Andela Ravamidhi Review: అందెల రవమిది.. సినిమా రివ్యూ
ABN, Publish Date - Oct 11 , 2025 | 02:24 PM
ఇంద్రాణి దావులూరి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం 'అందెల రవమిది'. భరణి, జయలలిత, ఐడీపీఎల్ నిర్మల, ఆదిత్య మీనన్ నటించిన ఈ సినిమా శనివారం విడుదలైంది.
గతంలో యామిని శర్మ (Yamini Sharma) పేరుతో కొన్ని పరభాషా చిత్రాలలో నటించిన ఇంద్రాణి దావులూరి (Indrani Daavuluri) వివాహానంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే భారతీయ నృత్య శిక్షణాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'అందెల రవమిది' (Andela Ravamidi). పేరుకు భిన్నంగా ఎలాంటి సడి చేయకుండా నిశ్శబ్దంగా ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది.
నృత్యప్రధానమైన 'అందెల రవమిది' సినిమా కథ గురించి చెప్పుకోవాలంటే... ఐదు భారతీయ నృత్యరీతుల్లో తన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకోవాలని తపన పడే వ్యక్తి పావని (ఇంద్రాణి దావులూరి). రమేశ్ (విక్రమ్ కొల్లూరు Vikram Kolluru)తో వివాహం అయిన తర్వాత అయిష్టంగానే అమెరికా వెళుతుంది. అక్కడ భర్త సహకారంలో డాన్స్ స్కూల్ ప్రారంభిస్తుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఓ యేడాది పాటు పిల్లలు వద్దనుకుంటుంది. అనుకోని ఉపద్రవంతో ఆమెకు ఆపరేషన్ జరుగుతుంది. దాంతో ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని వైద్యులు చెబుతారు. వారసుడి కోసం రమేశ్ ను మరో పెళ్ళి చేసుకోమని అతని తల్లి (జయలలిత) ఒత్తిడి చేస్తుంది. మరి అంతర్జాతీయ స్థాయిలో తన నృత్యకళను ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న పావని కోరిక తీరిందా? రమేశ్ భార్యకు విడాకులు ఇచ్చి, మరో పెళ్ళి చేసుకున్నాడా? క్లిష్ట సమయంలో పావనికి చేదోడుగా నిలిచిన భరద్వాజ్ (ఆదిత్య మీనన్ Aditya Menon) ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం మిగిలిన సినిమా.
వాస్తవం మాట్లాడుకోవాలంటే... నృత్య ప్రధానంగా వచ్చే ఇలాంటి సినిమాలకు ఇవాళ ఆదరణ అంతంత మాత్రమే. అయితే తమ ప్రతిభను చాటుకోవడం కోసం రిస్క్ చేసి మరి ఇంద్రాణి వంటి వారు సినిమాలను తీస్తున్నారు. ఇలాంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందకపోయినా... ఒక్కోసారి అవార్డుల రూపంలో వారికి కొంత స్వాంతన లభిస్తుంటుంది. 'అందెల రవమిది' సినిమా కూడా విడుదలకు ముందే డీసీ సౌత్ ఫిలిమ్ ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ ఫిలిమ్, ఇండియా ఇండిపెండెంట్ ఫిలిమ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఉమెన్ మేడ్ ఫిలిమ్, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్... పురస్కారాలను గెలుచుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే... చాలా భాగం షూటింగ్ అమెరికాలోనే జరిగింది. ఓ యాక్సిడెంట్ తో సినిమా మొదలై, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. కథలో కొత్తదనం పెద్దంత లేకపోయినా... స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంది. ఓ లక్ష్యం దిశగా సాగే మహిళలు ఎన్ని కష్టాలు ఎదురైనా, తట్టుకుని ముందుకు సాగాలనే సందేశం ఈ సినిమాలో ఉంది. పరిమితమైన బడ్జెట్ లో సినిమాను పూర్తి చేసినట్టు అర్థమౌతోంది.
నటీనటుల విషయానికి వస్తే... గతంలోనే నటనానుభవం ఉన్న ఇంద్రాణి దావులూరి తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చింది. ముఖ్యంగా ద్వితీయార్థంలో సెంటిమెంట్ సీన్స్ ను చక్కగా చేసింది. దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకుంది. ఆమె తల్లిదండ్రులుగా ఐడీపీఎల్ నిర్మల, తనికెళ్ళ భరణి (Tanikella Bharani) నటించారు. భర్తగా విక్రమ్ కొల్లూరు, అత్తగారిగా జయలలిత (Jayalalitha), స్నేహితుడిగా ఆదిత్య మీనన్ యాక్ట్ చేశారు. కార్తీక్ కొడకండ్ల స్వరాలు, వెంకటేశ్ పట్వారీ నేపథ్య సంగీతం బాగున్నాయి. ద్వితీయార్థంలోని నేపథ్య గీత సాహిత్యం ప్రేరణదాయకంగా ఉంది. ఎస్. కె. భూపతి, హర్ష్ మహదేశ్వర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ సాఫీగా సాగిపోతుంది. అయితే ఇలాంటి సినిమాలకు థియేటర్లలో పెద్దంతగా ఆదరణ లభించదనే గ్రహింపు మేకర్స్ కూ ఉన్నట్టుంది. అందుకే పరిమితమైన స్క్రీన్స్ లోనే దీన్ని ప్రదర్శిస్తున్నారు. నృత్యంలో ప్రవేశం ఉన్నారు, నృత్యాన్ని ఇష్టపడేవారు ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడైనా ఈ సినిమాను చూస్తే... ఆనందిస్తారు.
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: అందెల రవమేదీ!?