Kanya Kumari: కన్యాకుమారి మూవీ రివ్యూ
ABN, Publish Date - Aug 27 , 2025 | 05:07 PM
గతంలో 'పుష్పక విమానం' సినిమాను రూపొందించిన సృజన్ అట్టాడ తెరకెక్కించిన మూవీ 'కన్యాకుమారి'. ఈ చిత్రానికి మధుశాలిని సమర్పకురాలిగా వ్యవహరించింది.
నాలుగేళ్ళ క్రితం ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) తో 'పుష్పక విమానం' (Pushpaka Vimanam) సినిమాను తెరకెక్కించిన సృజన్ అట్టాడ (Srujan Attada) ఇప్పుడు తనే నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో 'కన్యా కుమారి' (Kanaya Kumari) సినిమా తీశాడు. చిత్రం ఏమంటే... 'పుష్పక విమానం', 'కన్యాకుమారి' రెండూ కూడా రిపీట్ టైటిల్సే. 'పుష్పక విమానం'లో ప్రధాన పాత్రను పోషించిన గీత్ సైని (Geeth Saini)... ఇప్పుడీ 'కన్యాకుమారి'లో టైటిల్ రోల్ ప్లే చేసింది. ఈ మూవీ చూసిన నటి మధుశాలిని (Madhu Salini) సమర్పకురాలిగా వ్యవహరించడానికి ముందుకొచ్చింది. అలానే సినిమా నచ్చడంతో థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలను ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) భుజానికెత్తుకున్నాడు. మరి వీరికి నచ్చిన 'కన్యాకుమారి' ఎలా ఉందో చూద్దాం...
భిన్నమైన జీవిత లక్ష్యాలు ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేదే 'కన్యాకుమారి' చిత్రం. శ్రీకాకుళం జిల్లాలోని ఓ పల్లెటూరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు తిరుపతి (శ్రీచరణ్ రాచకొండ Sricharan Rachakonda). ఆపక్క ఊరిలో ఉండే కన్యాకుమారి (గీత్ సైని) డిగ్రీ చదివి, సేల్స్ గర్ల్ గా పనిచేస్తూ ఉంటుంది. కన్యాకుమారి, తిరుపతి ఒకే స్కూల్లో చదువుకుంటారు. అప్పటి నుంచే కన్యాకుమారి అంటే తిరుపతికి ఇష్టం. ఏడో తరగతిలోనే చదువు ఆపేసి... తనకిష్టమైన వ్యవసాయంలో దిగిపోతాడు తిరుపతి. ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకని ఇంట్లో వాళ్ళు కట్టడి చేయడంతో డిగ్రీతో చదువు ఆపేస్తుంది కన్యాకుమారి. బాగా చదువుకున్న వాడిని పెళ్ళి చేసుకుని, సిటీకి వెళ్ళిపోయి, అక్కడ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలని కన్యాకుమారి కలలుకంటూ ఉంటుంది.
రైతు అనే కారణంగా తిరుపతికి పెళ్ళి సంబంధాలు రావు. ఆ సమయంలో అతని మనసు కన్యాకుమారి వైపు మళ్ళుతుంది. ఆమెను ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. చదువుకున్న వాడిని పెళ్ళాడాలనుకున్న కన్యాకుమారి... తిరుపతి ప్రేమను అంగీకరించిందా? రైతుగా సొంత ఊరిలోనే ఉండాలనుకున్న తిరుపతి ప్రేమ కోసం తన ఆశయాన్ని పక్కన పెట్టేశాడా? రెండు భిన్న ధృవాల్లాంటి వీరిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది మిగతా కథ.
కళింగాంధ్ర నేపథ్యంలో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఆ మధ్య వచ్చిన వెన్నెల కిశోర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అందులో ఒకటి. మళ్లీ ఇప్పుడీ 'కన్యాకుమారి' వచ్చింది. రైతుల కష్టాలు కడగళ్ల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఇది ఆ తరహా రైతు కథ కాదు. లాభసాటి వ్యవసాయం చేస్తున్నా... రైతు అనే కారణంగా పెళ్ళి కాని ఓ కుర్రాడి కథ. అలానే మధ్యతరగతి కుటుంబాలలో నిరాదరణకు గురయ్యే ఓ అమ్మాయి వ్యథ. ఈ సీరియస్ విషయాలను సరళంగా, వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సృజన్ అట్టాడ. పల్లెటూరి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో వచ్చిన అందమైన ప్రేమకథా చిత్రం ఇదని చెప్పొచ్చు. సన్నివేశాలు, సంభాషణలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ చాలా నేచురల్ గా ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు 'యాన్ ఆర్గానిక్ ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. సినిమా మొదలైన దగ్గర నుండి సున్నితమైన హాస్యంతో సాగిపోయింది. అయితే చిన్న చిన్న లోపాలు లేకపోలేదు. ఇందులో హీరో స్నేహితుడికి నత్తి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వైకల్యం కథకు ఉపయోగపడేది అయితే అది వేరే విషయం. అలానే పతాక సన్నివేశానికి ముందు హీరో-హీరోయిన్లు నాలుగేళ్ళ పాటు అసలు టచ్ లోనే లేరన్నట్టు చెప్పడం దర్శకుడు తీసుకున్న క్రియేటివ్ ఫ్రీడమ్ అనుకోవాల్సి ఉంటుంది. ద్వితీయార్థం విషయంలో ఇంకాస్తంత జాగ్రత్త తీసుకుని ఉంటే మరింత మంచి ఫలితం వచ్చి ఉండేది. మూవీ ప్రీ క్లయిమాక్స్ ట్విస్ట్ బాగుంది.
హీరో శ్రీచరణ్ రాచకొండకు ఇదే మొదటి సినిమా. చాలా సహజంగా నటించాడు. టైటిల్ రోల్ ప్లే చేసిన గీత్ సైనీ గడుసమ్మాయిగా అదరగొట్టేసింది. 'కన్యాకుమారి' పాత్రకు నూరు శాతం న్యాయం చేసింది. మురళీధర్ గౌడ్, ప్రభావతి, భద్రం కాస్తంత తెలిసి నటీనటులు. ఇతర పాత్రలు చేసిన వారంతా సహజ నటన ప్రదర్శించారు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ నేపథ్యంలో ఏదో ఒక పాట రన్ అవుతూనే ఉంది. దాంతో సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. అందుకు సంగీతం అందించిన రవి నిడమర్తిని అభినందించాలి. అలానే సినిమాకు మెయిన్ ఎసెట్ శివ గాజుల, హరిచరణ్ ఫోటోగ్రఫీ. పల్లెటూరి అందాలను చక్కగా వారు కాప్చర్ చేశారు. అయితే తారాబలం లేని... ఇలాంటి సింపుల్ లవ్ స్టోరీలను చూడటానికి జనాలు థియేటర్లకు పనిగట్టుకు రావడం తగ్గిపోయింది. ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అనే భావనకు జనాలు వచ్చేశారు. సో... 'కన్యాకుమారి'కి థియేట్రికల్ రన్ కష్టమే!
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: టైటిల్ ఓల్డ్... లవ్ స్టోరీ క్యూట్!
Also Read: Sundarakanda Review: నారా రోహిత్ 'సుందరకాండ' మెప్పించిందా