Mithra Mandali Review: 'మిత్ర మండలి'.. సినిమా రివ్యూ! నవ్వించిందా
ABN, Publish Date - Oct 16 , 2025 | 10:51 AM
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ తెరకెక్కిన 'మిత్ర మండలి' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం
సినిమా రివ్యూ: మిత్ర మండలి (Mithra Mandali Review)
విడుదల తేది: 16-10-2025
‘మిత్ర మండలి’… ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన పేరు ఇది. ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్లో కామెడీకి కేరాఫ్ అయిన ప్రియదర్శి(Priya Darshi), విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరాకు ఇన్స్టా సెన్సేషన్ నిహారిక.ఎన్.ఎమ్ తోడు కావడంతో ఈ సినిమాపై బజ్ పెరిగింది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కె.వి.అనుదీప్ స్నేహితుడు విజయేందర్ దర్శకుడు కావడం, నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డికి బన్నీ వాసు తోడుగా నిలవడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. రిలీజ్ కు ముందు చేసిన ప్రచారం కూడా కలసి వచ్చింది. మరి నిర్మాత చెప్పినట్లు ఈ సినిమా అందరినీ కడుపుబ్బ నవ్విస్తుందో… లేదో… చూద్దాం…
కథ: (Mithra Mandali Story)
జంగ్లీ పట్టణంలో తుట్టె కులం పులిబిడ్డ గా గుర్తింపు పొందిన వ్యక్తి నారాయణ (వీటీ గణేశ్). ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న తమ కులస్తులే అన్నింటిలో పై చేయి గా ఉండాలని కోరుకుంటుంటాడు. ఆఖరికి కులాంతర వివాహాలకు కూడా ఇష్టపడడు. తన కుల బలంతో నారాయణ ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. అయితే నారాయణ కూతురు స్వేఛ్ఛ (నిహారిక) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయలకు తెలిస్తే కులం పరువు పోతుందని, ఎమ్మెల్యే టికెట్ రాదని ఆమె కిడ్నాప్ అయ్యిందంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. అవారాగా తిరిగే మన మిత్రమండలి.. చైతన్య (ప్రియదర్శి), సాత్విక్(విష్ణు ఓ.ఐ), అభి (రామ్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహరా) వద్ద స్వేచ్ఛ ఉందని తెలుస్తుంది. అసలు స్వేచ్ఛ దేనికోసం ఇంటి నుంచి పారిపోయింది. ఆమె కారణంగా ఆ నలుగురు కుర్రాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఫైనల్ గా తుట్టెకులం ముద్దు బిడ్డ నారాయణ ఎమ్మెల్యే అయ్యాడా? లేదా? అన్నదే కథ.
విశ్లేషణ: (Mithra Mandali review)
‘జాతిరత్నాలు’కు ముందు ఆ తర్వాత కూడా ముగ్గురు లేదా నలుగురు స్నేహితుల కథతో చాలా సినిమాలొచ్చాయి. అందులో కొన్నిస్నేహం మీద, మరి కొన్ని భావోద్వేగాలతో వచ్చాయి. వాటిలో కొన్ని చిత్రాలు స్నేహితుల అల్లరి, సరదా పనులతో నవ్వులు పూయించాయి. అయితే మిత్రమండలి ఏ కేటగిరికీ చెందని సినిమా. ‘ఇదో కథ లేని కథ అని వాయిస్ ఓవర్లో ఓపెన్ గానే చెప్పేశారు. అయితే చిత్ర బృందం చెప్పినట్లు ‘పొట్ట చెక్కలయ్యే నవ్వులు, థియేటర్లో కూర్చున్న నిమిషం నుంచి నవ్వుతూనే ఉంటారు’ అనే మాటల్లో ఏ మాత్రం నిజం లేదు. కల్పితమైన తుట్టె కులం, కులాన్ని మోసే పాత్రలు, దాని నుంచి పుట్టే కామెడీ ఇవన్నీ ఆడియన్స్ కి తలనొప్పి తెప్పించేలా సాగాయి. అయితే ప్రథమార్ధం కంటే కొంచెం ద్వితీయార్ధం కొద్దిగా బెటర్. ఫస్ట్ హాప్ ఎడమచేయి అనుకుంటే సెకండ్ హాప్ కుడి చేయి అంతే. బోలెడు మంది నటీనటులు తెరపై కనిపించినా కథనం ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోవడంతో వారి నటన బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలింది. మూడు, నాలుగు చోట్లు నవ్వించగలిగినా ఎక్కువ భాగం తల పట్టుకునేలానే ఉంటుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే…
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా... ఎవరి స్థాయిలో వారు మంచి నటులే... అది పలు చిత్రాలతో నిరూపితం అయింది కూడా. ఈ చిత్రంలో వారి పాత్రల పోషణ చూస్తే జాలి కలగక మానదు. సత్య తనదైన టైమింగ్ తో చేసిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ అక్కడక్కడ పండింది. వెన్నెల కిషోర్ పాత్ర గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎవరినీ దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేదనిపించింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయిన వీటీ గణేశ్ పాత్ర చిరాకు పుట్టిస్తుంది. ఇన్స్టా రీల్స్, సెలబ్రిటీ ప్రమోషన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఎన్ఎం ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ తో పోలిస్తే ఈ సినిమా వల్ల ఆమెకు ఒరిగిందేమీ లేదు. ఈ సినిమాకు తనే పెద్ద మైనస్ అని చెప్పాలి. బ్రహ్మానందం ఓ పాటలో మెరుస్తారు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నా మిగిలిన వేవీ ఆకట్టుకునేలా లేక పోవడం తో అది కూడా హైలైట్ కాదు.
ఎంత మంచి ఆర్టిస్ట్లు ఉన్నా.. వారి బలాబలాలను గమనించి కథ, కథనాలు నడపకపోతే దర్శకుడు బొక్కబోర్లా పడటం ఖాయం. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ప్రతి దర్శకుడు అనుదీప్ ‘జాతిరత్నాలు’ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు చుట్టేస్తున్నారు. ఆ సినిమాకు నవీన్ పోలిశెట్టి ఉండటమే పెద్ద ప్లస్ అని ఎవరూ గుర్తించటం లేదు. ఆ తర్వాత వచ్చిన అనుదీప్ సినిమాలు ఎందుకు ఆకట్టుకోలేక పోయాయో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అందుకే దర్శకుడు విజయేందర్ గురించి ఎంత తక్కువ ప్రస్తావిస్తే అంత మంచిది.సినిమాలో ప్రియదర్శి రెండు నిమిషాల పాటు ఆపకుండా డైలాగ్ చెబుతుంటే ఓ పాత్ర ‘ఏంటిది’ అని అడుగుతుంది. వెంటనే కమెడియన్ సత్య ‘సోది.. వాళ్లేమో సోది నా కొడుకులు ’ అంటాడు. ఈ డైలాగ్ రెండుగంటల సినిమాకీ వర్తిస్తుంది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉన్న బన్నీ వాసు తాజాగా జరిగిన ఈవెంట్లో తనను, తన సినిమాను తొక్కేయడానికి కొందరు నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని, అలా చేసిన వారెవరూ తన వెంట్రుక కూడా పీకలేరని కామెంట్ చేశారు. అయితే ఈ చిత్రం చూశాక.. అంతగా రియాక్ట్ కావలసిన అవసరం లేదేమో అనిపించింది. నిజానికి ఈ సినిమా చూసిన తర్వాత బన్నీ వాసు సినిమా ఆరంభం నుంచి కాకుండా పూర్తి అయిన తర్వాత టేకప్ చేసి రిపేర్లు చేసి రిలీజ్ చేశాడేమో అన్న డౌట్ కలగక మానదు. ఏది ఏమైనా పుల్ గా నవ్వుకోవచ్చు అనే ఆశతో సినిమాకు వెళితే మాత్రం నిరాశ పడక తప్పదు.
ట్యాగ్ లైన్: ‘తుట్టె మండలి’
రేటింగ్: 2/5