha: 'వార్ 2' లో 'ఆల్ఫా' బ్యూటీస్

Updated Date - Jul 24 , 2025 | 06:22 PM