Alpha: వార్ 2లో.. 'ఆల్ఫా' బ్యూటీస్

ABN , Publish Date - Jul 24 , 2025 | 06:04 PM

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! బీ టౌన్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు ఇదే ప్లాన్ అమలు చేయబోతోంది. థియేటర్లోకి వచ్చిన వారికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి పంపబోతోంది. ఇంతకీ ఏంటా సస్పెన్స్? ఏమిటా సర్ప్రైజ్? ఇది తెలుసుకోవాలని ఉందా...

war2

బాలీవుడ్ స్పై యాక్షన్ మూవీస్ లో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది వార్ -2 (War2) మూవీ. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌ (Yash Raj Films) లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Ntr), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి తెరపై సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇది ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇద్దరు సూపర్‌స్టార్ల కలయిక కారణంగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకు తగ్గట్టే ఆసక్తికరమైన వార్తలు ఈ సినిమా గురించి వినిపిస్తున్నాయి.


ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ మధ్య విడుదలైన టీజర్ అభిమానుల్లో 'వార్ 2' పట్ల హైప్‌ను రెట్టింపు చేసింది. ఇప్పుడు జూలై 26న మేకర్స్ ట్రైలర్ రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. టీజర్‌లో కనిపించిన భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎన్టీఆర్ - హృతిక్ మధ్య జరిగే హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేశాయి. దాంతో సినిమాలో స్టంట్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని టాక్. అంతేకాక ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే అనేక ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా మెల్ బర్న్ లో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆకాశంలో స్మోక్ తో ఎన్టీఆర్ 'వార్ -2' అంటూ రాసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో మేకర్స్ మరో భారీ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 'వార్ -2' సినిమా క్లైమాక్స్ తర్వాత, యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న మరో స్పై యాక్షన్ చిత్రం 'ఆల్ఫా' (Alpha) కు సంబంధించిన ఒక సీక్వెన్స్‌ను స్క్రీన్‌పై చూపించనున్నారట. అలియా, శార్వరీ 'వార్ -2' చివరిలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ ప్రేక్షకులను థియేటర్లలో కేరింతలు కొట్టించేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 'ఆల్ఫా' మూవీ రెండు వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన యువతులు స్పై ఏజెంట్లుగా చేసే హై - ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది. అంతకు ముందు, 'వార్ -2' లో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడని లేదా క్లైమాక్స్ తర్వాత ఓ సీక్వెన్స్ ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే... ఇప్పుడు 'ఆల్ఫా' సీక్వెన్స్‌తో సినిమాకు శుభం కార్డు పడుతుందని అంటున్నారు. 'వార్ -2' తర్వాత స్పై యూనివర్శ్ నుండి వచ్చేది 'ఆల్ఫా'నే అని యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సీన్స్ తో చెప్పకనే చెబుతునట్టు అవుతోంది. 'వార్ 2' చూసి థియేటర్ల నుండి బైటకు వెళ్ళే ప్రేక్షకుల మనసుల్లో 'ఆల్ఫా'ను చూడాలనే కోరిక కలిగేలా యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

Read Also: Sai Durgha Tej: మామకు దారిచ్చిన మేనల్లుడు

Read Also: Hari Hara Veera Mallu: విడుదలైన 'సలసల మరిగే' లిరికల్ సాంగ్

Updated Date - Jul 24 , 2025 | 06:52 PM