Vivek Agnihotri: 'ది బెంగాల్ ఫైల్స్' విడుదలకై రాష్ట్రపతికి వినతి...
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:18 PM
ఫైల్స్ పేరుతో అతను తీయాలనుకున్న మూడు చిత్రాలలో ఇది చివరిది. ఇందులో మొదటి సినిమాను వివేక్ అగ్నిహోత్రి 'ద తాష్కెంట్ ఫైల్స్' (The Tashkent Files) అనే పేరుతో 2019లో తీశాడు. ఇది లాల్ బహుదూర్ శాస్త్రి మృతి చుట్టూ తిరిగే కథ. ఇక రెండో సినిమా 2022లో వచ్చిన 'ది కాశ్మీర్ ఫైల్స్'. దీని గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు వస్తున్న 'ది బెంగాల్ ఫైల్స్' కూడా ముందు సినిమా కారణంగా విడుదలకు ముందే వివాదాలకు తెరలేపింది.
'ది కశ్మీర్ ఫైల్స్' (The Kashmir Files) మూవీతో అందరి దృష్టీ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) మీదకు మళ్ళింది. ఆ సినిమా ఘన విజయాన్ని సాధించడమే కాదు... కాశ్మిరీ పండితుల వెతలను వెలుగులోకి తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సినిమా పలు అవార్డులనూ గెలుచుకుంది. ఆ తర్వాత వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'వాక్సిన్ వార్' మూవీ పరాజయం పాలైంది. దాంతో ఇప్పుడు మరోసారి తనకు అచ్చివచ్చిన అంశాన్ని వివేక్ అగ్నిహోత్రి సినిమాగా మలిచారు.
భారతదేశ స్వాతంత్రోత్సవానికి ముందు 1946లో బెంగాల్ లో జరిగిన మారణహోమాన్ని బేస్ చేసుకుని 'ది బెంగాల్ ఫైల్స్' (The Bengal Files) మూవీని వివేక్ అగ్రిహోత్రి తెరకెక్కించాడు. ఫైల్స్ పేరుతో అతను తీయాలనుకున్న మూడు చిత్రాలలో ఇది చివరిది. ఇందులో మొదటి సినిమాను వివేక్ అగ్నిహోత్రి 'ద తాష్కెంట్ ఫైల్స్' (The Tashkent Files) అనే పేరుతో 2019లో తీశాడు. ఇది లాల్ బహుదూర్ శాస్త్రి మృతి చుట్టూ తిరిగే కథ. ఇక రెండో సినిమా 2022లో వచ్చిన 'ది కాశ్మీర్ ఫైల్స్'. దీని గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు వస్తున్న 'ది బెంగాల్ ఫైల్స్' కూడా ముందు సినిమా కారణంగా విడుదలకు ముందే వివాదాలకు తెరలేపింది. సెప్టెంబర్ 5న మూవీని విడుదల చేయాలని వివేక్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కోల్ కత్తాలో విడుదల చేయడానికి ఆయన ప్రయత్నిస్తే... అక్కడి ప్రభుత్వం దానిని అడ్డుకుంది. దాంతో ఎలాగైనా ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదల చేయాల్సిందేనని వివేక్ అగ్నిహోత్రి పట్టుదలతో ఉన్నాడు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు. విదేశాల నుండి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు వివేక్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నాడు.
ఇప్పుడీ సినిమాకు ప్రముఖ నటుడు, బీజేపీ బెంగాల్ నాయకుడు విక్టర్ బెనర్జీ (Victor Banerjee) సైతం బాసటగా నిలిచాడు. బెంగాల్ లోని చీకటి అధ్యాయం ఈతరంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయమని, ఈ సినిమా విడుదలను అడ్డుకోవడం అంటే... భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అని విక్టరీ బెనర్జీ వాదిస్తున్నారు.
'ది బెంగాల్ ఫైల్స్' సినిమాలో దర్శన్ కుమార్, పల్లవి జోషి, స్మిరత్ కౌర్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సస్వత ఛటర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా నిడివి 204 నిమిషాలు. ఈ సినిమా విడుదలకు సహకరించాలని కోరుతూ రాష్ట్రపతికి విక్టర్ బెనర్జీ ఓ వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నాడు. మరి రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారా? ఈ సినిమా విడుదల సజావుగా జరగడానికి ఆమె చొరవ చూపుతారా? అనేది వేచి చూడాలి.
Also Read: Chiranjeevi : బాబీ బలే ముందుకొచ్చేశాడే...
Also Read: Yandamuri: సంబంధంలేని విషయాల్లో చిరంజీవి వేలు పెట్టరు...