Arabia kadali Review: సత్య దేవ్ నటించిన 'అరేబియా కడలి' సిరీస్ అలరించిందా..
ABN , Publish Date - Aug 08 , 2025 | 08:29 PM
సత్యదేవ్ ఓ విలక్షణ నటుడు. అతను ఎంచుకునే కథలు, పాత్రలు విభిన్నంగా ఉంటాయి. తాజాగా ఆయన 'అరేబియా కడలి’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. క్రిష్ సూపర్‌విజన్‌లో వీవీ సూర్యనారాయణ దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్ శుక్రవారం నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ రివ్యూ: 'అరేబియా కడలి' (Arabia kadali web series Review)
స్ట్రీమింగ్ ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
స్ట్రీమింగ్ డేట్: 8–8–2025
నటీనటులు: సత్యదేవ్ (Satya Dev), ఆనంది(Anandi), నాజర్, రవివర్మ, పూనమ్ బజ్వా, అమిత్ తివారీ, దలీప్ తాహిల్, రఘు బాబు, అలోక్ జైన్, ప్రత్యూష, హర్ష రోషన్, వంశి కృష్ణ, కోట జయరాం తదితరులు
సాంకేతిక నిపుణులు:
రచన: క్రిష్, చింతకింది శ్రీనివాసరావు, సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి, సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్, ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు, నిర్మాతలు: వై రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు, క్రియేటర్: క్రిష్ జాగర్లమూడి (Krish)
దర్శకత్వం: వీవీ సూర్య కుమార్ (VV Surya kumar)
సత్యదేవ్ విలక్షణ నటుడు. అతను ఎంచుకునే కథలు, పాత్రలు విభిన్నంగా ఉంటాయి. హీరోగానే కాకుండా, సపోర్టింగ్ రోల్స్, విలన్ ఇలా పాత్ర ఏదైనా వంద శాతం ఎఫర్ట్ పెడతారు. తాజాగా ఆయన 'అరేబియా కడలి’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. క్రిష్ సూపర్‌విజన్‌లో వీవీ సూర్య కుమార్ దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మత్య్సకారులు జీవన విధానం, కష్టాల నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్నది చూద్దాం.
కథ: (Arabia kadali web series Review)
ఆంధ్రప్రదేశ్‌లోని చేపల వాడకు చెందిన నురగల బదిరి (సత్యదేవ్) మత్స్యకార కుటుంబానికి చెందిన వాడు. కుల వృత్తి అయిన చేపలు వేటకు వెళ్తుంటాడు. అలాగే పక్క గ్రామం మత్స్యవాడకు చెందిన గంగతో (ఆనంది) ప్రేమలో పడతాడు. కడలి ఒడ్డున వారి జీవితాలు సాగాలంటే ఇతర ప్రాంతాలకు చేపల వేటకు వెళ్లాల్సిందే! అలా గుజరాత్‌కు వెళ్లిన బదిరి బృందం సముద్రంలో ఎదురైన పరిస్థితుల దృష్ట్యా నిబంధనలను ఉల్లంఘించి పాకిస్థాన్ బోర్డర్‌లోకి వెళ్లి అక్కడ పోలీసులకు దొరికిపోతారు. తనకు సంబంధించిన వారంతా పాకిస్తాన్‌లో చిక్కుకుపోయారని తెలుసుకున్న గంగ ప్రియుడితోపాటు ఆ ఇరు గ్రామాల వారిని విడిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అసలు విశాఖ తీరాన్ని వదిలి ఆ జనాలు గుజరాత్ వెళ్లి చేపల వేటకు ఎందుకు వెళ్లారు? పాకిస్థాన్‌లో చిక్కుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వారు తిరిగి వెనక్కి ఎలా వచ్చారు? బదిరి, గంగ ప్రేమకథ సుఖాంతం అయిందా? అన్నది కథ.
విశ్లేషణ:
శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారులు బోర్డర్ దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లడం నేపథ్యంలో ఇటీవల 'తండేల్' చిత్రం వచ్చింది. 'అరేబియా కడలి' కూడా ఆ తరహా కథే. అయితే అది ఫీచర్ సినిమా కావడంతో నిడివికి తగ్గట్టు చూపించారు. ఇక్కడ ఓటీటీ సిరీస్ కావడంతో కథను విపులంగా చెప్పడానికి ఆస్కారం దొరికింది. ఆ సినిమాలో చూపించని భావోద్వేగాలు, డ్రామా, ప్రేమ ఇందులో కాస్త ఎక్కువ మోతాదు చూపించారు. దేశవ్యాప్తంగా మత్స్య కారుల జీవనోపాధి, పొట్ట గడవడానికి వారు పడే కష్టాలు, ఎదురయ్యే అవమానాలు, బడా వ్యాపారస్తుల కింద నలిగిపోవడం ఇవన్నీ హృద్యంగా చూపించారు. క్రిష్ సూపర్‌విజన్‌లో సూర్య కుమార్ ఈ కథను సహజంగా నడిపించారు. మత్య్సకారులను విడిపించే క్రమంలో ఇరుదేశాల అఫీషియల్స్ మధ్య నడిచిన డ్రామా కూడా ఆకట్టుకునేలా ఉంది. దేశం, రాష్ట్రం ఏదైనా కానీ మత్స్యకారుల ఉపాధికి అడ్డుగా మారుతున్న నిబంధనలు, సౌకర్యాలు ఆలోచింపజేస్తాయి. ఓ ఇంటర్వ్యూలో క్రిష్ చెప్పినట్లు సముద్రంలో తిరిగే జలచరాలకు లేని హద్దులు, వాటి మీద బతికే మనుషులకు ఎందుకు నిబంధనలు ఉండాలి అన్న ప్రశ్న మదిలో మెదులుతుంది. ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది. కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్‌ఫార్మన్స్ ప్రతి విషయంలో మేకర్స్ జాగ్రత్త తీసుకున్నారు. సోషల్ మీడియాతో చెడు ఎంత ఉందో మంచి కూడా ఉందని చూపించారు. కడలి మీద బతికేవారి కష్టాలను దేశం మొత్తం తెలిసి ప్రభుత్వమే తిరిగి వచ్చేలా చేయడానికి ఇందులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. క్లైమాక్స్‌లో కథ టర్న్ అవ్వడానికి సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన ఓ వీడియో అనే చూపించారు.
నటీనటుల పనితీరు.. ఈ సిరీస్ తొలి సక్సెస్ ఆర్టిస్ట్‌ల ఎంపిక. సత్యదేవ్, ఆనంది నుంచి పాకిస్థాన్ ఆఫీసర్స్ వరకూ అందరూ పాత్రల్లో ఇమిడిపోయారు. బదిరి పాత్రలో సత్యదేవ్ సహజంగా నటించారు అనడం కంటే ఆ పాత్రకు వంద శాతం యాప్ట్ అయ్యారు అనొచ్చు. నటన పరంగానే కాకుండా అతని వాయిస్ కూడా చాలా సన్నివేశాల్లో ఎలివేషన్ ఇచ్చింది. ఆనందికి ఈ మధ్యకాలలో దక్కిన మంచి పాత్ర ఇది. ఓ రకంగా చెప్పాలంటే పవర్‌ఫుల్ పాత్రే. నాజర్, రవివర్మ, పూనమ్ బజ్వా, అమిత్ తివారీ, దలీప్ తాహిల్ పాత్రలు హుందాగా ఉన్నాయి. రఘు బాబు, అలోక్ జైన్, ప్రత్యూష తదితర ఆర్టిస్ట్‌లు అందరూ పాత్రలకు నాయ్యం చేశారు. నటన పరంగా ఎవరికీ వంక పెట్టేలా లేదు. చక్కని నటన రాబట్టుకున్న క్రెడిట్ దర్శకుడికే దక్కుతుంది. ఇక కెమెరా వర్క్ పరంగా సమీర్ రెడ్డి కూడా చక్కని పనితీరు కనబర్చారు. చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ బావుంది. కానీ పాకిస్థాన్ సన్నివేశాలు, వేట నేపథ్యంలో సాగే సన్నివేశాలకు కొన్నింటిని కట్ చేయవచ్చు. 2, 5, 7 ఎపిసోడ్స్‌లో కాస్త ల్యాగ్ అనిపించేలా ఉన్నాయి. దర్శకుడికిది తొలి వెబ్ సీరిస్. చిన్నచిన్న పొరపాట్లు ఉన్నా అతను చెప్పాలనుకున్న ఎమోషన్‌ని వంద శాతం చెప్పగలిగాడు. క్రిష్ సూపర్‌విజన్ కూడా ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. భావోద్వేగ సన్నివేశాలను పండించడంతో క్రిష్ దిట్ట. ఇందులో ఆయన మార్క్ స్పష్టంగా కనిపించింది. కొన్ని ఎపిసోడ్స్‌తోపాటు ఆయన తాలుక రాత–తీత కనిపించింది. 'తండేల్' రూపంలో ఈ కథను చూసినా ఈ కథలో ఇంకాస్త డెప్ట్ ఉంది. దర్శకుడు ప్రతి సీన్‌ను విపులంగా చెప్పాడు – చూపించాడు. విద్యాసాగర్ సంగీతం సిరీస్‌కు ఎసెట్. నిర్మాతలు వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబా ఎప్పటిలాగే ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. విజువల్‌గా సినిమా గ్రాండ్‌గా ఉంది. అయితే అక్కడక్కడా సాంకేతికంగా చిన్న చిన్న లోపాలున్నాయి. విశాలమైన కడలిని చూపించే విషయంలో ఎక్కడో వీఎఫ్‌ఎక్స్ కాస్త వీక్‌గా అనిపించింది. లాంగ్ షాట్స్ బాగానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్‌లంటే పద్దతి, పాడు, హద్దులు లేకుండా ఉంటున్నాయి. కానీ ఇందులో ఎక్కడా కూడా అసభ్యత, అశ్లీలతకు చోటే లేదు. ఓటీటీలో స్వచ్ఛంగా తెరకెక్కిన నిజాయతి ఉన్న తెలుగు కథ ఇది. మత్య్సకారుల కష్టాలు, ప్రేమ, భావోద్వేగాలు, దేశభక్తి... సమాహారమే ఈ సిరీస్. భారీ అంచనాలు పెట్టుకోకుండా కూల్‌గా చూడొచ్చు.
ట్యాగ్‌లైన్: కడలి కష్టాలు.. భావోద్వేగాలు..
రేటింగ్: 2.75/5