NTR: వార్ 2 విషయమై నాగవంశీ వివరణ
ABN, Publish Date - May 01 , 2025 | 01:12 PM
'దేవర' సినిమా పంపిణీ హక్కుల్ని తీసుకున్న సూర్యదేవర నాగవంశీ ఎన్టీఆర్ తాజా చిత్రం 'వార్ -2' రైట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి తారక్ (Nandamuri Tarak) నటిస్తున్న హిందీ చిత్రం 'వార్ -2' (War -2). హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో తారక్ ఉత్తర భారతదేశంలోనూ తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అయితే... ఈ సినిమా విషయంలో తెలుగునాట ఓ వార్త కొంతకాలంగా చక్కర్లు కొడుతూ ఉంది. ఈ విషయమై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) వివరణ ఇచ్చారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే సూర్యదేవర నాగవంశీకి ఎంతో అభిమానం. ఎన్టీఆర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంలోనూ సినిమాలు చేశాడు. అయితే... 'అరవింద సమేత' (Aravinda Sametha) మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రంగా గత యేడాది 'దేవర' (Devara) వచ్చింది. ఆ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించకపోయినా ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా... రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ సినిమాను పంపిణీ చేశాడు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ విషయంలోనూ, అలానే ఏ యే ఏరియాల్లో బ్రేకీవెన్ అయ్యిందనే అంశంలోనూ మీడియాలో చాలా చర్చలు జరిగాయి. సూర్యదేవర నాగవంశీ మీడియాతో మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే... తాజాగా ఎన్టీఆర్ మూవీ 'వార్ -2' పంపిణీ హక్కుల్ని కూడా సూర్యదేవర నాగవంశీ రెండు తెలుగు రాష్ట్రాలకూ తీసుకున్నాడనే ప్రచారం జరిగింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. 'వార్ -2' హక్కుల్ని తాము తీసుకోలేదని, ఒకవేళ అదే జరిగితే... అధికారికంగా ప్రకటిస్తామని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని ఎన్టీఆర్ అభిమానులకు ఆయన తెలిపాడు. మొత్తం మీద 'దేవర' పంపిణీ హక్కుల విషయమైన రేగిన వివాదంతో సూర్యదేవర నాగవంశీ ఎన్టీఆర్ విషయంలోనూ, అతని అభిమానుల విషయంలోనూ కొంత జాగ్రత్తగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
Also Read: Tollywood: మహానటి తేదీనే శుభం అంటున్న సమంత
Also Read: Bhogi: భీమ్స్ ను తప్పించారా... తప్పుకున్నాడా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి