Su From So : సు ఫ్రమ్ సో రివ్యూ..
ABN , Publish Date - Aug 09 , 2025 | 10:28 PM
కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న 'సు ఫ్రమ్ సో' సినిమా తాజాగా తెలుగులోనూ విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగువారి ముందుకు తీసుకొచ్చిన ఈ వినోద ప్రధాన చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
ఇటీవల కన్నడలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమా ‘సు ఫ్రమ్ సో’ (Su From So) (సులోచన ఫ్రమ్ సోమేశ్వరం’). అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా సంచలన విజయం సాధించటంతో ఇప్పుడు ఈ మూవీని అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మైత్రీ మూవీస్ (Mythri movies) ద్వారా విడుదలైన ఈ సినిమా 8వ తేదీన ఆడియన్స్ ముందుకు వచ్చింది. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి తెలుగునాట ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం…
కథ విషయానికి వస్తే… కర్ణాటకలోని ఓ చిన్న పల్లెటూరు మర్లూర్. అక్కడ ఏ సమస్య వచ్చినా రవన్న (షానీల్ గౌతమ్, Shaneel Gautham) పెద్దరికం వహించి దానిని తీర్చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆ ఊరిలోని ఓ యువకుడు అశోక్ (జెపీ తుమినాడు, J. P. Thuminad)కి దెయ్యం పట్టిందని ప్రచారం జరుగుతుంది. తమ ఊరికి దగ్గరలో ఉన్న ఊరుకి చెందిన సులోచన అనే ఆవిడ ఆత్మనే అశోక్ ని ఆవహించిందనే తేల్చేస్తాడు రవన్న. దాంతో ఆ ఆత్మను శాంతింపచేసి వదిలించుకోవడానికి ఓ స్వామిజీ (రాజ్ బి శెట్టి Raj B. Shetty)ని తీసుకు వస్తాడు రవన్న. ఆ ఆత్మని వదల గొట్టే క్రమంలో ఆ ఊరి వారు పడే పాట్లే ఈ ‘సు ఫ్రమ్ సో’ సినిమా.
కథగా చూస్తే ఏమంత ఆసక్తి అనిపించదు. కానీ ఈ ఆసక్తి లేని పాయింట్ తో రెండు గంటలా పది నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించిన తీరుని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. అసలు ఆ గ్రామానికి రవన్న పెద్దరికం ఎందుకు!? వయసు వచ్చినా రవన్న బ్రహ్మచారిగానే ఎందుకు మిగిలిపోతాడు. ఆ మారుమూల గ్రామంలోని ఆచార వ్యవహారాలను కొందరు ఎలా తమకు అనుగుణంగా మలచుకుంటున్నారు? అసలు సులోచన ఎవరు? సులోచనకు భాను (సంధ్యా అరాకెరే, Sandhya Arakere) మధ్య సంబంధం ఏమిటి? అశోక్ కు నిజంగానే దెయ్యం పట్టిందా? అది ఎలా వదిలింది? వీటన్నింటినీ కలుపుతూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ దర్శకుడు సినిమాను తీసిన విధానమే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
గ్రామీణ ప్రజలలోని అమాయకత్వం, నిజాయితీ, వేడుకల్లో వారి ప్రవర్తన, యువతలో ఉండే ఆకర్షణతో పాటు ఆ వయసులో చేయరాని తప్పు చేస్తే దానిని కప్పిపుచ్చుకోవడానికి దెయ్యం పట్టిందనే నాటకానికి తెరతీయటం, దాని పర్యవసానంతో ప్రథమార్ధం సరదాగా గడిచిపోతుంది. దెయ్యం లేదని చూసే ప్రేక్షకులకు తెలిసినా అమాయకమైన ప్రజలు పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. నిజానికి ఈ సినిమాలో నటించిన ఏ నటీనటులు మనకు పరిచయం అయిన వారు కాదు. పూర్తిగా కొత్త. అయినా ఆ భావం కలగదు. హీరోగా నటించిన అశోక్ పాత్రధారి జేపీ తుమినాడ్ ఈ సినిమాకు దర్శకుడు. తనతో పాటు రవన్నగా యాక్ట్ చేసిన వ్యక్తితో పాటు డ్రింకర్ గా నటించిన పాత్రధారి ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు. ఇక ఈ డ్రింకర్ పాత్రధారి ఎంటర్ అయినప్పుడల్లా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే 'బావ వచ్చాడు… బావ వచ్చాడు' అనే పాట ఎంటర్ టైన్ చేస్తుంది. ద్వితీయార్ధంలో అక్కడక్కడా కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపించినా… చివరలో భాను పాత్రకు, రవన్న పాత్రకు మధ్య లింక్ పెట్టి ముగించిన తీరు అందరినీ మెప్పిస్తుంది.
మన సొసైటీలో ఒంటరి మహిళలకు ఎదురయ్యే సమస్యలను దెయ్యం లేకుండా దెయ్యం ఉందని భ్రమింపచేస్తూ వినోదభరితంగా చూపించిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల నుంచి బాగుంది అని తప్ప.. బాగాలేదు అనే మాట వినం. సుమేద్ కె. స్వరాలు, సందీప్ తులసి దాస్ బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాను ఎలివేట్ చేసింది. తెలుగులో సినిమాకు ఎలాంటి ప్రచారం లేకుండా విడుదల చేయటం… తెలిసిన ఫేస్ ఏదీ లేకపోవడం ఒక్కటే ఈ సినిమాకు ఉన్న పెద్ద మైనస్. అయితే మౌత్ టాక్ ఊపందుకుంటే మాత్రం తెలుగులో కూడా మంచి వసూళ్ళను సాధించే అవకాశం లేకపోలేదు.
ట్యాగ్ లైన్: దెయ్యం లేని దెయ్యం సినిమా
రేటింగ్: 3/5