Sashivadane Review: శశివదనే మూవీ ఎలా ఉందంటే

ABN , Publish Date - Oct 10 , 2025 | 05:31 PM

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘శశివదనే’. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వం వహించారు. కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 

సినిమా రివూ: శశివదనే (Sasivadane Review)
విడుదల తేది: 10–10–2025


రక్షిత్‌ అట్లూరి (Rakshit Atluri) కోమలి ప్రసాద్‌ (komali preasad) జంటగా తెరకెక్కిన సినిమా ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోడల నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమిది. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వం వహించారు. కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 

Sasivadane Story:
రాఘవ (రక్షిత్‌ అట్లూరి) గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో తండ్రే పెంచి పెద్ద చేస్తాడు. ఉన్నంతలో కొడుకుకి ఏ లేకుండా చూసుకుంటాడు. ఎంఎస్‌సీ ఎంట్రన్స్‌ రాయడం కోసం ప్రయత్నం చేస్తూ ఆడుతూపాడుతూ తిరుగుతున్న రాఘవకి శశి బెల్లంకొండ (కోమలి ప్రసాద్‌) తారసపడుతుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసమై తిరుగుతూ ఉంటాడు. మొత్తాని ఆమె కూడా ఇతని ప్రేమలో పడుతుంది. శశి బావ(దీపక్‌ ప్రిన్స్‌)తో గొడవ పెట్టుకుంటాడు రాఘవ. దాంతో రాఘవపై రివేంజ్‌ తీర్చుకోవాలని చూస్తాడు శశి బావ. ఇంతకీ శశి బావ, రాఘవ ఒకరిపై ఒకరు పెంచుకున్న క్షక్షను ఎలా తీర్చుకున్నారు? రాఘవ జైలుకి ఎందుకు వెళ్లాడు? వీరిద్దరి ప్రేమకథ కంచెకు చేరిందా లేదా అనేది అన్నది సినిమా.  


Sashi.jpg

విశ్లేషణ.. (
Sasivadane Review)


2007 సమయంలో గోదావరి తీరంలో ఓ గ్రామంలో సాగే కథ ఇది. ఓ జంట మధ్య ప్రేమ, ఆ ప్రేమకు అడ్డుగా విలన్‌గా అమ్మాయి బావ.. వీరి మఽధ్యసాగే రివేంజ్‌ డ్రామా ఇది. ఫస్టాఫ్‌ అంతా అమ్మాయి ప్రేమ కోసమే తిరుగుతుంటాడు హీరో. అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు ఫస్టాఫ్‌ అంతా తీసుకున్నాడు. కథగా చూస్తే ఇదేమీ కొత్తది కాదు. ఈ మధ్యకాలంలో గోదావరి నేపధ్యంలో ఇలాంటి ప్రేమకథలు చాలానే వచ్చాయి. సీన్‌ ముందుకెళ్లేకొద్దీ ఎక్కడో చేశామనే భావనే కలుగుతుంది. అలాగే హీరోయిన్‌ చుట్టూనే హీరో తిరుగుతూ కనిపించడం సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ తర్వాత అయినా ఏదన్నా మెలిక ఉంటుంది అనుకుంటే అదీ లేదు. విలన్‌ పాత్రకు ఏదో పెద్ద బ్యాగ్రౌండ్‌ ఉన్నట్లు చూపిస్తారు. అతని కుటుంబం నేపథ్యం ఏంటనేది చెప్పలేదు. స్టోరీ రన్‌లో ముందు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ప్రమోషన్స్‌లో చెప్పినట్లే అసలు విషయం అంతా క్లైమాక్స్‌లోనే పెట్టాడు దర్శకుడు. సెకెండాఫ్‌ స్టార్టింగ్‌ నుంచి ఓ 20 నిమిషాలు సాధారణంగానే సాగినా రాఘవ తండ్రి మరణం నుంచి సినిమాలో ఎమోషన్‌ మొదలువుతుంది. కథ కూడా పరుగు తీస్తుంది. క్లైమాక్స్‌ మాత్రం దర్శకుడు బాగా రాసుకున్నాడు. చక్కగా ఎగ్జిక్యూట్‌ చేశాడు. ఫస్ట్‌ సాంగ్‌ అవసరం లేదనిపిస్తుంది. హీరోహీరోయిన్‌ మధ్య లవ్‌ సీన్స్‌, కెమిస్ట్రీ బావుంది. అయితే గోదారి గట్టు, కొబ్బరి తోటలు వదిలేసి ఓ రొమాంటిక్‌ సీన్‌ను గుడిలో ఎందుకు పెట్టారో అర్థం కాదు. తండ్రీకి కొడుకుకి మంచి బాండింగ్‌ ఉన్నా భావోద్వేగాలు మిస్‌ అయ్యాయి.  

నటీనటులు - సాంకేతిక నిపుణులు పనితీరు..
రక్షిత్‌ అట్లూరిలో మంచి ఈజ్‌ ఉంటుంది. నటన పరంగా ఓకే. అయితే కొన్ని సీన్స్‌లో తేలిపోయాడు. ఎమోషన్స్‌ క్యారీ చేయలేకపోయాడు. కోమలి ప్రసాద్‌ అందం, అభినయంతో మెప్పించింది. ఈ సినిమాకు ఆమె ప్లస్‌ పాయింట్‌. కాస్య్టూమ్‌ నుంచి అన్ని విషయాల్లోనూ బెస్‌ అనిపించింది. కెమిస్ట్రీతోపాటు ఎమోషన్స్‌ కూడా బాగా వర్కవుట్‌ చేసింది. రక్షిత్‌కు తండ్రిగా శ్రీమాన్‌ బాగానే చేశాడు. విలన్‌ పాత్రలో దీపక్‌ ప్రిన్స్‌ ఓకే. హీరో ఫ్రెండ్‌గా జబర్దస్ట్‌ బాబీ అక్కడక్కడా నవ్వించాడు. మిగిలినవారి గురించి అంతగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మామూలుగా గోదావరి అందాలను చూపించడానికి ఏ సినిమాటోగ్రాఫర్‌ అయిన ప్రత్యేక శ్రద్ద చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అలా లేదు. సాయికుమార్‌ ధార కెమెరా వర్క్‌ చాలా డల్‌గా అనిపించింది. ఇంకా బాగా చూపించవచ్చనే భావన కలుగుతుంది. శరవణ వాసుదేవన్‌ సంగీతం బావుంది. అయితే ఫస్టాఫ్‌లో వెంటవెంటనే రెండు పాటలు అవసరం లేదనిపించింది  క్లైమాక్స్‌లో నేపథ్య సంగీతం బావుంది. ఫస్టాఫ్‌కు గ్యారీ బీహెచ్‌ కాస్త కత్తెర వేసుంటే ల్యాగ్‌ అనిపించేది కాదు. కథ రొటీన్‌గా ఉన్నప్పుడు దానిని ఎంత కొత్తగా చూపించాలా అన్నదానిపై దర్శకుడు దృష్టి పెట్టాలి. దర్శకుడు అలా చేయలేదు. కేవలం క్లైమాక్స్‌ సీన్స్‌పై నమ్మకంతో ముందుకు వెళ్లిపోయినట్లు అనిపించింది. అయితే క్లైమాక్స్‌ను మాత్రం మెచ్చుకోవాలి. మాటలు బాగా రాసుకున్నాడు. నిర్మాతలు ఖర్చు తెరపై కనిపించింది. కథ రొటీన్‌, ఫస్టాఫ్‌ సాగదీత అయినా.. కాస్త ఓపికగా ఉంటే క్లైమాక్స్‌ మెప్పిస్తుంది.

ట్యాగ్‌లైన్‌: రొటీన్ వదనం

రేటింగ్: 2.25/5

Updated Date - Oct 10 , 2025 | 05:51 PM