సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Idly Kottu: ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ

ABN, Publish Date - Oct 01 , 2025 | 02:23 PM

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఇడ్లీ కొట్టు' సినిమా అక్టోబర్ 1న విడుదలైంది. నిత్యామీనన్, షాలినీ పాండే, సత్యరాజ్, అరుణ్‌ విజయ్, పార్తీబన్, సముతిర ఖని, రాజ్ కిరణ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.

Idly Kottu Movie review

తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush), నిత్యామీనన్ (Nitya menen) జంటగా నటించిన సినిమా 'ఇడ్లీ కొట్టు' (Idly Kottu). 'పా పాండి, రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాల తర్వాత ధనుష్‌ దర్శకత్వం వహించిన నాలుగో సినిమా ఇది. దీనికి నిర్మాత కూడా ధనుషే. 'తిరు' (Thiru) చిత్రం తర్వాత ధనష్, నిత్యామీనన్ మరోసారి జోడీ కట్టిన 'ఇడ్లీ కొట్టు' దసరా కానుకగా అక్టోబర్ 1న విడుదలైంది. సొంత ఊరును, కన్నవారిని, వారసత్వంగా వచ్చిన ఉపాధిని వదిలి దూరంగా వెళ్ళిపోవడం మంచిది కాదనే సందేశంతో తెరకెక్కిన 'ఇడ్లీ కొట్టు' ఎలా ఉందో చూద్దాం.


శివ కేశవులు (రాజ్ కిరణ్‌ Raj Kiran), కస్తూరి (గీత కైలాసం) ఒక్కగానొక్క కొడుకు మురళీ (ధనుష్‌). తల్లి (వడివుక్కరసి) నుండి ఇడ్లీ వేయడం నేర్చుకున్న శివకేశవులు సొంతూరు శంకరాపురంలో 'ఇడ్లీ కొట్టు'తో ఫేమస్ అవుతాడు. కొడుకు మురళీ కూడా తన తదనంతరం ఇదే హోటల్ ను నడపాలని కోరుకుంటాడు. హోటల్ మేనేజ్ మెంట్ లో పట్టా పొందిన మురళీ... తండ్రి ఆలోచనలకు భిన్నంగా బ్యాంకాక్ లో ఎ.ఎఫ్.సి. గ్రూప్ హోటల్స్ లో ఉన్నత ఉద్యోగంలో చేరతాడు. ఆ సంస్థ అధినేత విష్ణువర్థన్ (సత్యరాజ్ Satya Raj) కూతురు మీరా (షాలినీ పాండే Shalini Pandey) మురళీని ఇష్టపడటంతో ఆమెతో పెళ్ళి ఏర్పాట్లు జరుగుతాయి. మీరా, మురళీని పెళ్ళాడటం ఆమె అన్న అశ్విన్ (అరుణ్‌ విజయ్ Arun Vijay)కు ఇష్టం ఉండదు. మూడు, నాలుగు రోజుల్లో పెళ్ళి అనగా మురళీ తండ్రి కన్నుమూయడంతో హుటాహుటిన అతను ఇండియాకు వచ్చేస్తాడు. తండ్రి హఠాన్మరణంతో మురళీ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి? ఇంటర్నేషనల్ బిజినెస్ టైకూన్ కుమార్తెతో జరగాల్సిన పెళ్ళిని మురళీ ఎందుకు కాన్సిల్ చేసుకున్నాడు? తండ్రి ఆశలను, ఆశయాలను నిలబెట్టడం కోసం అతను ఏం చేశాడు? ఆ క్రమంలో మురళీకి బాసటగా నిలిచిన కళ్యాణీతో అతనికి ఉన్న అనుబంధం ఏమిటీ? మురళీని ఇబ్బంది పెట్టాలని చూసిన పట్టాభి (సముతిర ఖని)కి ఏ గతి పట్టింది? ఇదే మిగతా సినిమా.


సొంత ఊరును, తల్లిదండ్రులను విడిచి ఇవాళ యువత భవిష్యత్తును వెతుక్కుంటూ రెక్కలొచ్చిన పిట్టల మాదిరి నగరాలకు, విదేశాలకు వలస వెళ్ళిపోతోంది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టలేం. నూటికో, కోటికో ఒకరిద్దరు మాత్రం మూలాలను వెతుక్కుంటూ తిరిగి సొంతూరుకు వస్తున్నారు. అలాంటి ఓ మురళీ అనే యువకుడి కథే ఈ సినిమా. తండ్రి మరణానంతరం తిరిగి వచ్చిన ఆ యువకుడు సొంతవూరి మనుషుల మనసుల్ని ఎలా గెలిచాడు? తండ్రి చిన్నప్పుడు బోధించిన 'అహింసా పరమో ధర్మః' అనే మాటను ఆచరించడానికి ఎంత కష్టపడ్డాడు? అనేది తెలిపే ప్రయత్నం చేశాడు ధనుష్‌.

తండ్రి బాటలో సాగడానికి సిద్థమైన మురళీ కష్టాలు గట్టెక్కి, ఊరి వారి విశ్వాసాన్ని అతను తిరిగి పొందడంతో ఫస్ట్ హాఫ్‌ పూర్తవుతుంది. నిజానికి అక్కడితో సినిమా అయిపోయినట్టే. కాకపోతే... విష్ణువర్థన్ లాంటి బిజినెస్ టైకూన్ తో గొడవపడితే... ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందో చెప్పడానికి ద్వితీయార్థంపై ఆధారపడ్డాడు ధనుష్‌. అందువల్ల ఫస్ట్ హాఫ్‌లో ఉన్న సెంటిమెంట్ సెకండ్ హాఫ్‌ లో మిస్ అయ్యింది. ద్వితీయార్ధం అంతా విలన్ ఇగో క్లాష్‌ తో యాక్షన్ మూవీగా మారిపోయింది. అహింస తో అవతలివాళ్ళ మనసుల్ని జయించాలని మురళీ అనుకున్న తర్వాత కథ నెమ్మదించింది. అక్కడక్కడే కథ తిరగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది.

ధనుష్‌ ఎంచుకున్న కథ మంచిదే అయినా... ఇవాళ్టి జనరేషన్ నుండి దీనికి ఆమోదం లభించడం కష్టం. 'ఓకల్ ఫర్ లోకల్' అనే నినాదాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం జపిస్తోంది. మురళీ కూడా కెరీర్ ప్రారంభంలో తండ్రితో ఈ విషయమై చర్చిస్తాడు. అయితే అందుకు ఆయన ససేమిరా అనడంతో తప్పని పరిస్థితుల్లో ఊరు వదిలి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ ప్రస్థావన మురళీతో అప్పుడు తెప్పించకుండా, తండ్రి మరణానంతరం అతను తన మనసులోని ఆలోచనలను కార్యరూపంలో పెట్టినట్టు చూపి ఉంటే... బాగుంది. తన తండ్రి ప్రారంభించిన ఇడ్లీ కొట్టును అంతర్జాతీయ స్థాయిలోకి తీసికెళ్ళినట్టు చూపించి ఉంటే... ఈ తరానికి కొంతలో కొంత ఆదర్శప్రాయంగా సినిమా ఉండి ఉండేది. కానీ ధనుష్ ఆ ప్రయత్నం చేయలేదు. దాంతో ఇది అవుట్ అండ్ అవుట్ సెంటిమెంట్ అండ్ ఇగో క్లాష్ మూవీగా ఉండిపోయింది.


నటీనటుల విషయానికి వస్తే ధనుష్‌ తన పాత్రను బాగా పోషించాడు. దర్శకుడిగానూ తనదైన ముద్రను వేశాడు. కానీ కథను రాసుకోవడంలోనే తడబడ్డాడు. నిత్యామీనన్ ఎంట్రీ కాస్తంత ఆలస్యమైనా... ఎప్పటిలానే సహజ నటనను ప్రదర్శించింది. షాలినీ పాండేకు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర లభించింది. ముఖ్యంగా క్లయిమాక్స్ లో ఆమె పాత్రను దర్శకుడు ధనుష్‌ ఎలివేట్ చేసిన తీరు బాగుంది. రాజ్ కిరణ్, గీతా కైలాసం, సత్యరాజ్, అరుణ్ విజయ్, ఇలవరసు ఇలా అంతా తమ పాత్రలకు చక్కని న్యాయం చేకూర్చారు. ఇతర ప్రధాన పాత్రలను ఇందుమతి మణికందన్, బ్రిగిడ సగా, 'ఆడుకాలం' నరేన్, పార్తీబన్, సముతిర కని తదితరులు పోషించారు. జీవీ ప్రకాశ్‌ (GV Prakash Kumar) నేపథ్య సంగీతం బాగుంది. నేపథ్యంలో వచ్చే పాటలకు అందించిన సాహిత్యం, స్వరాలు చక్కగా ఉన్నాయి. ఈ సినిమాకు కిరణ్‌ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందించగా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఆకాశ్‌ భాస్కరన్, ధనష్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో చింతపల్లి రామారావు విడుదల చేశారు. దసరా కానుకగా వచ్చిన 'ఇడ్లీ కొట్టు'ను కుటుంబమంతా కలిసి చూడొచ్చు. కాకపోతే... ఆసక్తి కలిగించని కథనం, ద్వితీయార్థం సాగిన తీరు మూవీకి మెయిన్ మైనస్ అని చెప్పకతప్పదు.

రేటింగ్ 2.5/ 5

ట్యాగ్ లైన్: గిరాకీ లేని ఇడ్లీ కొట్టు!

Updated Date - Oct 01 , 2025 | 02:29 PM