Bhadrakali Review: విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్ ‘భద్రకాళి’ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Sep 19 , 2025 | 03:32 PM
సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్ ఆంటోని. నటుడిగా సెలెక్టివ్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. హీరోగా ఇప్పటికి 25 సినిమాలు చేశారు. ఆయన నటించిన 25వ చిత్రం ‘శక్తి తిరుమగన్’. తెలుగులో ‘భద్రకాళి’ టైటిల్‌తో అనువదించారు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం
సినిమా రివ్యూ: ‘భద్రకాళి’ (డబ్బింగ్)
విడుదల తేది: 19-9-2025
సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్ ఆంటోని (Vijay Antony). సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే నటుడిగా సెలెక్టివ్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. హీరోగా ఇప్పటికి 25 సినిమాలు చేశారు. ఆయన నటించిన 25వ చిత్రం ‘శక్తి తిరుమగన్’. తెలుగులో ‘భద్రకాళి’ (Bhadrakali movie review) టైటిల్‌తో అనువదించారు. తృప్తి రవీంద్ర కథానాయిక. రియా జీతు, సునీల్ కిర్పాలాని, సెల్ మురుగన్ కీలక పాత్రధారులు. తమిళంలో ‘అరువి’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అరుణ్ ప్రభు దర్శకుడు. దర్శకుడిగా ఆయనకు మూడో సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. విజయ్ ఆంటోని గత చిత్రం మార్గాన్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మరీ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
కిట్టూ (విజయ్ ఆంటోని) సెక్రటేరియట్‌లో పవర్‌ఫుల్ బ్రోకర్. రాజకీయ నాయకులు, ఐజీ ట్రాన్స్‌ఫర్, ఎమ్మెల్యే మర్డర్ వరకూ ఎలాంటి పనైనా క్షణాల్లో పూర్తి చేయగల సామర్థ్యం ఉన్నవాడు. ఇవే కాదు.. సాధారణ జనాలకు మంచీ చేస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు. ఢిల్లీలో పెద్ద పదవిలో ఉన్న మేడమ్‌కి చెందిన 300 ఎకరాల ల్యాండ్ విషయంలో కిట్టూ కలగజేసుకోవడంతొ ఇదంతా చేస్తుంది ఎవరా అని మేడమ్‌తోపాటు దేశానికి రాష్ట్రపతి కావడమే టార్గెట్‌గా పెట్టుకున్న అభయంకర్ (సునీల్ కిర్పాలాని) కిట్టూపై నిఘా పెడతాడు. పన్నెండేళ్లుగా బ్రోకర్‌గా పని చేస్తూ ఆరు వేల కోట్టు కూడబెట్టాడని తెలుస్తుంది. ఆ కారణంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అలా తీసుకునేలా చేస్తాడు అభయంకర్. ఈ విషయాన్ని గ్రహించిన కిట్టూ ఏం చేశాడు.. అసలు అతని బ్యాగ్రౌండ్ ఏంటి? బ్రోకర్‌గా ఇంత మొత్తం ఎందుకు సంపాదించాడు. ఆ డబ్బుని ఏం చేశాడు అన్నది కథ.
విశ్లేషణ: (Bhadrakali movie review)
కిట్టూ ఓ పవర్ఫుల్ బ్రోకర్… దేశంలో ఏ పనైనా చేయగలడు అని చూపించే ఎలివేషన్లతో కథ మొదలైంది. కిట్టూ చేసే ప్రతి పని ఆసక్తిగా కథను ముందుకు తీసుకెళ్లింది. కథ ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుంది. అనేది ప్రేక్షకుడి ఊహకు అందకుండా దర్శకుడు రన్ చేశాడు. స్టోరీ రన్ ఎత్తులు పైఎత్తులు, ఇంటెలిజెన్స్ ఆకట్టుకున్నాయి. కిట్టును పోలీసులు అదుపులోకి తీసుకునే వరకూ కూడా కథ అత్యంత వేగంగా కథ నడుస్తుంది. బ్రోకర్ గా ఉన్నా ఎంతోమందికి మంచి చేస్తూ అతని టార్గెట్ ఏంటో చెప్పకుండా ఆసక్తికరంగా నడిపించారు. అక్కడి దాకా పెద్దగా పేరు పెట్టక్కర్లేదు. ఇంటర్వెల్ నుంచి కథ ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. సెకండాఫ్లో అతని బాల్యం, బ్రోకర్ గా మారడానికి కారణాలు చూపించారు. కిట్టు వర్సెస్ అభయంకర్ గేమ్ మొదలు అయ్యాక కథ అంతా రెగ్యులర్ ఫార్మెట్లోకి వెళ్లిపోతుంది. ఫస్టాఫ్ లో హీరో చూపించిన ఇంటెలిజెన్స్ సెకెండాఫ్ లో లేదు. ఇన్వెస్టిగేషన్, అభయంకర్ ఆట కట్టించడానికి హీరో వేసిన ప్లాన్స్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. వాట్ నెక్ట్స్ అనేది క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది. కథలో హీరో ఆశయం చాలా పెద్దది. అయితే అది నెరవేరడం ఇప్పుడున్న పొలిటికల్ వ్యవస్థలో సాధ్యం కాదు. అయితే వాటిని జనాలకు అర్ధమయ్యేలా చెప్పినా సరిపోయేది. అలా చెప్పే ప్రయత్నం చేస్తూ తీసిన సన్నివేశాలు పేలవంగా ఉండి... సెకెండాఫ్ అంతా క్లాస్ పీకిన భావన కలుగుతుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరుకు వస్తే.. నటుడిగా విజయ్ ఆంటోని కథల ఎంపిక బావుంటుంది. కథకు తగ్గట్టు అతని పాత్ర తీరు కూడా అలరిస్తుంది. ఈ సినిమాలో కిట్టూ పాత్ర కూడా అలాగే ఉంది. పాత్ర పరిధి మేరకు చక్కగా నటించాడు. హ్యాండ్సమ్ గా ఉన్నాడు. హీరోయిన్ తృప్తి రవీంద్రది చిన్న పాత్రే. కిట్టూకి భార్యగా చక్కని నటన కనబర్చింది. రాష్ట్రపతి కావాలని కొన్నేళ్లగా తపన పడుతున్న వ్యక్తిగా, రాజకీయ నేతల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ప్లాన్స్ ఇచ్చి గవర్నమెంట్ను శాసించే వ్యక్తిగా సునీల్ కిర్పాలనీ ఇందులో కనిపించారు. ఆ పాత్రకు ఆయన న్యాయం చేశాడు. స్పెషల్ ఆఫీసర్ రామ్ పాండేగా కిరణ్ నటన బావుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంత బావున్నాయి. రియా జీతూ కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్ లో కనిపించి మెప్పించారు. హీరోకి సపోర్టివ్ రోల్లో మారుతిగా సెల్ మురుగన్ అలరించారు. సినిమాటోగ్రఫీ బావుంది. విజయ్ ఆంటోని సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. నేపథ్య సంగీతం ముందుకు తీసుకెళ్లింది. నిర్మాణ పరంగానూ బావుంది. సెకెండాఫ్లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది.
సినిమా అంటే వినోదం మాత్రమే కాదు.. సామాజిక బాధ్యత, సొసైటీకి ఏదో మంచి చెప్పాలని ఆలోచించే దర్శకులు కొంతమంది ఉంటారు. ఈ సినిమా చూశాక దర్శకుడు అరుణ్ ప్రభు కోవకు చెందినవారే అనిపిస్తుంది. ఆయన ఎంచుకున్న కథలో రాజకీయాలు, నల్లధనం, అవినీతిపై ప్రశ్నలు సంధించడం వంటివి ఉన్నాయి. ఈ తరహా కథాంశంతో ఇప్పటికే. ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ వంటి సినిమాలు వచ్చాయి. అయితే శంకర్ తీసిన సినిమాల్లో సమస్యతోపాటు వాటికి పరిష్కారం కూడా చూపించారు. ఇందులో ప్రశ్నలు మాత్రమే సంధించారు దర్శకుడు అరుణ్ ప్రభు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కానీ వాటికి పరిష్కార మార్గం కూడా చూపించి ఉంటే రిజల్ట్ ఇంకా బావుండేది. సినిమా ముగింపు తేలిపోయింది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, కేంద్రం మీద కూడా పంచ్లు బాగానే వేశారు. పొటిలికల్ థ్రిల్లర్ కథలు ఇష్టపడేవారు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కొంత వరకూ సంతృప్తి చెందుతారు. రెగ్యులర్ సినీ గోయర్స్ ను మాత్రం ఆకట్టుకోవడం కష్టమే!
ట్యాగ్ లైన్: రెగ్యులర్ పొలిటికల్ డ్రామా…
రేటింగ్: 2.25/5